కార్మిక వ్యతిరేక విధానాలు దుర్మార్గం
శ్రీకాకుళం పాతబస్టాండ్: కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ.. ఉద్యోగాల తొలగింపు, ఉద్యోగులపై వేధింపులకు పాల్పడుతున్న తెలుగుదేశం ప్రభుత్వం ఇకనైనా తీరుమార్చుకోవాలని, వారి సంక్షేమానికి చొరవ చూపాలని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి డి. గోవిందరావు డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాల్లో భాగంలో సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ వద్ద ఇందిర కాంతి పథం, అంగన్‌వాడీ, మధ్యాహ్న భోజన కార్మికులు, ఆశ కార్యకర్తలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఇతర స్కీమ్ వర్కర్లు కలెక్టరేట్‌ను ముట్టడించి మహాధర్నా చేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి బైవిరి కృష్ణమూర్తి, సీఐటీయూ అధ్యక్షుడు తిరుపతిరావు, ప్రధాన కార్యదర్శి గోవిందరావు మాట్లాడుతూ టీడీపీ హాయంలో గడచిన ఆరు నెలలుగా రాష్ట్రంలో కాంట్రాక్టు- అవుట్ సోర్సింగ్, స్కీం వర్కర్ల ఉద్యోగాలకు భద్రత లేకుండా పోయిందన్నారు.
ఏళ్ల తరబడి విధులు నిర్వహిస్తున్న కార్మికుల టీడీపీ ప్రభుత్వం పొట్టకొడుతోందని, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఆదర్శ రైతులను ఇప్పటికే తొలగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇందిర కాంతి పథం, ఆశ వర్కర్లు, అంగన్‌వాడీలపై రాజకీయ నాయకులు వేధింపులు పెరుగుతున్నాయని, కనీస భద్రత కరువైందని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం కార్మిక కర్షక వ్యతిరేక ప్రభుత్వంగా మారడమే కాకుండా, కార్పొరేట్, బూర్జువా నాయకులకు వత్తాసుగా నిలుస్తోందని దుయ్యబట్టారు. పేద మహిళల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ఐకేపీ సీఎఫ్‌లకు 18 నెలలుగా వేతనాలు చెల్లించడంలేదని, దీనిపై మూడు నెలలుగా ఉద్యోగులు సమ్మె చేస్తున్నా ఈ ప్రభుత్వం చలించడం లేదని, అధికార గర్వంతో మహిళా సంక్షేమం విస్మరిస్తోందని విమర్శించారు. అంగన్‌వాడీ కార్యకర్తలు జీతాలు పెంచాలని, ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం చర్యల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు.
మధ్యాహ్న భోజనం వంట కార్మికులు 13 నెలల బిల్లులు చెల్లించాలని, ఆశ కార్యకర్తలకు కేవలం రూ.400 ఇచ్చే పారితోకాన్ని ఇకనైనా పెంచాలని, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. నమ్మి ఓట్లు వేసిన చిరుద్యోగులను, ప్రజలను ప్రభుత్వం నట్టేట ముంచుతోందని విమర్శించారు. డ్వాక్రా మహిళలకు, రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల, స్కీం వర్కట్ల సమస్యల పరిష్కారం సకాలంలో జరగకపోతే, ప్రజలను చైతన్యపరిచి, ప్రజాఉద్యమం తీసుకువస్తామని, రాక్షసపాలనను అంతమొందిస్తామని వారు హెచ్చరించారు. ఈ ధర్నాను సందర్శించిన డీఆర్వో హేమసుందర వెంకటరావు మాట్లాడుతూ ప్రధాన డిమాం డ్లు ప్రభుత్వానికి తెలియజేస్తామన్నారు. దీంతో ధర్నాను ముగించారు. మహాధర్నాలో సుమారు 1800 మంది మహిళలు వచ్చారు. వారు కలెక్టరేట్ లోపలికి వెళ్లకుండా పోలీసులు ప్రధాన గేటు వద్ద అడ్డుకున్నారు. కేవీపీఎస్ కార్యదర్శి డి.గణేష్, చలపతిరావు, అమ్మన్నాయుడు, పంచాది అరుణ, నాగమణి, హిమప్రభ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ నాయకుల సంఘీభావం
కార్మిక సంఘాల ధర్నాకు జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రతినిధులు సంఘీబావం తెలిపారు. కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్యక్షుడు డోల జగన్ ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. కిల్లి రామమోహన్‌రావు, చౌదరి సతీష్, ప్రసాద్, గంజి ఎజ్రా తదితరులు పాల్గొన్నారు.