నందిపాడ్ (మిర్యాలగూడ క్రైం), న్యూస్‌లైన్: నందిపాడు గ్రామంలో బుధవారం అర్ధరాత్రి ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. అదే ఇంట్లో ఆమె భర్త అనుమానాస్పద స్థితిలో ఇంట్లో సీలింగు ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకేరోజు భార్యాభర్త మృతిచెందడంతో గ్రామస్తులు భయభ్రాంతులకు గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నేరేడుచర్ల మండలం రామాపురానికి చెందిన ఆవుల బంగారయ్య(25), తిరుపతమ్మ(22)లకు మూడేళ్ల క్రితం వివాహమైంది. వీరు బతుకుదెరువు కోసం రెండేళ్ల క్రి తం నందిపాడు గ్రామానికి వచ్చి గది అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. బంగారయ్య తల్లి గురువమ్మ అదే గ్రామంలో వేరేచోట గుడిసె వేసుకుని నివాసముం టోంది.
బుధవారం రాత్రి 9 గంటల వరకు కుమారుడి ఇంట్లో గడిపిన గురవమ్మ ఆ తర్వాత తన ఇంటికి వెళ్లిపోయింది. గురువారం తెల్లవారుజామున ఆమె కుమారుడి ఇంటికి రాగా తలుపు బయట వైపు గడియ వేసి ఉంది. గడియ తీసి ఇంట్లోకి వెళ్లి చూడగా కోడలు తిరుపతమ్మ మంచంలో రక్తపు మడుగులో పడి ఉండగా, కుమారుడు బంగారయ్య సీలింగు ఫ్యానుకు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. అతని రెండు చేతులు చున్నీతో కట్టి ఉన్నాయి. దీంతో ఆమె ఇరుగు పొరుగును పిలిచి విషయం చెప్పింది. వారు పోలీసులకు సమాచారం అందించారు. డీఎస్పీ సుభాష్‌చంద్రబోస్, ప్రొబేషనరి డీఎస్పీ విజయభాస్కర్, రూరల్ సీఐ వెంకటేశ్వర్‌రెడ్డి, ఎస్‌ఐ రాహుల్‌దేవ్‌లు సంఘటన స్థలాన్ని సందర్శించారు.
నల్లగొండ నుంచి డాగ్ స్క్వాడ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. మృతులిద్దరూ నిరుపేదలు కావడం, వారి వద్ద విలువైన వస్తువులు, డబ్బు లేకపోవడంతో ఇతరులు హత్య చేసే అవకాశం లేదని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. భార్యాభర్త గొడవపడిన సందర్భంలో తిరుపతమ్మ తలపై గురవయ్య రోకలిబండతో కొట్టడంతో చనిపోయి ఉండొచ్చని, దిక్కుతోచని స్థితిలో అతను కూడా ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. డాగ్ స్క్వాడ్ సైతం ఇంట్లోకి వెళ్లి మృతుడి చుట్టూ తిరిగి, ఇంట్లో ఉన్న బావి వద్దకు వెళ్లింది. తిరిగి మృతుడి వద్దకు వెళ్లడంతో పోలీసుల అనుమానం బలపడింది. గురువమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్టు డీఎస్పీ సుభాష్‌చంద్రబోస్ తెలిపారు.
మహిళ దారుణ హత్య
Published Fri, Dec 13 2013 2:47 AM | Last Updated on Sat, Sep 2 2017 1:32 AM
Advertisement
Advertisement