ఇప్పుడే మరమ్మతులొద్దు! | Sakshi
Sakshi News home page

ఇప్పుడే మరమ్మతులొద్దు!

Published Thu, Apr 18 2024 5:35 AM

Minister Uttam clarification on Kaleshwaram project barrages - Sakshi

కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలపై మంత్రి ఉత్తమ్‌ స్పష్టీకరణ

అయ్యర్‌ కమిటీ సిఫారసులొచ్చాకే రిపేర్లు చేపట్టాలని ఇరిగేషన్‌ శాఖకు ఆదేశం 

అత్యవసర మరమ్మతులకు సంబంధించి కాంట్రాక్టర్లతో భేటీపై అసహనం 

ప్రభుత్వ పాలసీకి విరుద్ధంగా వెళ్లరాదంటూ ఆగ్రహం 

సాక్షి, హైదరాబాద్‌:  కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు అత్యవసర మరమ్మతుల నిర్వహణకు రాష్ట్ర నీటిపారుదల శాఖ కసరత్తు ప్రారంభించడంపై ఆ శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. చంద్రశేఖర్‌ అయ్యర్‌ నేతృత్వంలోని నిపుణుల కమిటీ సూచించే వరకు ఎలాంటి పనులు చేపట్టరాదని స్పష్టం చేసినట్లు నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి.

బ్యారేజీలకు అత్యవసర మరమ్మతుల విషయమై నిర్మాణ సంస్థల ప్రతినిధులతో ఇటీవల నీటి పారుదల శాఖ ఈఎన్‌సీ (జనరల్‌) అనిల్‌కుమార్‌ జలసౌధలో సమావేశం నిర్వహించి చర్చలు జరపడంపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అనుమతి లేకుండా, పాలసీకి విరుద్ధంగా మరమ్మతుల విషయంలో ఎలా ముందుకు వెళ్లారు? అనే అంశంపై ఈఎన్‌సీ అనిల్‌కుమార్‌ను మంత్రి వివరణ కోరారు.

ఇలావుండగా.. మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్‌ పునర్నిర్మాణం పనులతో పాటు కాఫర్‌ డ్యామ్‌ పనులను సొంత ఖర్చుతో చేసేందుకు ఈ సమావేశంలో నిర్మాణ సంస్థ ‘ఎల్‌ అండ్‌ టీ’అంగీకరించినట్టు కొన్ని పత్రికల (సాక్షి కాదు)తో పాటు సోషల్‌ మీడియాలో తప్పుడు కథనాలు రావడంతో సీఎం కార్యాలయం ఆరా తీసింది. ఆ వార్తా కథనాలను ఖండిస్తూ ప్రకటనలు జారీ చేయాలని నీటిపారుదల శాఖను ఆదేశించింది.  

వర్షాలొస్తే వరదలొస్తాయని.. 
కాళేశ్వరం బ్యారేజీల్లోని లోపాలపై అధ్యయనం జరిపి పరిష్కారాలను సూచించడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు.. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ నేతృత్వంలో నిపుణుల కమిటీని నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. బ్యారేజీల పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలను ఈ కమిటీ సిఫారసు చేసేవరకు ఎలాంటి మరమ్మతులు చేపట్టబోమంటూ గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం తమ విధానపర నిర్ణయాన్ని ప్రకటించింది.

ఈ నేపథ్యంలో ఇప్పటికే రెండు పర్యాయాలు రాష్ట్రంలో పర్యటించిన అయ్యర్‌ కమిటీ బ్యారేజీల డిజైన్లు, నిర్మాణంపై విస్తృత రీతిలో అధ్యయనం చేపట్టింది. నీళ్లు నిల్వ ఉంటే బ్యారేజీలకు మరింత నష్టం జరిగే ప్రమాదముందని, ఖాళీ చేయాలని సూచించడంతో గతంలోనే బ్యారేజీలను ఖాళీ చేశారు. కాగా మరో నెలన్నర రోజుల్లో వర్షాలు ప్రారంభం కానుండడంతో గోదావరిలో ఎప్పటిలాగే భారీ వరదలు వచ్చే అవకాశం ఉంది.

ఈ వరదలతో బ్యారేజీలకు మరింత నష్టం జరగకుండా చేపట్టాల్సిన అత్యవసర మరమ్మతులను సాధ్యమైనంత త్వరగా సూచించాలని అయ్యర్‌ కమిటీకి సర్కారు విజ్ఞప్తి చేసింది. అయితే కమిటీ రాష్ట్రం నుంచి తిరిగి వెళ్లి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు ఎలాంటి సూచనలు చేయలేదు. ఈ నేపథ్యంలోనే అత్యవసర మరమ్మతులపై బ్యారేజీల నిర్మాణ సంస్థలతో గత వారం ఆ శాఖ ఈఎన్‌సీ (జనరల్‌) అనిల్‌కుమార్‌ చర్చలు జరిపారు.
 
విషయం తెలియడంతో మంత్రి ఫైర్‌! 
మేడిగడ్డ బ్యారేజీ మరింత కుంగకుండా 7వ బ్లాక్‌కు రెండు వైపులా షీట్‌పైల్స్‌తో అదనపు రక్షణ కల్పించాలని ఈఎన్‌సీ నిర్మాణ సంస్థ ఎల్‌ అండ్‌ టీని కోరినట్టు తెలిసింది. గోదావరి నదికి అడ్డంగా బ్యారేజీలకు రెండు వైపులా కరై్టన్‌ వాల్స్‌ నిర్మించాలని సూచించినట్టు సమాచారం. అలాగే బ్యారేజీల్లో ఏర్పడిన బుంగలను ప్రెషర్‌ గ్రౌంటింగ్‌ ద్వారా పూడ్చివేయాలని కాంట్రాక్టర్లను కోరినట్టు తెలిసింది.

కాగా ఈ పనులను సొంత ఖర్చుతో చేసేందుకు ఎల్‌ అండ్‌ టీతో పాటు ఇతర నిర్మాణ సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్‌కి ఎదురుగా నిర్మిస్తున్న కాఫర్‌ డ్యామ్‌ కోసం రూ.52 కోట్ల బిల్లులను చెల్లించాలని కూడా ఎల్‌ అండ్‌ టీ కోరింది. ఈ విషయాలన్నీ తెలిసిన నేపథ్యంలోనే మంత్రి ఉత్తమ్‌ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.    

Advertisement
Advertisement