
అమరావతి పేరుతో దోపిడీ
ప్రభుత్వంపై ఆమ్‌ఆద్మీ రాష్ట్ర కన్వీనర్ ఆరోపణ
సమగ్ర విచారణకు డిమాండ్
కర్నూలు(టౌన్): రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం పేరుతో పాలకులు దోపిడీ సాగిస్తున్నారని ఆమ్‌ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ రాజా యాదవ్ ఆరోపించారు. ఇందుకు సంబంధించి సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. స్థానిక రెవెన్యూ కాలనీలోని పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కార్యకర్త ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కింగ్‌ఫిషర్ అధినేత విజయ్ మాల్యాను కేంద్రమే తప్పించిందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి నిర్మాణం పేరుతో రూ. వేలకోట్ల దోపిడికి తెరతీశారన్నారు. సింగపూర్‌ను తలపించేలా రాజధాని నిర్మిస్తామని చెబుతున్న సీఎం చంద్రబాబు అక్కడ సామాన్య మానవుడు ఎలా బతుకుతాడో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా ద్వారానే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని, దాన్ని సాధించునేందుకు ఉద్యమించాలన్నారు. పార్టీ అధికార ప్రతినిధి పి.బి.వి. సుబ్బయ్య మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలు, గ్రామాలకు పార్టీ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో పార్టీ కన్వీనర్లు కె.సి. రాముడు, సురేష్ యాదవ్ పాల్గొన్నారు.