నేడు ఏయూ స్నాతకోత్సవం
- ఏర్పాట్లు పూర్తి
- వెబ్‌సైట్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం
ఏయూ క్యాంపస్: ఆంధ్రా యూనివర్సిటీ 82వ స్నాతకోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి స్నాతకోత్సవ మందిరాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. వేదికను విద్యుత్ కాంతుల వెలుగులతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. సోమవారం మధ్యాహ్నం 3.30 నుంచి 5.30 గంటల వరకు రెండు గంటల పాటు ఈ వేడుక సాగనుంది.
వీసీ జి.ఎస్.ఎన్.రాజు ఏర్పాట్లను ఆదివారం స్వయంగా పరిశీలించారు. వేదికకు ఇరువైపులా అందరికి కనిపించే విధంగా రెండు స్క్రీన్‌లను ఏర్పాటు చేశారు. అతిథుల ఆగమనం, సభావేదికపై సిటింగ్, డాక్టరేట్ తీసుకునే వారి సిటింగ్ తదితర అంశాలపై అధికారులతో చర్చించారు.
ఈ కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య ఇ.ఎ.నారాయణ, రిజిస్ట్రార్ ఆచార్య కె.రామ్మోహనరావు, ప్రిన్సిపాళ్లు పి.ఎస్.అవధాని, సి.వి.రామన్, డి.సూర్యప్రకాశరావు, బి.గంగారావు, కె.గాయత్రి దేవి తదితరులు పాల్గొన్నారు. స్నాతకోత్సవాన్ని www.youtube.com/users/andhrauniversitylive, www.andhrauniversity.edu.in, www.aucoe.infoవెబ్‌సైట్‌ల ద్వారా ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఏర్పాట్లు చేశారు.
ముఖ్యఅతిథిగా రాఘవన్
స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా భారత ప్రభుత్వ ప్రధాన సాంకేతిక సలహాదారు కార్యాలయం సాంకేతిక కార్యదర్శిగా సేవలందిస్తున్న ఆచార్య ఎస్.వి.రాఘవన్ హాజరుకానున్నారు. ఆయనకు వర్సిటీ తరఫున డాక్టర్ ఆఫ్ సైన్స్(డీ.ఎస్సీ)ను ప్రధానం చేస్తారు. ఆయన స్నాతకోత్సవ ప్రసంగం చేస్తారు. ఆయన మద్రాసు ఐఐటీ ఆచార్యునిగా పనిచేశారు. ప్రస్తుతం ఢిల్లీ విశ్వవిద్యాలయం గౌరవ ఆచార్యునిగా, నేషనల్ నాలెడ్జ్ సెంటర్ చీఫ్ ఆర్కిటెక్‌గా పనిచేస్తున్నారు.