శకుంతలమ్మకు ఆర్థిక సాయం చేస్తున్న ఫేస్ బుక్ మిత్రులు
అనంతపురం, రాప్తాడు: తమ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి రాప్తాడు మండల కేంద్రానికి చెందిన యువకులు వినూత్నంగా ఆలోచించారు. ఇందుకు ఫేస్‌బుక్‌ను వేదికగా ఎంచుకున్నారు. గ్రామాభివృద్ధికి అవసరమైన ప్రణాళికతో పాటు గ్రామంలో కూడు, గూడు, గుడ్డకు నోచుకోని వారికి తోచిన సాయమందించాలని భావించారు. వెంటనే ఫేస్‌బుక్‌లో ‘రాప్తాడు డెవలప్‌మెంట్ ఫోరం’ అనే పేరుతో ఓ గ్రూప్‌ను క్రియేటివ్ చేశారు. అందులో దాదాపు 300 మంది వరకు సభ్యులుగా చేరారు.
ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి ఒక మిత్రుడు... గత ఏడాది రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయిన దళిత మహిళ శకుంతలమ్మ అనారోగ్యంతో బాధపడుతుందని... ఆమెకు సాయం చేద్దామని సూచించాడు. అప్పటికప్పుడే ఫోరంలోని సభ్యులంతా చర్చించుకొని తెలుగు పండుగ సంక్రాంతి రోజున ఆమెకు సాయం అందించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే సోమవారం మిత్రులంతా కలిసి అనారోగ్యంతో బాధపడుతున్న శకుంతలమ్మ ఇంటికి వెళ్లి తమ వంతు బాధ్యతగా రూ.7,100 నగదు, బ్రెడ్లు అందజేశారు. మున్ముందు ఈ కుటుంబానికి మరింత అండగా ఉంటామన్నారు. ‘రాప్తాడు డెవలప్‌మెంట్ ఫారం’ పార్టీలకతీతంగా, కులాలకు అతీతంగా ముందుకు నడుస్తుందన్నారు. కార్యక్రమంలో పలువురు యువకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment