లీకువీరులకు చెక్
Published Mon, Mar 13 2017 1:03 PM | Last Updated on Wed, Sep 26 2018 3:23 PM
► ప్రయివేటు స్కూళ్లకు ముందుగానే చేరుతున్న ప్రశ్నపత్రాలు
► సమ్మెటివ్–1,2 లీకేజీలతో విద్యాశాఖ అభాసుపాలు
► తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం
► ఏ రోజుకు పరీక్షకు ఆ రోజే ప్రశ్నపత్రాలు
► ఈ నెల 14 నుంచి సమ్మెటివ్–3 పరీక్షలు
కర్నూలు సిటీ:
సమ్మెటివ్–1,2 పరీక్షలకు సంబంధించి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో అభాసుపాలైన విద్యాశాఖ లోప నివారణ చర్యలకు ఉపక్రమించిం ది. పరీక్షలను పక్కాగా నిర్వహించడంలో విఫలమవుతున్నట్లు వస్తున్న ఆరోపణల నుంచి బయటపడే ప్రయత్నం చేస్తోంది. పరీక్షకు ముందుగానే ప్రశ్నపత్రాలు ప్రయివేటు స్కూళ్లకు చేరుతుండడమే లీకేజీలకు కారణంగా భావిస్తున్న ఉన్నతాధికారులు ఈ సారి అందుకు చెక్ పెట్టేందుకు చర్యలు చేపట్టారు.
పాఠశాల విద్యలో ఫార్మాటివ్ పరీక్షలు నాలుగుసార్లు, సమ్మెటివ్ పరీక్షలు 3 సార్లు నిర్వహిస్తారు. పదవ తరగతి విద్యార్థులకు మాత్రం సమ్మెటివ్ పరీక్షలు రెండు సార్లు నిర్వహించి గ్రాండ్ టెస్ట్‌లు పెడతారు. ఫార్మాటివ్ పరీక్షల ప్రశ్నపత్రాలను ఆయా స్కూళ్లలోని సబ్జెక్టు నిపుణులు విద్యాప్రణాళిక ప్రకారం రూపొందిస్తారు. సమ్మెటివ్ పరీక్షలకు మాత్రం ప్రశ్న పత్రాలను ప్రభుత్వమే తయారు చేసి ఇస్తుంది. ప్రభుత్వం ఇచ్చిన నమూనాలోనే అన్ని యాజమాన్యాల స్కూళ్లకు చెందిన విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉంటుంది. అయితే ప్రయివేటు స్కూళ్లలో వారి సొంత ప్రణాళిక ప్రకారం సిలబస్ బోధిస్తుండడం, పరీక్షలు మాత్రం ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్వహించాల్సి రావడంతో కొంత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి.
ఇందుకు నివారణ అన్నట్లు ప్రయివేటు, కార్పొరేట్ స్కూళ్ల యాజమాన్యాలు తమకున్న పరిచయాలతో ప్రశ్నపత్రాలను ముందే తెప్పించుకోవడం వల్లే ప్రతిసారి లీకేజీ అవుతున్నట్లు విమర్శలు వస్తున్నాయని విద్యాశాఖ చేయించిన విచారణలో తేలింది. ఇలాంటి వాటికి అడ్డుకట్టవేసేందుకే సమ్మెటివ్–3 పరీక్షల ప్రశ్నపత్రాలను డిస్పాచ్‌ను గతంలో కంటే భిన్నంగా చేపట్టేందుకు విద్యాశాఖ సిద్ధమైంది. ఈ నెల14 నుంచి నిర్వహిస్తున్న పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు జిల్లాకు చేరాయి. ఇక్కడి నుంచి డీసీఈబీ అధికారులు జిల్లాలోని అన్ని మండల కేంద్రాలకు చేర్చేందుకు చర్యలు చేపట్టారు.
గతానికి భిన్నంగా..గతంలో పరీక్షలకు ముందుగానే అన్ని ప్రశ్నపత్రాలు ఒకేసారి ఆయా స్కూళ్ల ప్రధానోపాధ్యాయులకు, కీ సెంటర్లకు అందజేసేవారు. ఈ కారణంతోనే లీకేజీలు అవుతున్నాయని గుర్తించిన అధికారులు సమ్మెటివ్–3 పరీక్షల ప్రశ్నపత్రాలను ఏ రోజుకు ఆ రోజు ఆయా స్కూళ్లకు సంబంధించిన మండల విద్యాధికారుల కార్యాలయం నుంచి తీసుకుపోవాలని చెబుతున్నారు. ఈ ప్రక్రియ మండల కేంద్రాల్లోని పాఠశాలల విషయంలో పెద్దగా సమస్య లేకపోయినా దూరంగా ఉన్న స్కూళ్లకు కొంత ఇబ్బందికరమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పైగా ఇందుకు అయ్యే రవాణ ఖర్చులు సైతం హెచ్‌ఎంలే భరించాలని అధికారులు చెబుతుండడం గమనార్హం.
సమ్మెటివ్–1,2 పరీక్షల సమయంలో ప్రశ్నపత్రాలు ముందు రోజే లీకయ్యాయి. దీనిపై విచారణ చేయించగా కొన్ని స్కూళ్ల హెచ్‌ఎంలు, కీ సెంటర్ల దగ్గరే ఈ వ్యవహారం నడుస్తున్నట్లు తెలిసింది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సమ్మెటివ్ –3 పరీక్షలకు పక్కా చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగా ప్రశ్న పత్రాలను మండల కేంద్రంలో భద్రపరిచేందుకు నిర్ణయించాం. – తాహెరా సుల్తానా, డీఈఓ
Advertisement
Advertisement