తెగని ప్రేమ పంచాయితీలు..
► పోలీస్‌స్టేషన్ చేరిన రెండు ప్రేమ జంటలు
►నలుగురూ మేజర్లే
►తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో తలెత్తిన వివాదం
పోరుమామిళ్ల(వైఎస్సార్ జిల్లా) : సమాజంలో కొనసాగుతున్న కులాల, మతాల అంతరాలు ప్రేమజంటలకు అడ్డుగోడలుగా, ఆటంకాలుగా మారాయి. అందులో కులాంతర, మరీ మతాంతర ప్రేమలు సమస్యలుగా పరిణమిస్తున్నాయి. యువత ఆకర్షణలో ప్రేమలో పడుతున్నారు. కొన్నింటికి త్వరలోనే తెర పడుతుండగా, కొన్ని వివాహం దాకా వెళుతున్నాయి. వీటిల్లో ఇరు వర్గాలు అంగీకరించనివి కొన్ని కాగా, ఒక వర్గం ఆమోదించి రెండో వర్గం ఆమోదించనివి మరికొన్ని ఉన్నాయి. ఇవి రెండూ ఘర్షణలకు, వివాదాలకు దారి తీస్తున్నాయి.
ఫేస్‌బుక్ పరిచయంతో...
తల్లిదండ్రులు పిల్లలను ఎంతో ప్రేమగా 18 ఏళ్లు పెంచి, చదివించి వారి అభ్యున్నతికి బాటలు వేస్తే.. ఆ పిల్లలు తల్లిదండ్రులకు తెలియకుండా ప్రేమపేరుతో చెప్పకుండా వెళ్లిపోవడం నిజంగా బాధాకరమే. అలాంటి ఘటనలు చోటుచేసుకున్న ఇంట్లో తల్లిదండ్రులకు నిద్రలేని రాత్రులెన్నో. పంతాలు, పట్టింపులు, పరువు ప్రతిష్టలకు అత్యంత విలువ నిచ్చే కొంతమంది ఏమి చేయడానికైనా తెగిస్తున్నారు. ప్రేమికులను దారుణంగా హత్య చేస్తున్న సంఘటనలు నిత్యం మన ముందు కనిపిస్తున్నాయి.
అలాంటి సాహసం చేయలేని వారు కుమిలిపోతున్నారు. తల్లిదండ్రులు బతిమలాడినా, బెదిరించినా, పెద్దలు సలహాలు, సూచనలు ఇచ్చినా ప్రేమికులు లెక్క చేయడం లేదు. ఆఖరుకు పోలీసులు నచ్చచెప్పేందుకు చేసే ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. ఇద్దరూ మేజర్లు అయినపుడు పోలీసులు కాదు కదా ఏ అధికారీ ఏమీ చేయలేక పోతున్నారు. ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయి గురువారం, శుక్రవారం పోరుమామిళ్లలో జరిగిన రెండు సంఘటనలు.
పోరుమామిళ్లకు చెందిన సుబహాన్ హైదరాబాద్కు చెందిన అమ్మాయితో ఫేస్‌బుక్ పరిచయంతో ప్రేమలో పడి వివాహం చేసుకున్నారు. కులాంతర, మతాంతర, రాష్ట్రాంతర వివాహాన్ని సహించలేకపోయిన అమ్మాయి తల్లిదండ్రులు గురువారం పోరుమామిళ్ల వచ్చి అబ్బాయిపై దాడి చేశారు. విషయం పోలీస్‌స్టేషన్ చేరింది. ఎస్సై, సీఐ ఊర్లో లేకపోవడంతో సమస్య అపరిష్కృతంగా మారింది.
ఔరంగాబాద్ వెళ్లి పెళ్లి..
ఈ నేపథ్యంలో గురువారం మరో ప్రేమజంట పోలీస్‌స్టేషన్ చేరింది. పోరుమామిళ్ల పట్టణానికే చెందిన ఈ జంట 15 రోజుల క్రితం ఊరు వదిలి మహారాష్ట్రలోని ఔరంగాబాద్ వెళ్లినట్లు తెలిసింది. అమ్మాయి హిందూ మతానికి చెందినది కాగా, అబ్బాయి ముస్లిం యువకుడు. అమ్మాయి కడపలో బీటెక్ చదువుతుండగా, అబ్బాయి కారు డ్రైవర్‌గా, జిమ్‌లో ట్రైనర్‌గా పని చేస్తున్నట్లు తెలిసింది. ఇద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారి, ఇప్పుడు ఊరు వదిలే స్థితికి చేరింది. ఔరంగాబాద్‌లోనే ముస్లిం సంప్రదాయంలో వివాహం చేసుకుని, తగిన సాక్ష్యాధారాలతో కడపలో ఏఎస్పీని ఆశ్రయించారు. ఇద్దరూ మేజర్లు కావడంతో జిల్లా పోలీసు ఉన్నతాధికారి గురువారం వారిని ఎస్కార్ట్‌తో పోరుమామిళ్లకు పంపించారు.