పేదరిక నిర్మూలనే లక్ష్యం: చంద్రబాబు | Eradicating poverty is prime goal: Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

పేదరిక నిర్మూలనే లక్ష్యం: చంద్రబాబు

Published Sat, Aug 16 2014 1:06 AM | Last Updated on Sat, Sep 2 2017 11:55 AM

పేదరిక నిర్మూలనే లక్ష్యం: చంద్రబాబు

పేదరిక నిర్మూలనే లక్ష్యం: చంద్రబాబు

కర్నూలులో స్వాతంత్య్ర దిన వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు
 రాష్ట్ర విభజన హేతుబద్ధంగా చేయలేదు. దీంతో చాలా  సమస్యలొచ్చాయి. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలపై  చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. విద్వేషాలు పెంచుకోవడం తెలుగు జాతికి మంచిది కాదు.  హైదరాబాద్ ప్రతిష్టను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీదా ఉంది. తెలంగాణతో సహా పొరుగు రాష్ట్రాలతో సుహృద్భావ సంబంధాలకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నాం
  • ఆర్థిక అసమానతలు లేని, ఆరోగ్యకరమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేస్తాం..
  • ఏటా ఒక్కో జిల్లాలో స్వాతంత్య్ర వేడుకలు నిర్వహిస్తాం
  • మెగా సిటీలుగా విశాఖ, తిరుపతి, విజయవాడ.. జిల్లాకొకటి చొప్పున 13 స్మార్ట్ సిటీలు
  • రాష్ట్రంలో 14 విమానాశ్రయాలు, 14 పోర్టుల అభివృద్ధి
  • అక్టోబర్ 2 నుంచి సంక్షేమ పథకాల అమలు
  • ‘ఎన్టీఆర్ ఆరోగ్య సేవ’గా ఆరోగ్యశ్రీ.. చికిత్స గరిష్ట పరిమితి రూ. 2 లక్షల నుంచి రూ. 2.5 లక్షలకు పెంపు
  • ఎన్టీఆర్ సుజల పేరిట 2 రూపాయలకే 20 లీటర్ల నీరు
  • వచ్చే నెల నుంచి ఉద్యోగులు, పాత్రికేయులకు హెల్త్‌కార్డులు.. చికిత్స గరిష్ట పరిమితి రూ. 2 లక్షలు
  • ఆర్బీఐ అడ్డంకులు సృష్టించినా రుణాలు మాఫీ చేస్తాం
  • ఒక్కో సంఘానికి రూ. లక్ష చొప్పున డ్వాక్రా రుణాల మాఫీ.. ఎస్సీ, ఎస్టీల ఇతర రుణాలూ మాఫీ
 కర్నూలు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: 
 పేదరిక నిర్మూలనే లక్ష్యమని, ఆర్థిక అసమానతలు లేని, ఆరోగ్యకరమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో స్వాతంత్య్ర దిన తొలి వేడుకలను శుక్రవారం కర్నూలులోని ఏపీఎస్పీ పరేడ్ గ్రౌండ్స్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సీఎం చంద్రబాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వివిధ దళాల (కంటింజెంట్ల) నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ ఉత్సవాల్లో శాసన మండలి చైర్మన్ చక్రపాణి, డిప్యూటీ సీఎం కె.ఇ.కృష్ణమూర్తి,  మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, గంటా శ్రీనివాసరావు, ఎంపీలు బుట్టా రేణుక, ఎస్పీవై రెడ్డి, సి.ఎం.రమేష్, ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, గౌరు చరిత, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, బుడ్డా రాజశేఖరరెడ్డి, ఐజయ్య, బీసీ జనార్థన్‌రెడ్డి, జయనాగేశ్వరరెడ్డి, మాజీ మంత్రులు శిల్పామోహన్‌రెడ్డి, టి.జి.వెంకటేశ్, ఏరాసు ప్రతాపరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో గవర్నర్ పాల్గొనలేదు. సీఎస్ ఐ.వై.ఆర్.కృష్ణారావు, డీజీపీ జేవీ రాముడు సీఎంతోపాటు వేదిక మీద ఉన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..
 
  రాజధానిని రాష్ట్రానికి మధ్యలోనే ఏర్పాటు చేసినా, స్వాతంత్య్ర వేడుకలను ఏటా ఒక్కో జిల్లాలో నిర్వహిస్తాం
  జిల్లాకొక పర్యాటక ప్రాజెక్టు రూపొందిస్తాం. ప్రముఖ పుణ్యక్షేత్రాలను కలుపుతూ కొత్త టూరిజం సర్క్యూట్స్ ఏర్పాటు చేస్తాం
  విశాఖ, తిరుపతి, విజయవాడలను మిగతా 2వ పేజీలో ఠ 
 
 మెగాసిటీలుగా, జిల్లాకొకటి చొప్పున 13 స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేస్తాం
 - 14 విమానాశ్రయాలు, 14 పోర్టులు అభివృద్ధి చేస్తాం. తద్వారా మన రాష్ట్రం నుంచి పెద్దఎత్తున ఎగుమతులు, దిగుమతులు చేయొచ్చు
 - అన్ని గ్రామాలకు రోడ్లు, అన్ని ఇళ్లకు కేబుల్, విద్యుత్, గ్యాస్ కనెక్షన్లు ఉండేలా చూస్తాం. పైప్‌లైన్ ద్వారా ఇళ్లకు గ్యాస్ ఇస్తాం
 - రాష్ట్రాన్ని సిలికాన్ ఆంధ్రప్రదేశ్‌గా మారుస్తాం. ప్రపంచంలోనే తొలి డిజిటల్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం. జిల్లాకొక హైదరాబాద్, సైబరాబాద్‌ను అభివృద్ధి చేస్తాం. వచ్చే 5 సంవత్సరాల్లో 5 లక్షల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం
 - రాజధాని పేరతో 13 జిల్లాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం జరుగుతోంది
 - అక్టోబర్ 2 నుంచి సంక్షేమ పథకాలను అమలు చేస్తాం
 - ఆరోగ్యశ్రీ పేరును ‘ఎన్టీఆర్ ఆరోగ్య సేవ’గా మారుస్తాం. చికిత్స గరిష్ట పరిమితిని రూ. 2 లక్షల నుంచి రూ. 2.5 లక్షలకు పెంచుతాం
 - ఎన్టీఆర్ సుజల పేరిట 2 రూపాయలకే 20 లీటర్ల నీటిని సరఫరా చేస్తాం
 - వ్యవసాయ ఉచిత విద్యుత్‌ను 7 గంటల విద్యుత్ 9 గంటలకు పెంచుతాం. అక్టోబర్ 2 నుంచి ఇళ్లకు, పరిశ్రమలకు నిరంతర విద్యుత సరఫరాను అమలు చేస్తాం
 - అసంపూర్తిగా ఉన్న సాగు నీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తాం
 - వృద్ధాప్య పింఛన్లను రూ. 1,000కు, వికలాంగుల పింఛన్లను రూ. 1,500కు పెంచి అక్టోబర్ 2 నుంచి అమలు చేస్తాం. ఎన్టీఆర్ కేంటీన్లు కూడా అదే రోజున ప్రారంభిస్తాం. ఈ పథకం కింద రూ. 5కే భోజనం అందిస్తాం. తొలుత మూడు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసి తర్వాత మిగతా జిల్లాలకు విస్తరిస్తాం
 - ధరలను నియంత్రిస్తాం. ఇందుకోసం సీఎస్ అధ్యక్షతన పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేశాం
 - ఎన్టీఆర్ ప్రజా పంపిణీ పథకం ద్వారా పేదలకు చౌకగా నిత్యావసర సరకులు అందిస్తాం. ధరలు పెరిగితే ప్రభుత్వం జోక్యం చేసుకొని వాటిని తగ్గించడానికి చర్యలు చేపడుతుంది
 - ప్రభుత్వ ఉద్యోగులు, పాత్రికేయులకు హెల్త్ కార్డులు ఇస్తాం. చికిత్స గరిష్ట పరిమితి రూ. 2లక్షలుగా నిర్ధారించాం. వచ్చే నెల 1 నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుంది
 - రైతుల రుణాలు ఒక్కో కుటుంబానికి రూ. 1.5 లక్షల వరకు మాఫీ చేస్తాం. ఆర్బీఐ అడ్డంకలు సృష్టించినా రుణ మాఫీపై వెనక్కి తగ్గం. డ్వాక్రా రుణాలు సంఘానికి రూ. లక్ష చొప్పున మాఫీ చేస్తాం. ఎస్సీ, ఎస్టీలు తీసుకున్న ఇతర రుణాలనూ మాఫీ చేస్తాం.
 - ప్రతి ఇంట్లో కనీసం ఒక డ్వాక్రా గ్రూపు సభ్యురాలు ఉండేలా చర్యలు చేపడతాం. ఇసుక మైనింగ్‌ను డ్వాక్రా సంఘాలకే ఇవ్వనున్నాం
