మున్సిపల్ కార్యాలయంలో ఈవీఎంలు
చీరాల రూర ల్: చీరాల మున్సిపల్ కార్యాలయంలోని స్టేషనరీ గదిలో ఆరు ఈవీఎంలు భద్రపరిచి ఉన్నాయి. అన్ని రకాల ఎన్నికలు పూర్తైఫలితాలు కూడా వెలువడితే చీరాల మున్సిపల్ కార్యాలయంలో మాత్రం ఇప్పటికీ ఈవీఎంలు ఎందుకు భద్రపరిచారో ప్రజలకు అర్థం కావడంలేదు. నిబంధనల ప్రకారం ఎన్నికల అనంతరం రిజర్వుడుగా ఉన్న ఈవీఎంలను, శిక్షణ కోసం తీసుకున్న ఈవీఎంలన్నింటినీ జిల్లా కేంద్రంలో అప్పగించాల్సి ఉంది. అలాంటివే అయితే వాటిని ఎప్పుడో ఒంగోలుకు చేర్చాల్సి ఉంది.
చీరాలలో ఈవీఎంల రగడ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పెద్ద ఎత్తున గొడవలు జరిగినా ఇంకా మున్సిపల్ కార్యాలయంలో ఈవీఎంలను ఎందుకు భద్రపరిచారో అధికారులే సెలవియ్యాలి. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్‌ను సాక్షి వివరణ కోరగా ఆరు, ఏడు ఈవీఎంలు కార్యాలయంలో ఉన్నాయని, వాటిని సిబ్బంది శిక్షణ కోసం ఉపయోగించామని, ఒంగోలులో అప్పగించాల్సి ఉందని తెలిపారు.