అందరి ఐక్యతే అబుల్ కలాం ఆకాంక్ష
గుంటూరు ఎడ్యుకేషన్ :దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో వీరోచిత పాత్ర నిర్వర్తించిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ అన్ని వర్గాల ఐక్యతను ఆకాంక్షించిన మహనీయుడని రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎండీ హిదాయత్ అన్నారు. ‘భారతరత్న’ మౌలానా అబుల్ కలాం ఆజాద్ 127వ జయంతి సందర్భంగా మంగళవారం జాతీయ మైనార్టీ సంక్షేమ, జాతీయ విద్యా దినోత్సవాన్ని జిల్లా పరీక్షా భవన్‌లో నిర్వహించారు.
గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తాఫా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న హిదాయత్ మాట్లాడుతూ అబుల్ కలాం మైనార్టీల ఆశాజ్యోతిగా నిలిచారన్నారు.
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా గత ఆర్థిక సంవత్సరంలో రూ.46 కోట్లు సబ్సిడీ రూపంలో అందించామని, ఈ ఏడాది రూ.130 కోట్లు లక్ష్యంగా నిర్దేశించుకున్నామని వివరించారు. ముస్లింలకు రుణ మంజూరు లో బ్యాంకర్లు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేయూలని ప్రభుత్వాన్ని కోరామన్నారు.
వై.ఎస్. వల్ల 4 శాతం రిజర్వేషన్లు
తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా మాట్లాడుతూ దేశంలోని ముస్లింలు దుర్భర స్థితిలో జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ముస్లింలను ఓటు బ్యాంకుగా చూస్తున్న రాజకీయ పార్టీలు వారి సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలు శూన్యమన్నారు. విద్యా, ఉద్యోగ రంగాల్లో ముస్లింలకు లబ్ధి చేకూర్చే లక్ష్యంతో దివంగత సీఎం డాక్టర్ వై.ఎస్.రాజశేఖర రెడ్డి 4 శాతం రిజర్వేషన్లు కల్పించారని గుర్తుచేశారు.
టీడీపీ ప్రభుత్వం ముస్లింలకు ఒక్క మంత్రి పదవి, ఎమ్మెల్సీ పదవి అయినా ఇచ్చిందా అని ప్రశ్నించారు. ముస్లింల ఓట్లు దండుకుని వారిని పట్టించుకోకపోవడం దారుణమని విమర్శించారు. ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు మాట్లాడుతూ 1947-58 మధ్య విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన మౌలానా ఆజాద్ దేశంలో ఐఐటీలు, విశ్వవిద్యాలయాలతోపాటు యూజీసీని స్థాపించారని వివరించారు.
దేశ జనాభాలో 11 శాతంగా ఉన్న ముస్లింలు ఉన్నత చదువులు, ఉద్యోగాల్లో 2 శాతం మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో మైనారిటీ కమిషన్ వైస్‌చైర్మన్ డాక్టర్ పీఎన్‌ఎస్ చంద్రబోస్, డీఈవో దొంతు ఆంజనేయులు, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈడీ సప్తగిరి, మాజీ ఎక్సైజ్ కమిషనర్ అహ్మద్ షరీఫ్, రిటైర్డు ఎస్పీ ఎస్‌హెచ్ రెహ్మాన్, అజీమ్, అన్వర్ బాషా, ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం కె.రేణుక, ముస్లిం మత పెద్దలుపాల్గొన్నారు.
డుమ్మా కొట్టిన మంత్రులు,
జిల్లా స్థాయి అధికారిక కార్యక్రమంలో జిల్లా మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొనకపోవడం ముస్లిం మత పెద్దలను బాధించింది. దీనిపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు.
వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో..
విద్యానగర్ (గుంటూరు): భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ 127వ జయంతి వేడుకలను నగరంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తాఫా తదితరులు అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ముస్తఫా మాట్లాడుతూ ప్రతి ముస్లిం ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. పార్టీ మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ మహబూబ్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు బండారు సాయి, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు కొత్తా చిన్నపరెడ్డి, విద్యార్థి విభాగం నాయకుడు నర్శిరెడ్డి, నేతలు మండేపూడి పురుషోత్తం, సయ్యద్ ఖాదర్‌బాషా, మహమ్మొద్, డి.శ్రీనివాస్, ముత్యాలరాజు, ఎం.ప్రకాష్, కరిముల్లా, అల్లాబక్షు, దయా పాల్గొన్నారు.