 - పింఛన్లు, రేషన్, స్కాలర్‌షిప్‌లు, పక్కా ఇళ్లతోపాటు అన్ని సంక్షేమ పథకాలూ ఆన్‌లైన్‌లోనే అమలుచేస్తాం. ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ కూడా రాష్ట్రంలో దాదాపు నూరు శాతం పూర్తయింది
 - పేదలకు ఇళ్ల స్థలాలు, పక్కా ఇళ్లు మంజూరు చేస్తాం. ఒక కుటుంబం ఆనందంగా జీవించడానికి అనుకూలంగా పక్కా ఇంటిని మెరుగుపరుస్తాం
 - వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తాం. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయడంవల్ల కూలీల ఖర్చు తగ్గిస్తాం. భూసార పరీక్షలు చేసి, వ్యవసాయ దిగుబడులు భారీగా పెరిగేలా చర్యలు చేపడతాం
 - పోలవరం ప్రాజెక్టును నాలుగైదు సంవత్సరాల్లో పూర్తి చేస్తే రాష్ట్రంలో కరువు లేకుండా చేయవచ్చు
 - రాయలసీమను విత్తన రాజధానిగా, పరిశ్రమల హబ్‌గా మారుస్తాం. సీమలో జాతీయ, రాష్ట్ర రహదారులు నిర్మించి సమీపంలోని ఓడరేవులతో అనుసంధానం చేసి 4 జిల్లాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తాం. కర్నూలు - ప్యాపిలి - పోరుమామిళ్ల - కృష్ణపట్నం, కర్నూలు - నంద్యాల - గిద్దలూరు - గుంటూరు మధ్య 6 లేన్ల రోడ్లు నిర్మిస్తాం
 - పరిశ్రమలు, పెట్టుబడులే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తాయి. ఇందుకోసం ప్రభుత్వం అన్ని ప్రోత్సాహకాలను అందిస్తుంది
 - పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. మధ్యాహ్న భోజన పథకంలో లోపాలను సవరించి మరింత మెరుగ్గా అమలు చేస్తాం.
 - త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తాం. ఇకపై ఏటా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తాం
 - బీసీల సంక్షేమానికి సబ్ ప్లాన్ అమలు చేస్తాం. కాపులు, బలిజలను బీసీల్లో చేర్చే అంశాన్ని పరిశీలించడానికి బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తాం. అగ్రవర్ణాల్లో పేదలనూ ఆదుకుంటాం
 - శాంతిభద్రతల పరిరక్షణలో రాజీపడం. అరాచక శక్తులను, శాండ్, లాండ్, మైన్, వైన్ మాఫియాలను అణచివేస్తాం. బెల్టు షాపుల నిర్మూలనకు చర్యలు చేపట్టాం. మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నాం
 - సమైక్య ఉద్యమంలో పాల్గొన్నవారి మీద పెట్టిన కేసులు దశలవారీగా ఎత్తేస్తాం
 - రూ. 15 వేల కోట్ల లోటు బడ్జెట్‌తో ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించింది. కొత్త రాష్ట్రంలో పునాదుల నుంచి నిర్మాణం మొదలుపెట్టాలి. మనకు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో అంతకు మించిన వనరులూ ఉన్నాయి. మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తాం. అన్ని వనరులు, అవకాశాలను వాడుకొని స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మిద్దా. ఇందులో ప్రజల సహకారం చాలా అవసరం. మీ అండదండలు నాకు ఇవ్వండి
 - దేశ విదేశాల్లో ఉన్న రాష్ట్రానికి చెందిన పారిశ్రామికవేత్తలు, వృత్తి నిపుణులూ (ఎన్నారైలు) మాతృభూమికి రండి. ప్రపంచాన్ని అబ్బురపరిచే విధంగా రాష్టాన్ని నిర్మించుకుందాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement