సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో చంద్రబాబు సర్కారు హయాంలో జరిగిన ఇన్‌సైడర్ ట్రేడింగ్, మనీ ల్యాండరింగ్‌పై క్షేత్రస్థాయి దర్యాప్తునకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సిద్ధమవుతోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ నేర పరిశోధన శాఖ(సీఐడీ) పంపిన ఆధారాలను పరిశీలించిన ఈడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అమరావతిలో జరిగిన అక్రమ లావాదేవీలపై ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్(పీఎంఎల్‌ఏ)–2002, ఫారిన్ ఎక్స్‌ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్(ఫెమా)–1999 కింద కేసులు నమోదు చేసిన ఈడీ కీలక ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమైంది.
హైదరాబాద్‌లోని ఈడీ జాయింట్ డైరెక్టర్(జేడీ) అభిషేక్ గోయల్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం క్షేత్రస్థాయి దర్యాప్తునకు రంగం సిద్ధం చేసుకుంటోంది. రాజధానిలో పెద్ద ఎత్తున జరిగిన ఇన్‌సైడర్ ట్రేడింగ్, మనీ ల్యాండరింగ్‌కు సంబంధించిన వివరాలపై ఆరా తీస్తున్నారు. ప్రాథమికంగా గుర్తించిన ఆధారాలను సీఐడీ అందజేయడంతో వాటిని ఈడీ పరిశీలిస్తోంది.
విలువైన భూములు ఎలా కొన్నారో?
అమరావతి, పెదకాకాని, తాడికొండ, తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి గ్రామాల్లో 797 మంది తెల్లరేషన్ కార్డుదారులు 761.34 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్టు సీఐడీ అధికారులు ఈడీకి ఆధారాలు అందజేశారు. పేద వర్గాలుగా తెల్లకార్డులు పొందిన వారు దాదాపు రూ.276 కోట్లు పెట్టి ఆ భూములు ఎలా కొన్నారనే దానిపై ఈడీ ప్రధానంగా దృష్టి సారించింది.
పచ్చ నేతలకు బినామీలుగా తెల్లకార్డుదారులు భూములు కొన్నట్టు నిర్ధారణ కావడంతో ఇందులో మనీ ల్యాండరింగ్, అక్రమ ఆదాయం వంటి అంశాలు ముడిపడి ఉన్నాయని ఈడీ నిర్ధారించింది. రూ.కోట్లతో కొనుగోలు చేసిన భూముల వివరాలు, వారి ఆర్థిక పరిస్థితి, వారు ఎవరికి బినామీలు తదితర కోణాల్లో ఈడీ కూపీలాగుతోంది. రికార్డుల పరిశీలన పూర్తయిన అనంతరం ఈడీ అమరావతి ప్రాంతంలో విచారణ ప్రారంభిస్తుందని సీఐడీ అధికారులు తెలిపారు. క్షేత్రస్థాయి దర్యాప్తునకు ముందే సీఐడీ అధికారుల బృందంతో ఈడీ ఉమ్మడి సమావేశం నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నెలాఖరులోగా ఈడీ, సీఐడీ ఉమ్మడి సమావేశం ఉంటుందని అధికారులు ధ్రువీకరించారు.
క్షేత్రస్థాయి దర్యాప్తునకు ఈడీ రెడీ
Published Mon, Feb 24 2020 3:40 AM | Last Updated on Mon, Feb 24 2020 3:40 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment