పానీ.. పరేషానీ..
పట్టణాల్లో తాగునీటి కొరత
సాక్షి, హైదరాబాద్: దాహం.. దాహం.. దాహంతో రాష్ట్రంలోని పట్టణాల గొంతెండిపోతోంది.. గుక్కెడు నీళ్ల కోసం నానా యాతనా పడాల్సి వస్తోంది.. రెండు మూడు రోజులకోసారి, అదీ కొద్ది నిమిషాల పాటే జరుగుతున్న నీటి సరఫరాతో జనం హాహాకారాలు చేస్తున్నారు. ట్యాంకర్లతో సరఫరా చేస్తున్న చోట బిందెడు నీళ్ల కోసం కుస్తీలు పడుతున్నారు. అసలే అంతంత మాత్రంగా సరఫరా అయ్యే నీళ్లు కూడా.. మురికిగా ఉంటుండడంతో తాగలేని పరిస్థితి. దీంతో రోజూ 30-40 రూపాయలు వెచ్చించి మంచినీటిని కొనుక్కోక తప్పడం లేదు. ఇలా పరిస్థితి దుర్భరంగా ఉన్నా.. జనం గోడు పట్టించుకునేవారే కరువయ్యారు. రాష్ట్రంలో పట్టణ జనాభా 2.4 కోట్లుకాగా.. రోజూ 3,240 ఎంఎల్‌డీ నీటిని సరఫరా చేయాలి.. కానీ 1,584 ఎంఎ ల్‌డీ మాత్రమే సరఫరా అవుతోంది.
పనుల్లో జాప్యం..: ప్రజలకు తాగునీటిని సరఫరా చేయాల్సిన బాధ్యత స్థానిక ప్రభుత్వాలది. ఇందుకు అవసరమైన ఆర్థిక వనరులను అందించాల్సిన బాధ్యత రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలది. ప్రస్తుత అవసరాల రీత్యా నిర్ధారిత ప్రమాణాల మేరకు... ప్రతి ఒక్కరికి రోజుకు 135 లీటర్ల నీరు సరఫరా చేయాల్సిన బాధ్యత సంబంధిత మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లది. కానీ ప్రస్తుతం సరఫరా 75 నుంచి 80 లీటర్లకు మించడం లేదు. దీనిని దృష్టిలో పెట్టుకునే జాతీయ పట్టణ నవీకరణ పథకంలో తాగునీటికి ప్రాధాన్యత ఇచ్చినా.. ఆ ప్రాజెక్టులను పూర్తి చేయడంలో విపరీతమైన జాప్యం జరుగుతోంది. కొన్నిచోట్ల ప్రాజెక్టులు పూర్తయినా.. అసలు అక్కడ నీరే అందుబాటులో లేకపోవడం గమనార్హం.
సమ్మర్ స్టోరేజీపై నిర్లక్ష్యం..
సకాలంలో సమ్మర్ స్టోరేజీ రిజర్వాయర్లను నింపుకోవడంలో అధికార యంత్రాంగం విఫలమైంది. దాంతో వేసవిలో తాగునీటి సమస్య మరింతగా పెరిగింది. ఆగంతుక ప్రణాళికలు (కంటింజెన్సీ ప్లాన్) కేవలం కాగితాలకు పరిమితం అవుతున్నాయి. ప్రతీరోజూ సరఫరా చేయాల్సిన చోట 2 నుంచి ఐదారు రోజులకోసారి నీటి సరఫరా జరుగుతోంటే.. ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.
ఎన్నికలు, పన్ను వసూళ్లపైనే దృష్టి..
అసలే అంతంత మాత్రం పనిచేసే అధికార యంత్రాంగం వరుసగా ఎన్నికలు రావడంతో.. మరింత నిర్లక్ష్యం వహించింది. ఎన్నికల పనులు, విధులతో పాటు ఆస్తి పన్ను వసూళ్లపైనే అధికారులు, సిబ్బంది ఎక్కువగా దృష్టిపెట్టి తాగునీటి సరఫరాను గాలికి వదిలేశారు. తెలంగాణ ప్రాంతంలో ఎన్నికల ప్రధాన ఘట్టం పూర్తయినా.. ఇంకా నీటి సమస్యపై అధికారులు దృష్టి సారించకపోవడం గమనార్హం.
రాష్ట్రవ్యాప్తంగా ఇదే దుస్థితి..
తెలంగాణ ప్రాంతంలోని 70 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లతోపాటు, సీమాంధ్ర ప్రాంతంలోనూ తాగునీటి సరఫరా పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. రాష్ట్రంలో మొత్తం 162 మున్సిపాలిటీలు, 19 కార్పొరేషన్లలో సగానికిపైగా పట్టణాలు, నగరాల్లో తాగునీటి సమస్య తాండవిస్తోంది. ప్రతీరోజు మంచినీటి సరఫరా జరిగే మున్సిపాలిటీల సంఖ్య 93 ఉంటే.. 61 మున్సిపాలిటీల్లో 2 రోజులకోసారి, 18 మున్సిపాలిటీల్లో మూడు రోజులకోసారి, రెండు చోట్ల నాలుగు రోజులకోసారి నీటి సరఫరా జరుగుతుండగా... ఐదు మున్సిపాలిటీల్లోనైతే మరీ దారుణంగా ఐదు రోజులకోసారి తాగునీటిని సరఫరా చేస్తున్నారు. అదికూడా చాలా చోట్ల ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు.
వచ్చినా అరకొరే..: రోజూ నీటి సరఫరా చేసే మున్సిపాలిటీల్లో గంట నుంచి రెండు గంటలపాటు ఇస్తే ప్రజలకు ఇబ్బంది ఉండదు. కానీ పేరుకు రోజూ ఇస్తున్నా.. అరగంట పాటు కూడా తాగునీటి సరఫరా జరగడం లేదు. దీంతో బయట క్యాన్ల లెక్కన నీరు కొనుగోలు చేయక తప్పడం లేదు. ఇక అపార్ట్‌మెంట్లలో ఉండే వారికి తాగునీరు ఏమాత్రం సరిపోని దుస్థితి. సురక్షిత నీరు అందకపోవడం వల్ల నగరాలు, పట్టణాల్లోని మురికివాడల ప్రజలు రోగాలబారిన పడుతుండడం మరింత ఆందోళనకరం.
రాష్ట్రంలోని బెల్లంపల్లి, కాగజ్‌నగర్, అచ్చంపేట. భువనగిరి, హుస్నాబాద్, సదాశివపేట, సూర్యాపేట, వనపర్తి, ఇల్లెందు మున్సిపాలిటీల్లో 3 రోజులకోమారు నీటి సరఫరా జరుగుతోంది.
మహబూబ్‌నగర్, మదనపల్లిల్లో నాలుగు నుంచి ఐదారు రోజులకోసారి నీరు సరఫరా చేస్తున్నారు.
కరీంనగర్ జిల్లాలో రామగుండం కార్పొరేషన్‌లో నీటి కొరత తీవ్రంగా ఉంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి కార్పొరేషన్‌కు నీటి సరఫరాకు రూపొందించిన పథకం రాజకీయ కారణాల వల్ల అమలుకు నోచుకోకపోవడం ప్రజలకు శాపంగా మారింది.
సిరిసిల్ల, కోరుట్ల, మెట్‌పల్లి మున్సిపాలిటీల్లోనూ నీటి సరఫరా సరిగా లేదు. పలు చోట్ల ఫిల్టర్‌బెడ్‌లు చెడిపోయాయి. దీంతో శివారు ప్రాంతాల్లో వారానికి రెండుసార్లు మాత్రమే నీటి సరఫరా జరుగుతోంది.
నీళ్లు రాకున్నా.. రూ. 15,300 బిల్లు
‘‘మేము 2005లో నల్లా కనెక్షన్ తీసుకున్నం. మూడు నెలలు మాత్రమే నీళ్లు వచ్చాయి. తర్వాత ఎన్టీపీసీలోని ట్యాంకు నుంచి నీళ్లు ఇడుస్తామన్నరు. ఇప్పటిదాకా చుక్క నీళ్లు రాలేదు. కానీ మా పేరిట ఇప్పటికే రూ. 15,300 బిల్లు వచ్చింది. మేము సీఐఎస్‌ఎఫ్ బ్యారెక్స్ నుంచి నీళ్లు మోసుకొని తెచ్చుకుంటున్నం..’’
- తన్నీరు లక్ష్మి, నర్రశాలపల్లి,
రామగుండం కార్పొరేషన్
పదేండ్ల నుంచి బోరు నీళ్లే..
‘‘మా కాలనీకి నల్లా పైపులైన్ వేయలేదు. పదేండ్ల నుంచి మేము బోరింగ్ నీళ్లే తెచ్చుకుంటున్నం. ఇండ్లకు, బయటకు, తాగడానికి ఆ నీళ్లే వాడుతున్నం. మున్సిపాలిటీ సార్లకు ఎన్నిసార్లు మా బాధలు చెప్పుకున్నా చెవిన పెట్టలేదు. ఇప్పుడైనా పైపులైను వేసి నల్లా కనెక్షన్లు ఇస్తే మా కష్టాలు తీర్తయి..’’
- వానరాసి మైసమ్మ, జగిత్యాల