
సాక్షి, అమరావతి: రాష్ట్ర సమగ్రాభివృద్ధికి నాంది పలుకుతూ రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. రాజధానితోపాటు రాష్ట్ర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా నిపుణుల కమిటీ అధ్యయనం చేయనుంది. వికేంద్రీకరణ దిశగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం జరుగుతున్న పనులను పర్యవేక్షించడంతోపాటు అన్ని ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించడానికి విశేష అనుభవం ఉన్న నిపుణులతో కమిటీని ఏర్పాటు చేస్తూ పురపాలక శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ కమిటీకి విశ్రాంత ఐఏఎస్ అధికారి జీఎన్ రావు కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ డీన్ డాక్టర్ మహావీర్, అర్బన్, రీజనల్ ప్లానర్ డాక్టర్ అంజలీ మోహన్, రిటైర్డ్ ప్రొఫెసర్ కె.టి.రవీంద్రన్, అహ్మదాబాద్ సెప్ట్ ప్రొఫెసర్ శివానంద స్వామి, చెన్నై చీఫ్ అర్బన్ ప్లానర్ (రిటైర్డ్) కె.వి అరుణాచలంను ప్రభుత్వం సభ్యులుగా ఎంపిక చేసింది. అదేవిధంగా పర్యావరణం, వరద నియంత్రణ అంశాలపై ఒక నిపుణుడిని సభ్యుడిగా చేర్చుకునే అధికారాన్ని ఈ కమిటీకే అప్పగించింది. ఇప్పటివరకు రాష్ట్రంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను త్వరితగతిన సమీక్ష చేయడమే కాకుండా, అన్ని ప్రాంతాల అభివృద్ధికి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను కమిటీ రూపొందించాల్సి ఉంటుంది. ఆరు వారాల్లోగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment