చెన్నేకొత్తపల్లి మండలంలోని ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం, అంగన్‌వాడీ కేంద్రానికి సరఫరా చేసిన కాలం చెల్లిన పాల ప్యాకెట్లు
రామగిరి: మహిళా శిశు సంక్షేమ మంత్రి పరిటాల సునీత ఇలాకాలోనే మహిళలు, శిశువులకు అన్యాయం జరుగుతోంది. పౌష్టికాహారం పేరుతో అందజేస్తున్న సరుకుల్లో నాణ్యత లోపిస్తుండడంతో వాటిని స్వీకరించిన పలువురు అనారోగ్యం పాలవుతున్నారు. సరుకులు సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్‌కు ఉన్నత స్థాయి పలుకుబడి ఉండడంతో అధికారులు పల్లెత్తు మాట అనలేకపోతున్నారు. దీంతో నాసిరకం కోడిగుడ్లు, కాలంచెల్లిన పాల ప్యాకెట్లు గర్భిణులు, చిన్నారులు, బాలింతల వద్దకు చేరిపోతున్నాయి. మంత్రి సునీత సొంత ఇలాకాలోనే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే.. ఇక రాష్ట్ర వ్యాప్త పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
కాలం చెల్లిన పాలు :రాప్తాడు నియోజకవర్గంలోని చెన్నేకొత్తపల్లి ఐసీడీఎస్ సెక్టార్ పరిధిలోని రామగిరి, కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి మండలాల్లోని అంగన్‌వాడీ కేంద్రాలకు విజయ డెయిరీ పాలను సరఫరా చేశారు. వీటిని తయారు చేసిన మూడు నెలల్లోపు వినియోగించాల్సి ఉంది. అయితే ఆరు నెలల క్రితం ప్యాక్ చేసిన పాలు కొన్నింటిని సరఫరా చేయగా.. మరికొన్ని పాలుకు నేటితో (మంగళవారం)తో గడువు ముగియనుంది. వీటిని చెన్నేకొత్తపల్లి మండలంలోని 62 అంగన్ వాడీ కేంద్రాలకు కాంట్రాక్టర్ సరఫరా చేసి చేతులు దులుపుకున్నాడు. అధికారులు సైతం చూసీచూడనట్లు వ్యవహరించారు.
ప్రజారోగ్యంతో చెలగాటం : స్త్రీ శిశు సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు గొప్పలకు పోతున్న రాష్ట్ర మంత్రి పరిటాల సునీత.. తన సొంత నియోజకవర్గంలోనే మహిళలు, శిశువుల సంక్షేమాన్ని విస్మరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. నాణ్యత లేని, నాసిరకంగా కాలం చెల్లిన సరుకులను అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్నా.. ఆమె స్పందించకపోవడం ఇందుకు అద్దం పడుతోందన్న విమర్శలు ఉన్నాయి. చెన్నేకొత్తపల్లి మండలంలోని మొత్తం 62 అంగన్ వాడీ కేంద్రాలకు ఇటీవల కాలం చెల్లిన పాలను సరఫరా చేశారు. ఈ అంగన్‌వాడీ కేంద్రాల్లో 2,408 మంది చిన్నారులు, 281 మంది బాలింతలు, 294 మంది గర్భిణులు ఉన్నారు. వీరందరికీ పౌష్టికాహారం కింద కోడి గుడ్లు, పాల ప్యాకెట్లను అందజేస్తున్నారు. పౌష్టికాహారం మాట దేవుడెరుగు కానీ.. కాలం చెల్లిన, నాసిరకం కోడిగుడ్లు, పాల ప్యాకెట్లు సరఫరా చేస్తూ ప్రజారోగ్యంతో చెలగాటమాడడం దుమారం రేపుతోంది.
వెనక్కు తెప్పిస్తాం
చెన్నేకొత్తపల్లి మండలంలో కాలం చెల్లిన పాల ప్యాకెట్లు సరఫరా చేసిన మాట వాస్తవమే. అంగన్‌వాడీ కేంద్రాల నుంచి వాటన్నింటినీ వెనక్కు తెప్పిస్తున్నాం. పాలు సరఫరా చేసే ఏజన్సీ వారు అదనంగా స్టాక్ ఉందని ఎక్కువగా సరఫరా చేయడం వల్లనే ఈ సమస్య తలెత్తింది. ఇకపై ఇలాంటి తప్పిదాలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటాం.– గాయత్రి, సీడీపీవో, చెన్నేకొత్తపల్లి ఐసీడీఎస్ ప్రాజెక్ట్
Comments
Please login to add a commentAdd a comment