Anaganwadi
-
హడావుడిగా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
సాక్షి, సూళ్లూరుపేట: మరో నాలుగైదు రోజుల్లో ఎన్నికల కోడ్ రానున్న దృష్ట్యా సోమవారం అధికారపార్టీ నాయకులు పట్టణంలో హడావుడిగా పలు అభివృద్ధి పనులకు సంబంధించి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు. రూ.40 లక్షలతో అన్న క్యాంటీన్, రూ.8 లక్షలతో అంగన్వాడీ భవనాన్ని, రూ.30 లక్షలతో నిర్మించిన పశువైద్యశాల భవనాన్ని, నుడా పార్కును ప్రారంభించారు. నుడా పార్కు నిర్మాణం ఇంకా పూర్తి కాకుండానే ప్రారంభం చేయడం విమర్శలకు దారితీసింది. రూ.142 కోట్లతో ఏఐఐబీ నిధులతో తాగునీటి పథకానికి, రూ. 34.65 కోట్లతో రోడ్లు, మురుగు నీటికాలువ నిర్మాణానికి, మటన్‌మార్కెట్, కంపోస్ట్ యార్డ్ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమాలకు మంత్రి నారాయణ వస్తున్నారని ప్రచారం చేశారు. సోమవారం సాయంత్రం మంత్రి రావడం లేదని తెలుగు తమ్ముళ్లు శంకుస్థాపన చేశారు. -
పేలిన అంగన్వాడీ స్మార్ట్ ఫోన్
అనంతపురం కూడేరు: అంగన్వాడీలకు ప్రభుత్వం అందించిన స్మార్ట్‌ఫోన్ ఒకటి పేలింది. కూడేరు మండలం మరుట్ల–3వ కాలనీ అంగన్వాడీ కార్యకర్త విజయకుమారి తనవద్దనున్న కార్బన్ కంపెనీకి చెందిన స్మార్ట్‌ఫోన్‌ను శుక్రవారం ఉదయం 7.30 గంటల సమయంలో చార్జింగ్ పెట్టి తను ఇంటి బయట పనిలో నిమగ్నమైంది. కొంతసేపటి తర్వాత పెద్ద శబ్దం వినిపించడంతో ఆమె లోపలికి వెళ్లి చూడగా సెల్‌ఫోన్ పేలి పొగలు రావడం కనిపించింది. ఎవరికీ ఎటువంటి ప్రాణాపాయం కలగకపోవడంతో ఊపిరి పీల్చుకుంది. -
అంగన్వాడీలపై అధికార అజమాయిషీ
అంగన్వాడీలపై రాజకీయంగా పెత్తనం చెలాయించేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రాల వారీగా అజమాయిషీ, నిఘా పెంచేందుకు పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేసి వారిని తమ గుప్పెట్లో పెట్టుకునేందుకు ఓ పథకం రూపొందించడమే దీనికి కారణం. ఇందులో భాగంగా ఏఎల్ఎమ్ ఎస్సీ (అంగన్వాడీ స్థాయి మానిటరింగ్, మద్దతు కమిటీలను) వేయాలని నిర్ణయించింది. ఈ మేరకు గత నెల 11వ తేదీన సర్కులర్ నెంబర్ 16028–25.ఎస్ఎన్పీ జీఓను జారీ చేసింది. దీని ప్రకారం కమిటీలు ఏర్పాటుకు సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం ప్రకటించింది. ఈ కమిటీలు మరో జన్మభూమి కమిటీల్లా మారతాయన్న వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం, యద్దనపూడి: అంగన్ వాడీ పర్యవేక్షక కమిటీలు ప్రతి నెలా సమావేశమై అక్కడ చర్చించిన అంశాలు, తీర్మానాలపై ప్రభుత్వానికి నివేదిక పంపించాల్సి ఉంటుంది. అలాగే కార్యకర్తలకు, ఆయాలకు ఇచ్చే గౌరవ వేతనాన్ని సదరు కమిటీ ఇచ్చే నివేదికతో ముడిపెట్టారు. ఒకవేళ కమిటీలు అంగన్వాడీ సిబ్బంది పనితీరు బాగలేదని నివేదికను పంపిస్తే వారిని ఇంటికి సాగనంపేందుకు ఒక ప్రణాళిక రూపొందించింది. రాబోయే ఎన్నికల నేపథ్యంలో తమ మాటవినని వారిని తొలగించి తమకు అనుకూలంగా ఉన్నవారిని నియమించుకునేందుకే ప్రభుత్వం ఉదేశ్య పూర్వంగా ఈ విధంగా చేస్తోందని అంగన్వాడీ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బయోమెట్రిక్ వంటి వాటితో ఇప్పటికే అంగన్వాడీల పనిని సమీక్షిస్తున్నారని, మళ్లీ కొత్తగా ఈ పర్యవేక్షణ కమిటీల అవరమేమిటని ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి కేంద్రాల పర్యవేక్షణకు సూపర్వైజర్ల కొరత ఉండటంతో సిబ్బంది సేవలు పారదర్శకంగా ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొందని ఐసీడీఎస్ అధికారులు చెప్తున్నారు. నియామక పక్రియకు కసరత్తు... జిల్లాలో 21 అంగన్వాడీ ప్రాజెక్ట్‌లున్నాయి. వాటి పరిధిలో 4009 అంగన్వాడీ కేంద్రాలు, మరో 235 మినీ కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాల్లో 6 నెలల నుంచి 6 ఏళ్లలోపు 1,81,270 మంది చిన్నారులు, గర్భవతులు 20,772, బాలింతలు 25,178 మందికి ఈ కేంద్రాల ద్వారా సేవలు అందుతున్నాయి. కేంద్రాలపై పెత్తనం చెలాయించేందుకు గానూ అంగన్వాడీ స్థాయి మానిటరింగ్ మద్దతు కమిటీల నియామక పక్రియలు పూర్తిచేయటానికి అధికారులు ఇప్పటికే కసరత్తు చేపట్టారు. ఈ కమిటీలో మెత్తం తొమ్మిది మంది సభ్యులు ఉంటారు. ఈ కమిటీలో పంచాయతీ ప్రత్యేక అధికారి చైర్‌పర్సన్‌గా, అంగన్వాడీ కార్యకర్త కన్వీనర్‌గా, మహిళా మండలి నుంచి ఇద్దరు, ఆశ సిబ్బంది ఒకరు, కమ్యూనిటీ ఆర్గనైజేషన్ నుంచి ఇద్దరు, స్థానికంగా రిటైర్డ్ ఉద్యోగుల ముగ్గురు ఇలా అందరిని కలిపి కమిటీలను వేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ కమిటీలు ప్రతినెలా కేంద్రాలను తనిఖీ చేయాలని సూచించింది. వ్యతిరేకిస్తున్న అంగన్వాడీలు... రాష్ట్ర ప్రభుత్వం ఐసీడీఎస్‌ను నిర్వీర్యం చేసేందుకే ప్రయత్నిస్తోందని, కేంద్రాలపై పెత్తనం చెలాయించేందుకు కమిటీలను నియమించటం అందులో భాగమేనని అంటున్నారు. ముఖ్యంగా ఈ కమిటీల వల్ల రాజకీయ నాయకుల ప్రమేయం ఉండటంతో పాటు అంగన్వాడీలపై వేధింపులు పెరుగుతాయని వాపోతున్నారు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు మథర్స్ కమిటీలను వేసినప్పుడు అవి అంగన్వాడీ సిబ్బందిపై లేనిపోని ఆరోపణలు గుప్పించి క్రమశిక్షణ చర్యల పేరుతో తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని గుర్తుచేశారు. అప్పుడు అంగన్వాడీ సిబ్బంది వ్యతిరేకించటంతో చంద్రబాబు రద్దుచేశారని ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండటంతో తమ ప్రభుత్వానికి అనుకూలంగా మలుచుకునేందుకు ఇలాంటి కమిటీలను నియమించి ఐసీడీఎస్ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు చూస్తోందని ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయకుట్రలో భాగమే... తమ మాట వినని వారిని తొలగించి తమకు అనుకూలంగా ఉన్నవారిని నియమించుకునేందుకే ప్రభుత్వం ఇదంతా చేస్తోంది. అంగన్వాడీ కేంద్రాల పనితీరును పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారులున్నారు. కేంద్రాల పనితీరును ఎప్పటికప్పుడు బయోమెట్రిక్, ప్రత్యేకమైన యాప్‌లు ద్వారా తెలుసుకుంటున్నారు. మళ్లీ ఇప్పుడు పర్యవేక్షణ కమిటీలను వేయటం రాజకీయ దురుద్ధేశమే. ఈదర అన్నపూర్ణ, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి -
శిశు సంక్షేమం.. అనారోగ్యం పాలు!
రామగిరి: మహిళా శిశు సంక్షేమ మంత్రి పరిటాల సునీత ఇలాకాలోనే మహిళలు, శిశువులకు అన్యాయం జరుగుతోంది. పౌష్టికాహారం పేరుతో అందజేస్తున్న సరుకుల్లో నాణ్యత లోపిస్తుండడంతో వాటిని స్వీకరించిన పలువురు అనారోగ్యం పాలవుతున్నారు. సరుకులు సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్‌కు ఉన్నత స్థాయి పలుకుబడి ఉండడంతో అధికారులు పల్లెత్తు మాట అనలేకపోతున్నారు. దీంతో నాసిరకం కోడిగుడ్లు, కాలంచెల్లిన పాల ప్యాకెట్లు గర్భిణులు, చిన్నారులు, బాలింతల వద్దకు చేరిపోతున్నాయి. మంత్రి సునీత సొంత ఇలాకాలోనే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే.. ఇక రాష్ట్ర వ్యాప్త పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కాలం చెల్లిన పాలు :రాప్తాడు నియోజకవర్గంలోని చెన్నేకొత్తపల్లి ఐసీడీఎస్ సెక్టార్ పరిధిలోని రామగిరి, కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి మండలాల్లోని అంగన్వాడీ కేంద్రాలకు విజయ డెయిరీ పాలను సరఫరా చేశారు. వీటిని తయారు చేసిన మూడు నెలల్లోపు వినియోగించాల్సి ఉంది. అయితే ఆరు నెలల క్రితం ప్యాక్ చేసిన పాలు కొన్నింటిని సరఫరా చేయగా.. మరికొన్ని పాలుకు నేటితో (మంగళవారం)తో గడువు ముగియనుంది. వీటిని చెన్నేకొత్తపల్లి మండలంలోని 62 అంగన్ వాడీ కేంద్రాలకు కాంట్రాక్టర్ సరఫరా చేసి చేతులు దులుపుకున్నాడు. అధికారులు సైతం చూసీచూడనట్లు వ్యవహరించారు. ప్రజారోగ్యంతో చెలగాటం : స్త్రీ శిశు సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు గొప్పలకు పోతున్న రాష్ట్ర మంత్రి పరిటాల సునీత.. తన సొంత నియోజకవర్గంలోనే మహిళలు, శిశువుల సంక్షేమాన్ని విస్మరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. నాణ్యత లేని, నాసిరకంగా కాలం చెల్లిన సరుకులను అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్నా.. ఆమె స్పందించకపోవడం ఇందుకు అద్దం పడుతోందన్న విమర్శలు ఉన్నాయి. చెన్నేకొత్తపల్లి మండలంలోని మొత్తం 62 అంగన్ వాడీ కేంద్రాలకు ఇటీవల కాలం చెల్లిన పాలను సరఫరా చేశారు. ఈ అంగన్వాడీ కేంద్రాల్లో 2,408 మంది చిన్నారులు, 281 మంది బాలింతలు, 294 మంది గర్భిణులు ఉన్నారు. వీరందరికీ పౌష్టికాహారం కింద కోడి గుడ్లు, పాల ప్యాకెట్లను అందజేస్తున్నారు. పౌష్టికాహారం మాట దేవుడెరుగు కానీ.. కాలం చెల్లిన, నాసిరకం కోడిగుడ్లు, పాల ప్యాకెట్లు సరఫరా చేస్తూ ప్రజారోగ్యంతో చెలగాటమాడడం దుమారం రేపుతోంది. వెనక్కు తెప్పిస్తాం చెన్నేకొత్తపల్లి మండలంలో కాలం చెల్లిన పాల ప్యాకెట్లు సరఫరా చేసిన మాట వాస్తవమే. అంగన్వాడీ కేంద్రాల నుంచి వాటన్నింటినీ వెనక్కు తెప్పిస్తున్నాం. పాలు సరఫరా చేసే ఏజన్సీ వారు అదనంగా స్టాక్ ఉందని ఎక్కువగా సరఫరా చేయడం వల్లనే ఈ సమస్య తలెత్తింది. ఇకపై ఇలాంటి తప్పిదాలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటాం.– గాయత్రి, సీడీపీవో, చెన్నేకొత్తపల్లి ఐసీడీఎస్ ప్రాజెక్ట్ -
కాలంచెల్లిన ఓఆర్ఎస్ఎల్ ప్యాకెట్ల పంపిణీ
