బలవంతపు వసూళ్లు ఆపండి | Extruded Stop collections | Sakshi
Sakshi News home page

బలవంతపు వసూళ్లు ఆపండి

Published Fri, Jul 10 2015 4:15 AM | Last Updated on Sun, Sep 3 2017 5:11 AM

బలవంతపు వసూళ్లు ఆపండి

బలవంతపు వసూళ్లు ఆపండి

- కరువు రైతులకు వెసులుబాటు కల్పించండి
- రైతులకు పగటిపూటే విద్యుత్ ఇవ్వాలి
- వాటర్‌షెడ్ పనులు పూర్తిస్థాయిలో చేపట్టాలి
- ఎంపీ, విజిలెన్స్ మానిటరింగ్ సమావేశంలో కో-చైర్మన్ మిథున్‌రెడ్డి     
సాక్షి,చిత్తూరు:
‘ప్రభుత్వమేమో ప్రజలకు ఇవ్వాల్సిన రుణమాఫీ లాంటి వాటిని వాయిదాల పద్ధతిలో ఇస్తోంది. కరువు నేపథ్యంలో ప్రజలకు కూడా అదేవిధంగా వెసులుబాటు కల్పించి డబ్బులున్నపుడు విద్యుత్ బకాయిలు చెల్లించే అవకాశం ఇవ్వాలి. అప్పటివరకూ అధికారులు బలవంతపు వసూళ్లూ ఆపాలి’ అని రాజంపేట ఎంపీ, విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ కోచైర్మన్ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి విద్యుత్‌శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది.

తొలుత విద్యుత్‌పై జరిగిన సమావేశంలో పాల్గొన్న మిథున్‌రెడ్డి మాట్లాడుతూ రైతులకు రాత్రిపూట కాకుండా పగటిపూట పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరా చేయాలన్నారు. ఇచ్చే కొద్దిపాటి విద్యుత్ పగటిపూట ఇస్తే కొంతైనా మేలు చేకూరుతుందన్నారు. ప్రభుత్వం వ్యవసాయానికి ఏడుగంటల పాటు విద్యుత్ ఇస్తున్నామని ప్రకటించినా అది ఎక్కడా అమలు కావడంలేదన్నారు. ప్రజాప్రతినిధులు, విద్యుత్ అధికారుల మధ్య సమన్వయలోపం ఉందన్నారు. ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను విద్యుత్‌అధికారులు పరిగణనలోకి తీసుకోవడంలేదన్నారు. ఇది మంచి సంప్రదాయం కాదని, ప్రజాప్రతినిధులు ఇచ్చిన ప్రతిపాదనలు అమలు జరిగేలా చూడాలన్నారు.

విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లు, మిగతా సామగ్రికోసం ప్రజలు ట్రాన్స్‌కో కార్యాలయాల చుట్టూ రోజుల తరబడి తిరగాల్సి వస్తోందన్నారు. ముందు రైతులను గౌరవించాలన్నారు. జిల్లాలో ఇప్పటివరకు ఉన్న తాగునీటి పథకాలతో పాటు రైతులకు సంబంధించిన విద్యుత్ సమస్యలను అధికారులు తక్షణం పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో వాటర్‌షెడ్ పనులు సక్రమంగా జరగడం లేదన్నారు. వాటిని వేగవంతం చేయాలన్నారు. ప్రతిపంచాయతీలో ఫీల్డ్ అసిస్టెంట్లను పెట్టాలన్నారు.

గతంలో  సస్పెన్షన్‌కు గురైన ఉపాధి ఉద్యోగుల ఈపీఎఫ్  * 26 కోట్ల మొత్తాన్ని ఉద్యోగులకు చెల్లించాలన్నారు. సమస్యలపై గత సమావేశాల్లో ఇచ్చిన వినతులకు  పరిష్కారం లభించడం లేదన్నారు. అలాంటపుడు సమావేశాలెందుకని ఆయన ప్రశ్నించారు. సమావేశంలో విజిలెన్స్‌అండ్ మానిటరింగ్ కమిటీ చైర్మన్, ఎంపీ శివప్రసాద్, కమిటీ కన్వీనర్, కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్, శాసన సభ్యులు నారాయణస్వామి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, సునీల్‌కుమార్, సత్యప్రభ, సుగుణమ్మ తదితరులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement