ఎన్నాళ్లో వేచిన ఉదయం.. వెలుగులీనుతూ ప్రత్యక్షమవుతోంది. ఉపాధి కోసం తపిస్తున్న ప్రతి హృదయం.. కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతోంది. మాయ మాటలతో మభ్యపెట్టడమే గానీ చెప్పింది ఒక్కటీ చేయని చంద్రబాబు ప్రభుత్వంలో చేదు అనుభవాలు చవి చూసిన ప్రజలకు.. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చిన మూడు నెలల్లోనే ప్రగతి ఫలాలు దక్కడం కొత్త ఊపిరినిస్తోంది. ముఖ్యంగా యువత ‘బాబు పోయె.. జాబు వచ్చే ఢాం ఢాం ఢాం’ అంటూ సంబరాలు చేసుకుంటున్నారు. వేలాది ఉద్యోగావకాశాలు కల్పిస్తూ గ్రామ/వార్డు సచివాలయాల కోసం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న పరీక్షలు వారిలో కోటి ఆశలు చిగురింపజేశాయి. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది.
సాక్షి, అరసవల్లి: గ్రామ/వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలకు ఆదివారం నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లాలో మొత్తం 835 గ్రామ సచివాలయాలు, 94 వార్డు సచివాలయాల్లో మొత్తంగా 7,884 పోస్టుల భర్తీకి ఈ పరీక్షలను సెప్టెంబర్ 1, 3, 4, 6, 7, 8 తేదీల్లో నిర్వహిస్తోంది. ఈ మేరకు జిల్లా యంత్రాంగం దాదాపుగా సన్నాహాలు పూర్తి చేసింది. రాష్ట్రంలో పారదర్శక పాలన అందించాలనే ధ్యేయంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ మేరకు భారీ ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలను చేపట్టింది. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే చేపడుతున్న తొలి భారీ నోటిఫికేషన్ కావడంతో సచివాలయ పోస్టుల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావి స్తోంది. ఈమేరకు పరీక్షల నిర్వహణలో ఎక్కడా లోపాలు లేకుండా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
కలెక్టర్ జె.నివాస్ పర్యవేక్షణలో జెడ్పీ సీఈఓ బి.చక్రధరరావు, డెప్యూటీ సీఈఓ ప్రభావతి తదితర అధికార బృందమంతా ఈ పరీక్షలను పారదర్శకంగా ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నారు. జిల్లాలో సెప్టెంబర్ 1న నిర్వహించనున్న తొలి రోజున అత్యధికంగా 83,448 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. దీంతో జిల్లాలో అత్యధిక ప్రాంతాల్లో తొలిరోజున పరీక్షలు నిర్వహించేందుకు అధి కారులు ఏర్పాట్లు చేశారు. పరీక్ష కేంద్రాలకు సులువుగా చేరుకునేలా ఆర్టీసీ ఆధ్వర్యంలో రవాణా సౌకర్యం, వైద్యం, ఇతర సదుపాయాలను అధికారులు కల్పించారు. అలాగే 135 మంది దివ్యాంగులకు సహాయకులను కేటాయించేందుకు నిర్ణయించారు.
తొలి రోజునే 306 పరీక్ష కేంద్రాల్లో...
జిల్లాలో ఈ పరీక్షలకు మొత్తం 306 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. అదనంగా మరో 5 పరీక్ష కేంద్రాలను రిజర్వ్‌లో ఉంచారు. రేపు ఉదయాన మొత్తం 306 పరీక్ష కేంద్రాల్లో 70,588 మంది, మధ్యాహ్నం కేవలం 53 కేంద్రాల్లోనే 12,860 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. అలాగే 3, 4, 6, 7, 8 తేదీల్లో కేటగిరి–2, కేటగిరి–3 కింద మొత్తం 14 విభాగాల పోస్టులకు మొత్తం 31,286 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానుండగా, జిల్లా కేంద్రంలోని 40 పరీక్ష కేంద్రంలోనే ఈ పరీక్షలు జరుగనున్నాయి. ఎక్కువమంది హాజరు కానుండడంతో తొలిరోజు పరీక్షలకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం రేపు ఉదయం సుమారు 5542 మంది సిబ్బందిని, మధ్యాహ్నం 995 మందిని విధుల్లో ఉంచనున్నారు. పరీక్ష కేంద్రాల్లో చీఫ్ సూపరింటెండెంట్లు, కోఆర్డినేటర్లు, హాల్ సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లతోపాటు నాలుగైదు కేంద్రాలకు ఒక్కో రూట్ ఆఫీసర్ చొప్పున నియమించారు.
పూర్తి నిఘా నీడలోనే పరీక్షలు:
జిల్లాలో సచివాలయంలో ఉద్యోగాల నియామకాలకు సంబంధించిన పరీక్షలను పూర్తి స్థాయి నిఘా నీడలో జరిపించనున్నారు. రాజకీయ ప్రోద్బ లాలు, తాయిలాలు తదితర లాబీయింగ్‌కు దూరంగా ఈ పరీక్షలు, నియామకాలు జరగాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించడంతోపాటు నిత్యం పరిస్థితులను పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో పరీక్షల నిర్వహణ అధికారులకు పెద్ద సవాల్‌గా మారింది. ప్రతి పరీక్ష కేంద్రంలోనూ వీడియో రికార్డింగ్‌ను చేయించనున్నారు. పకడ్బందీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు. కాగా పరీక్షలకు సంబంధించి సామగ్రి, ఓఎంఆర్ షీట్లు, ప్రశ్నాపత్రాలు తదితర సామగ్రి అంతా స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో స్ట్రాంగ్ రూంలో భద్రపరిచారు. ఇక్కడ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఇదిలావుంటే పరీక్షల్లో ఎక్కడా అవకతవకలకు తావు లేకుండా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. మాల్ ప్రాక్టీస్ తదితర అక్రమాలకు పాల్పడకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రతి పరీక్ష కేంద్రానికి ప్రత్యేకంగా సిబ్బందిని నియమించారు. రూరల్ ప్రాంతాల్లో ఉన్న పరీక్ష కేంద్ర చిరునామా అభ్యర్థులకు తెలిసేలా ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే పరీక్ష కేంద్రాలకు సంబంధించి ఆయా బాధ్యులను నోడల్ అధికారులుగా నియమించారు.
పరీక్ష గదిలోకి... ఇలా...
-పరీక్ష సమయానికి అరగంట ముందే చేరుకోవాల్సి ఉంటుంది. ఉదయమైతే 9.30కి, మధ్యాహ్నమైతే 2 గంటలకు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి
-అభ్యర్థికి చెందిన ఏదైనా ఒరిజినల్ గుర్తింపు కార్డు (ఓటర్ కార్డు, ఆధార్, పాన్, పాస్‌పోర్టు ఇతరత్రా..) వెంట తీసుకురావాలి.
-ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసిన హాల్ టిక్కెట్టు తప్పనిసరి
-ఓఎంఆర్ షీట్‌లో బబ్లింగ్ కోసం బ్లూ/బ్లాక్ బాల్ పాయింట్ పెన్ను తప్పనిసరి
-మరే ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్‌ఫోన్, కాలిక్యులేటర్, ఎలక్ట్రానిక్ వాచీలు తదితర వస్తువులను అనుమతించరు.
పరీక్షల టైం టేబుల్:
(ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు – మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు)
సెప్టెంబర్ 1వ తేదీ: ఉదయం – కేటగిరి 1– పోస్టులు 2378, అభ్యర్థులు 70588 మంది
1. పంచాయతీ సెక్రటరీ (గ్రేడ్–5)
2. మహిళా పోలీస్, చైల్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్
3. వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ
4. వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్
మధ్యాహ్నం– కేటగిరి 3 –పోస్టులు 835, అభ్యర్థులు 12860 మంది
5. డిజిటల్ అసిస్టెంట్ (పంచాయతీ కార్యదర్శి గ్రేడ్–6)
సెప్టెంబర్3వతేదీ: ఉదయం– కేటగిరి 2–గ్రూ ప్‌బి–పోస్టులు 1020, అభ్యర్థులు 7447 మంది
6. విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ (గ్రేడ్–2)
7. విలేజ్ సర్వేయర్ (గ్రేడ్–3)
మధ్యాహ్నం – కేటగిరి 3 – పోస్టులు 648, అభ్యర్థులు 3714 మంది
8. ఏఎన్‌ఎం / వార్డు హెల్త్ సెక్రటరీ (గ్రేడ్–3) (స్త్రీలకు)
సెప్టెంబర్ 4వ తేదీ: ఉదయం – కేటగిరి 3– పోస్టులు 676, అభ్యర్థులు 1302 మంది
9. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ (గ్రేడ్–2)
మధ్యాహ్నం – కేటగిరి 3– పోస్టులు 155, అభ్యర్థులు 912 మంది
10. విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్
సెప్టెంబర్ 6 వ తేదీ: ఉదయం – కేటగిరి 3 –పోస్టులు 67, అభ్యర్థులు 1417 మంది
11. విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్
మధ్యాహ్నం – కేటగిరి 3, పోస్టులు792, అభ్యర్థులు 416 మంది
12. పశుసంవర్థక శాఖ అసిస్టెంట్
సెప్టెంబర్ 7వ తేదీ: ఉదయం –కేటగిరి 2–గ్రూప్ ఎ– పోస్టులు 930, అభ్యర్థులు 6515 మంది
13. ఇంజినీరింగ్ అసిస్టెంట్ (గ్రేడ్–2)
14. వార్డు ఎమినిటీస్ సెక్రటరీ (గ్రేడ్–2)
మధ్యాహ్నం– కేటగిరి 3– పోస్టులు 04, అభ్యర్థులు 111 మంది
15. విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్
సెప్టెంబర్ 8వ తేదీ: ఉదయం – కేటగిరి 3, పోస్టులు 190, అభ్యర్థులు 2429 మంది
16.వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ (గ్రేడ్–2)
17. వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ సెక్రటరీ
మధ్యాహ్నం – కేటగిరి 3, పోస్టులు 189, అభ్యర్థులు 7021 మంది
18. వార్డు ఎడ్యుకేషన్ అండ్ డాటా ప్రాసెసింగ్ సెక్రటరీ
19. వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సెక్రటరీ (గ్రేడ్–2)
Comments
Please login to add a commentAdd a comment