తొండంగి (తుని): స్త్రీశిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రంలో కాలం చెల్లిన ఓఆర్ఎస్ఎల్ ప్యాకెట్లు పంపిణీ చేశారని ఎ.కొత్తపల్లి గ్రామస్తులు ఆదివారం రాత్రి వాపోయారు. గ్రామంలో గొల్లపేట అంగన్వాడీ సెంటర్లో శనివారం అంగన్వాడీ కార్యకర్త కేంద్రంలో మహిళలకు ఓఆర్ఎస్ఎల్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. అయితే ఈ ప్యాకెట్లను పరిశీలించగా 2016లో తయారయ్యాయి. రెండు సంవత్సరాలు కాలపరిమితి దాటి తర్వాత వీటిని పంపిణీ చేస్తున్నట్టు కాలిబోయిన ఏడు కొండలు, తాటిపర్తి ప్రసాద్, కడారి శ్రీనులు గమనించారు. దీనిపై ఉన్నతాధికారులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. పంపిణీ చేసిన ప్యాకెట్లను మహిళలు వినియోగించకుండా సేకరించామన్నారు. కాలం చెల్లిన ఓఆర్ఎస్ఎల్ ప్యాకెట్లు పసిపిల్లలకు, మహిళలకు పంపిణీ చేయడం వైద్యారోగ్య సిబ్బంది, ప్రభుత్వాధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసువాలని కోరుతున్నారు. -
మహిళలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి
శ్రీకాకుళం అర్బన్ : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మహిళలకు క్షమాపణ చెప్పి ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి మాట నిలుపుకోవాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి బుధవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అంగన్వాడీ మహిళలపై తెలుగుదేశం పార్టీ దాష్టీకం ప్రదర్శించిన తీరు ఎన్నడూ క్షమించరానిదన్నారు. ఈ ప్రభుత్వం మహిళలకు ఎన్నికల ముందు ఇచ్చే హామీలు అమలు చేయలేక వాయిదాలుగా మహిళలకు మోసం చేస్తున్నారని వివరించారు. డ్వాక్రా మహిళలకు అన్యాయం చేసి వారిని వీధిపాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు అంగన్వాడీ కార్యకర్తలు కడుపు మండి గోడు వినిపించుకోవడానికి శాంతియుతంగా ముందుకు వస్తే వారికి లాఠీచార్జీలతో, అరెస్టులతో మహిళలను హింసిస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు.ఆంధ్రప్రదేశ్‌లోని అంగన్వాడీ కార్యకర్తలకు మేలు చేయాలని ఆమె కోరారు. మహిళల తరపున, అంగన్వాడీ కార్యకర్తలకు డ్వాక్రా మహిళలకు, వీఆర్ఏలకు మధ్యాహ్న భోజన కార్మికులకు మద్దతుగా పోరాడతామని ఆమె తెలిపారు. -
మహమ్మారిపై మరోసారి పోరు
సాంబమూర్తినగర్ (కాకినాడ) :జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించేందుకు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఐదేళ్లలోపు చిన్నారులు జిల్లాలో 5,30,884 మంది ఉన్నట్టు అధికారులు అంచనా వేశారు. సంచార జాతులు, మత్స్యకారవాడలపై ప్రత్యేకదృష్టి సారించనున్నారు. పల్స్ పోలియో నిర్వహణకు జిల్లాలో 7,520 మంది వైద్య, ఏడు వేల మంది అంగన్వాడీ, ఐకేపీ, డ్వాక్రా యానిమేటర్లను 11 రూట్లలో నియమించారు. గ్రామీణ ప్రాంతాల్లో 2,112, పట్టణాల్లో 594, గిరిజన ప్రాంతంలో 876 పోలియో చుక్కల బూత్‌లను ఏర్పాటు చేశారు. ఆదివారం ఆయా బూత్‌ల వద్ద పోలియో చుక్కలు వేయడమే కాకుండా సోమ, మంగళ వారాల్లో ఇంటింటా సర్వే నిర్వహించి పోలియో చుక్కలు వేసేలా కార్యాచరణ రూపొందించారు. రాజమండ్రిలో బుధవారం కూడా పోలియో చుక్కలు వేయనున్నారు. జిల్లాలో 149 హైరిస్క్ ప్రాంతాలలో 26,273 కుటుంబాల్లో 10, 496 మంది ఐదేళ్లలోపు చిన్నారులున్నట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. వారందరికీ పూర్తిస్థాయిలో పోలియో చుక్కలు వేయాల్సిందిగా సిబ్బందికి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. పోలియో చుక్కలు ప్రతి చిన్నారికీ అందించేందుకు సుమారు ఏడు లక్షల డోసుల వ్యాక్సిన్‌ను ఆరోగ్య కేంద్రాలకు పంపిణీ చేశారు. కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం 8 గంటలకు కాకినాడ దుమ్ములపేట రాజీవ్ గృహకల్పలోని దుర్గాదేవి గుడి వద్ద కలెక్టర్ హెచ్.అరుణ్ కుమార్ లాంఛనంగా ప్రారంభిస్తారని జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ అనిత తెలిపారు. కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేసేందుకు ఆయా రూట్లలో ప్రత్యేకాధికారులకు బాధ్యతలు అప్పగించామన్నారు. పలుమార్లు అధికారులు, వైద్య సిబ్బందితో సమావేశాలు ఏ ర్పాటు చేశామని, ర్యాలీలు, కరపత్రాలు, బ్యానర్లు, వాల్‌పోస్టర్లతో విస్తృత ప్రచారం చేశామని చెప్పారు. జిల్లాలోని ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించడాన్ని వైద్య సిబ్బంది, తల్లిదండ్రులు బాధ్యతగా స్వీకరించాలని కలెక్టర్ అరుణ్‌కుమార్ ఆదేశించారు. పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కాకినాడలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులతో శనివారం ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమాన్ని అదనపు డీఎంహెచ్ఓ డాక్టర్ ఎం.పవన్‌కుమార్, కార్పొరేషన్ కమిషనర్ ఎస్.గోవిందస్వామి ప్రారంభించారు. విద్యార్థులు పోలియో చుక్కలు వేయించాలని నినదించారు. -
రెసిడెన్షియల్ స్కూళ్లకు రూ. 33 కోట్లు మంజూరు
హైదరాబాద్: సాంఘిక సంక్షేమ అభివృద్ధి విభాగ పరిధిలోని రెసిడెన్షియల్ పాఠశాలల నిర్వహణ, మరమ్మత్తులకు రూ.33.30కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వ రెసిడెన్షియల్ సెంట్రలైజ్డ్ పాఠశాలలకు రూ.23.62కోట్లు, విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు రూ.7.5కోట్లు, ఎస్సీ,ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం అమలుకు రూ.5కోట్లు మంజూరు చేసింది. అంగన్వాడీలకు రూ.9.23కోట్లు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్వాడీల్లో చిన్నారులకు ఇచ్చే ప్రీ స్కూల్ కిట్ల కోసం తొలివిడతగా రూ.9.23కోట్ల నిధులు ప్రభుత్వం మంగళవారం మంజూరు చేసింది. అలాగే కిషోరశక్తి యోజన పథకం అమలుకు రూ.60లక్షలు, బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌కు రూ.48లక్షలు మంజూరయ్యాయి. కాగా, హైదరాబాద్‌లో నిర్మించ తలపెట్టిన దొడ్డి కొమరయ్య కురుమ భవన్ కోసం రూ.5కోట్లు మంజూరుచేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఓబీసీలకు పోస్ట్‌మెట్రిక్ స్కాలర్‌షిప్పుల నిమిత్తం రూ.12.32 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీఅయ్యాయి. -
కార్మిక వ్యతిరేక విధానాలు దుర్మార్గం
