మహమ్మారిపై మరోసారి పోరు | pulse polio programme Once again, Fighting | Sakshi
Sakshi News home page

మహమ్మారిపై మరోసారి పోరు

Published Sun, Feb 22 2015 12:03 AM | Last Updated on Sat, Sep 2 2017 9:41 PM

pulse polio programme Once again, Fighting

సాంబమూర్తినగర్ (కాకినాడ) :జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించేందుకు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఐదేళ్లలోపు చిన్నారులు జిల్లాలో 5,30,884 మంది ఉన్నట్టు అధికారులు అంచనా వేశారు.  సంచార జాతులు, మత్స్యకారవాడలపై ప్రత్యేకదృష్టి సారించనున్నారు. పల్స్ పోలియో నిర్వహణకు జిల్లాలో 7,520 మంది వైద్య, ఏడు వేల మంది అంగన్‌వాడీ, ఐకేపీ, డ్వాక్రా యానిమేటర్లను 11 రూట్లలో నియమించారు. గ్రామీణ ప్రాంతాల్లో 2,112, పట్టణాల్లో 594, గిరిజన ప్రాంతంలో 876 పోలియో చుక్కల బూత్‌లను ఏర్పాటు చేశారు. ఆదివారం ఆయా బూత్‌ల వద్ద పోలియో చుక్కలు వేయడమే కాకుండా సోమ, మంగళ వారాల్లో ఇంటింటా సర్వే నిర్వహించి పోలియో చుక్కలు వేసేలా కార్యాచరణ రూపొందించారు.
 
 రాజమండ్రిలో బుధవారం కూడా పోలియో చుక్కలు వేయనున్నారు. జిల్లాలో 149 హైరిస్క్ ప్రాంతాలలో 26,273 కుటుంబాల్లో 10, 496 మంది ఐదేళ్లలోపు చిన్నారులున్నట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. వారందరికీ పూర్తిస్థాయిలో పోలియో చుక్కలు వేయాల్సిందిగా సిబ్బందికి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. పోలియో చుక్కలు ప్రతి చిన్నారికీ అందించేందుకు సుమారు ఏడు లక్షల డోసుల వ్యాక్సిన్‌ను ఆరోగ్య కేంద్రాలకు పంపిణీ చేశారు. కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం 8 గంటలకు కాకినాడ దుమ్ములపేట రాజీవ్ గృహకల్పలోని దుర్గాదేవి గుడి వద్ద కలెక్టర్ హెచ్.అరుణ్ కుమార్ లాంఛనంగా ప్రారంభిస్తారని జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ అనిత తెలిపారు.
 
 కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేసేందుకు ఆయా రూట్లలో ప్రత్యేకాధికారులకు బాధ్యతలు అప్పగించామన్నారు. పలుమార్లు అధికారులు, వైద్య సిబ్బందితో సమావేశాలు ఏ ర్పాటు చేశామని, ర్యాలీలు, కరపత్రాలు, బ్యానర్లు, వాల్‌పోస్టర్లతో విస్తృత ప్రచారం చేశామని చెప్పారు. జిల్లాలోని ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించడాన్ని  వైద్య సిబ్బంది, తల్లిదండ్రులు బాధ్యతగా స్వీకరించాలని కలెక్టర్ అరుణ్‌కుమార్ ఆదేశించారు. పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కాకినాడలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులతో శనివారం ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమాన్ని అదనపు డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎం.పవన్‌కుమార్, కార్పొరేషన్ కమిషనర్ ఎస్.గోవిందస్వామి ప్రారంభించారు. విద్యార్థులు పోలియో చుక్కలు వేయించాలని నినదించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement