పొదలకూరు మండలం కనుపర్తి సర్పంచ్ అట్ల జానకిరామిరెడ్డికి పొదలకూరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉంది. బ్యాంకు నుంచి రూ.40వేలు క్రాప్ లోను తీసుకున్నాడు. జానకిరామిరెడ్డి అకౌంట్‌లో రూ.70వేలు నగదు ఉంది. బ్యాంకు వారు ఎటువంటి నోటీసుతో, సమాచారం ఇవ్వకుండానే ఆయన అకౌంట్‌లోని రూ.70వేల నుంచి రూ.40 వేలను రుణంలోకి జమ చేసుకున్నారు.
గూడూరు రూరల్ మండలం చెమిర్తికి చెందిన దశయ్య గూడూరు ఎస్‌బీఐలో రూ.70వేలు ఎల్‌టీ రుణం, రూ.60వేలు క్రాప్‌లోను తీసుకున్నారు. వడ్డీతో కలిపి రూ.1,70,000 అయింది. దశయ్య తాత తిరుపాలయ్యకు చెందిన స్థలంలో ఐడియా కంపెనీ సెల్ టవర్ నిర్మించింది. దీనికి సంబంధించి కంపెనీ తిరుపాలయ్యకు నెలకు రూ.7,500 చెల్లిస్తోంది. తిరుపాలయ్యకు బ్యాంక్ అకౌంట్ లేకపోవడంతో దశయ్య ఎస్‌బీఐ అకౌంట్ నంబరు ఇచ్చాడు. ఐడియా కంపెనీ వారు దశయ్య అకౌంట్‌లో రూ.7,500 జమ చేశారు. ఇది గమనించిన బ్యాంక్ అధికారులు రూ.7,500ను దశయ్య క్రాప్‌లోనులో జమ వేసుకున్నారు.
సాక్షి, నెల్లూరు: బలవంతపు వసూళ్లు జానకిరామిరెడ్డి, దశయ్యకే పరిమితం కాలేదు. చెప్పుకుంటూ పోతే ఈ జాబితా చాంతాడంత. బ్యాంకులు బరితెగించాయి. రుణమాఫీపై ప్రభుత్వం నాన్చుడు ధోరణిలో ఉండడం, ఆర్‌బీఐ నుంచి మార్గదర్శకాలు రాకపోవడంతో బ్యాంకర్లు తమ పని మొదలుపెట్టారు. తక్షణమే బకాయిలు చెల్లించాలని రైతులపై ఒత్తిడి తెస్తున్నారు. పాత బకాయిలను చెల్లిస్తే వెంటనే కొత్తరుణాలు ఇస్తామంటూ బేరం పెడుతున్నారు.
అక్కడికి పరిమితం కాకుండా దొరికిన రైతులను దొరికినట్టే ముక్కుపిండి మరీ బకాయిలు వసూళ్లు చేస్తున్నాయి. రైతులు, వారి కుటుంబ సభ్యుల ఖాతాలపై నిఘాపెట్టి మరీ అందిన కాడికి బలవంతపు వసూళ్లకు దిగారు. దీంతో అన్నదాతలు బెంబేలెత్తుతున్నారు. బ్యాంకు ఖాతాలు లేనివారు తమ బంధువులు, స్నేహితులైన రైతుల అకౌంట్లకు సొమ్ము వేయించుకొనేందుకు భయపడిపోతున్నారు. డబ్బులు ఎవరివైనాసరై.. ఎంత అవసరమో,ఆపదో లేక ఆడపిల్ల పెళ్లో అని కూడా బ్యాంకులు చూడడంలేదు.
రైతు ఖాతాలోకి డబ్బువచ్చిందంతే..! అంటూ రుణాలకు జమవేస్తున్నారు. ప్రభుత్వం రుణాలు మాఫీపై దాటవేత ధోరణితో వ్యవహరిస్తున్నందున ఇక తమపని తాము చేసుకోవాల్సిందేనని బ్యాంకు అధికారులు తేల్చి చెబుతున్నారు. ఇప్పటికే కావలి, గూడూరు, ఆత్మకూరు, ఉదయగిరి ప్రాంతాలతో పాటు జిల్లాలో పలుచోట్ల బ్యాంకులు రైతులకు బకాయిలు చెల్లించాలంటూ నోటీసులు ఇచ్చాయి, ఇస్తున్నాయి. ఈ విషయం బయటకు చెప్పుకునేందుకు నామోషీ కావడంతో రైతులు నోరుమెదపడంలేదు. చంద్రబాబు పుణ్యమాని రైతులు అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. బాబు రుణమాఫీ హామీ లేకపోతే రైతులు వారి తిప్పలు వారు పడి జూన్ నాటికే వడ్డీలు చెల్లించి రుణాలు రీషెడ్యూల్ చేసుకొనేవారు. తిరిగి లోన్ పొంది సకాలంలో వ్యవసాయం చేసేవారు. కష్టాల వ్యవసాయంలో రుణమాఫీ రూపంలో కొంతైనా మేలుజరుగుతుందని ఆశించారు. బాబుకు ఓట్లేసి అధికారం అప్పగించారు. అధికారంలోకి వచ్చిన బాబు మాటతప్పారు. ముఖ్యమంత్రి పీఠం అధిష్టించి రెండునెలలు కావస్తున్నా రుణమాఫీ హామీపై స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు రైతులకు ఖరీఫ్ రుణాలు అందేపరిస్థితి లేకుండా పోయింది. జూలై చివరినాటికి రుణాలు అందకపోతే.. క్రాఫ్ ఇన్సూరెన్స్ అందే పరిస్థితి ఉండదు. ఇప్పటికీ ఖరీఫ్ రుణాలు వస్తాయో రావో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.
బలవంతపు వసూళ్లు
Published Sun, Jul 27 2014 2:32 AM | Last Updated on Sat, Sep 2 2017 10:55 AM
Advertisement
Advertisement