శ్రీకాకుళం పాతబస్టాండ్: కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ.. ఉద్యోగాల తొలగింపు, ఉద్యోగులపై వేధింపులకు పాల్పడుతున్న తెలుగుదేశం ప్రభుత్వం ఇకనైనా తీరుమార్చుకోవాలని, వారి సంక్షేమానికి చొరవ చూపాలని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి డి. గోవిందరావు డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాల్లో భాగంలో సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ వద్ద ఇందిర కాంతి పథం, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన కార్మికులు, ఆశ కార్యకర్తలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఇతర స్కీమ్ వర్కర్లు కలెక్టరేట్‌ను ముట్టడించి మహాధర్నా చేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి బైవిరి కృష్ణమూర్తి, సీఐటీయూ అధ్యక్షుడు తిరుపతిరావు, ప్రధాన కార్యదర్శి గోవిందరావు మాట్లాడుతూ టీడీపీ హాయంలో గడచిన ఆరు నెలలుగా రాష్ట్రంలో కాంట్రాక్టు- అవుట్ సోర్సింగ్, స్కీం వర్కర్ల ఉద్యోగాలకు భద్రత లేకుండా పోయిందన్నారు. ఏళ్ల తరబడి విధులు నిర్వహిస్తున్న కార్మికుల టీడీపీ ప్రభుత్వం పొట్టకొడుతోందని, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఆదర్శ రైతులను ఇప్పటికే తొలగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇందిర కాంతి పథం, ఆశ వర్కర్లు, అంగన్వాడీలపై రాజకీయ నాయకులు వేధింపులు పెరుగుతున్నాయని, కనీస భద్రత కరువైందని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం కార్మిక కర్షక వ్యతిరేక ప్రభుత్వంగా మారడమే కాకుండా, కార్పొరేట్, బూర్జువా నాయకులకు వత్తాసుగా నిలుస్తోందని దుయ్యబట్టారు. పేద మహిళల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ఐకేపీ సీఎఫ్‌లకు 18 నెలలుగా వేతనాలు చెల్లించడంలేదని, దీనిపై మూడు నెలలుగా ఉద్యోగులు సమ్మె చేస్తున్నా ఈ ప్రభుత్వం చలించడం లేదని, అధికార గర్వంతో మహిళా సంక్షేమం విస్మరిస్తోందని విమర్శించారు. అంగన్వాడీ కార్యకర్తలు జీతాలు పెంచాలని, ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం చర్యల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజనం వంట కార్మికులు 13 నెలల బిల్లులు చెల్లించాలని, ఆశ కార్యకర్తలకు కేవలం రూ.400 ఇచ్చే పారితోకాన్ని ఇకనైనా పెంచాలని, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. నమ్మి ఓట్లు వేసిన చిరుద్యోగులను, ప్రజలను ప్రభుత్వం నట్టేట ముంచుతోందని విమర్శించారు. డ్వాక్రా మహిళలకు, రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల, స్కీం వర్కట్ల సమస్యల పరిష్కారం సకాలంలో జరగకపోతే, ప్రజలను చైతన్యపరిచి, ప్రజాఉద్యమం తీసుకువస్తామని, రాక్షసపాలనను అంతమొందిస్తామని వారు హెచ్చరించారు. ఈ ధర్నాను సందర్శించిన డీఆర్వో హేమసుందర వెంకటరావు మాట్లాడుతూ ప్రధాన డిమాం డ్లు ప్రభుత్వానికి తెలియజేస్తామన్నారు. దీంతో ధర్నాను ముగించారు. మహాధర్నాలో సుమారు 1800 మంది మహిళలు వచ్చారు. వారు కలెక్టరేట్ లోపలికి వెళ్లకుండా పోలీసులు ప్రధాన గేటు వద్ద అడ్డుకున్నారు. కేవీపీఎస్ కార్యదర్శి డి.గణేష్, చలపతిరావు, అమ్మన్నాయుడు, పంచాది అరుణ, నాగమణి, హిమప్రభ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకుల సంఘీభావం కార్మిక సంఘాల ధర్నాకు జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రతినిధులు సంఘీబావం తెలిపారు. కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్యక్షుడు డోల జగన్ ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. కిల్లి రామమోహన్‌రావు, చౌదరి సతీష్, ప్రసాద్, గంజి ఎజ్రా తదితరులు పాల్గొన్నారు. -
గోల్మాల్ ఉత్తదే!
