పెనుగంచిప్రోలు, న్యూస్‌లైన్ : తిరుపతమ్మ అమ్మవారి చిన్న తిరునాళ్ల ఆదివారం ప్రారంభం కానుంది. మార్చి 16 నుంచి 20 వరకు ఘనంగా నిర్వహించనున్న ఈ ఉత్సవాలకు కృష్ణా, ఖమ్మం, గుంటూరు, ప్రకాశం, నల్గొండ, కరీంనగర్, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు హైదరాబాద్ నుంచి కూడా భక్తులు లక్షలాదిగా తరలివస్తారు.
ఆలయ ఈఓ సీహెచ్ హనుమంతరావు, చైర్మన్ వాసిరెడ్డి బెనర్జీ, పాలకవర్గం భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు విస్తృత చర్యలు చేపట్టారు. ఇప్పటికే విద్యుద్దీప కాంతులతో ఆలయాన్ని అందంగా అలంకరించారు. గ్రామంలోని కూడళ్లతో పాటు పలుచోట్ల స్వాగత ద్వారాలు, ఆలయం వద్ద ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. సుమారు రూ.20 లక్షలు వెచ్చించి విద్యుద్దీపకాంతులు, బారికేడింగ్, మునేరులో భక్తుల సౌకర్యార్థం జల్లు స్నానాల ఏర్పాటు, ఆలయం చుట్టూ, మునేరులో భక్తులు తలనీలాలు సమర్పించేందుకు ప్రత్యేక షామియానాల ఏర్పాట్లు నిర్వహించారు.
అఖండజ్యోతితో ఉత్సవాలు ప్రారంభం...
ఈ నెల 16న ఉదయం అఖండజ్యోతి స్థాపనతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. 17న సాయంత్రం గ్రామంలో రథోత్సవం, 18న ఉదయం ప్రత్యేక అభిషేకం, అనంతరం లక్ష కుంకుమార్చన, 19న సాయంత్రం ఆలయం చుట్టూ 90 అడుగుల దివ్య ప్రభోత్సవం నిర్వహిస్తారు. 20న సాయంత్రం తిరునాళ్లలో ప్రధాన ఘట్టమైన పుట్టింటి పసుపు కుంకుమల బండ్లు అనిగండ్లపాడు నుంచి రావటంతో ఉత్సవాలు ముగుస్తాయి.
భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం...
తిరునాళ్లకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలూ కల్పిస్తామని ఆలయ చైర్మన్ వాసిరెడ్డి బెనర్జీ, ఈఓ సీహెచ్ హనుమంతరావు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం చేస్తున్న ఏర్పాట్లను శనివా రం వారు పరిశీలించారు. అనంతరం ఆలయ చాంబర్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉత్సవాలు జరిగే ఐదు రోజులూ ఆలయం వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని, ఇందుకు ఏర్పాట్లు పూర్తిచేశామని వివరించారు. అమ్మవారి పసుపు కుంకుమల ఉత్సవం రోజున పలు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
కేశఖండన శాల వద్ద భక్తుల స్నానాల కోసం తాత్కాలిక పంపులు అదనంగా ఏర్పాటు చేశామన్నారు. నిరంతరం సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ ఆవరణలో వివిధ శాఖల కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నంది గామ డీఎస్పీ ఆధ్వర్యంలో, జగ్గయ్యపేట సీఐ ప్రసన్న వీరయ్యగౌడ్ పర్యవేక్షణలో విస్తృత బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్‌ఐ నీగప్రసాద్ తెలిపారు.
ప్రతిరోజూ 50 వేల లడ్డూలు సిద్ధం...
తిరునాళ్లకు వచ్చే భక్తుల కోసం లడ్డూ ప్రసాదాలను పెద్ద ఎత్తున సిద్ధం చేస్తున్నారు. లడ్డూ తయారీకి స్థానిక సిబ్బందితో పాటు ప్రత్యేక సిబ్బందిని నియమించారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రసాదాలను నిల్వ ఉంచుకునేలా సిద్ధం చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఉత్సవాలలో ప్రతిరోజూ 50 వేల లడ్డూలు సిద్ధంగా ఉంటాయన్నారు. తిరునాళ్లలో ప్రధాన ఘట్టం, ముగింపు రోజు అయిన 20న లడ్డూలు అదనంగా సిద్ధంగా చేస్తామని చెప్పారు.
నేటినుంచి తిరుపతమ్మ చిన్నతిరునాళ్ల
Published Sun, Mar 16 2014 2:48 AM | Last Updated on Sat, Sep 2 2017 4:45 AM
Advertisement
Advertisement