చెన్నై, సాక్షి ప్రతినిధి : ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు, అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లలకు సంక్షేమ శాఖ ద్వారా పౌష్టికాహారంతోపాటూ కోడిగుడ్డును ప్రభుత్వం అందజేస్తోంది. అయితే కోడిగుడ్ల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడి ఏడాదికి రూ.50 కోట్ల వరకు ప్రభుత్వానికి టోపీ పెడుతున్నట్లు ఇటీవ ల ఆరోపణలు వెల్లువెత్తాయి.అసెంబ్లీలో సైతం ప్రతిపక్షాలు ఇదే విషయాన్ని ప్రస్తావించగా, మంత్రి వలర్మతి బదులిచ్చారు. రాష్ట్ర వ్యాప్తం గా ఏడాదికోసారి టెండర్లు పిలిచి కోడిగుడ్డు కొనుగోలు బాధ్యతను అప్పగిస్తున్నామన్నారు. టెండర్ల విధానం వల్ల ప్రభుత్వానికి ఎంతో ఆదాయం వచ్చిందన్నారు. కోడిగుడ్ల కొనుగోలులో గోల్మాల్ జరిగిదంటూ జరిగిన ప్రచా రం ప్రతిపక్షాల కుట్రగా ఆమె అభివర్ణించారు. జయ ముఖ్యమంత్రిగా రూ.31వేల కోట్ల పధకాలను ప్రకటించగా, వాటిల్లో ఒక్కటైనా పూర్తయిందాఅని డీఎంకే సభాపక్ష నేత స్టాలిన్ ప్రశ్నించారు. డీఎంకే మైనార్టీ ప్రభుత్వం ఐదేళ్లలో సాధించిన ప్రగతికంటే మూడేళ్లలో తమ ప్రభుత్వం సాధించిందే ఎక్కువని ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం బదులిచ్చారు. డీఎంకే ప్రభుత్వాన్ని మైనార్టీ ప్రభుత్వం అని పిలవడంపై ఆ పార్టీ సభ్యులు గందరగోళం సృష్టించారు. తమది మైనార్టీ ప్రభుత్వమైతే ప్రస్తుత ప్రభుత్వం ఏమిటి, ఈ ముఖ్యమంత్రిని ఎలా పిలవాలి అంటూ డీఎంకే వ్యాఖ్యానించడంతో మరింత గందరగోళం నెలకొంది. జయలలితను అన్నాడీఎంకే నేతలు ప్రజల ముఖ్యమంత్రి అని పిలవడంపై పరోక్షంగా డీఎంకే సభ్యులు ఎద్దేవా చేయడంతో అధికార పార్టీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ, పార్లమెంటు, స్థానిక సంస్థలు ఇలా అన్ని ఎన్నికల్లోనూ విజయపరంపర కొనసాగిస్తున్న జయను ప్రజల ముఖ్యమంత్రి అనడంలో తప్పేమిటని ఇండియా కుడియరసు పార్టీ అధ్యక్షులు, శాసనభ్యులు తమిళరసు డీఎంకే సభ్యులను నిలదీశారు. శాంతి భద్రతల సమస్యకు దారితీసే స్థాయిలో రాష్ట్రంలో జాతి విద్వేషాలు లేవని సీఎం పన్నీర్‌సెల్వం, పుదియ తమిళగం పార్టీ సభ్యులు డాక్టర్ కృష్ణస్వామిప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మూడేళ్లలో తూత్తుకూడి, తిరునెల్వేలీ జిల్లాలో జాతి విద్వేష సంఘటనలు, కేసుల వివరాలను సభకు వివరించారు. తిరునెల్వేలీలో 2013లో 5 హత్యలు, 2014లో 10, తూత్తుకూడిలో 2013లో ఒకటి, 2014లో 3 హత్యలు జరిగాయని వివరించారు. అయితే అవేవీ తీవ్రస్థాయిలో శాంతి భద్రతల సమస్యకు దారితీయలేదని సీఎం అన్నారు. జయపై డీఎంకే సభ్యులు, కరుణపై అన్నాడీఎంకే సభ్యులు ప్రత్యక్ష, పరోక్ష విమర్శలు తీవ్రస్థాయికి చేరగా బాహాబాహీకి సిద్ధమయ్యూరు. స్పీకర్ ధనపాల్‌ను డీఎంకే సభ్యులు ప్రశ్నిం చగా, సభా నిర్వహణ తనకు తెలుసని ఎవరూ సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదంటూ హెచ్చరించారు. అంతేగాక మార్షల్స్ చేత వారిని వెలుపలకు గెంటివేసే ప్రయత్నం చేయడంతో డీఎంకే సభ్యులు వాకౌట్ చేశారు.