పోలీస్‌స్టేషన్ ఎదుట బైఠాయించిన బాధితురాలు, వాణిని వివాహం చేసుకున్నప్పటి ఫొటో
చందంపేట : రెండేళ్ల క్రితం ఫేస్‌బుక్‌లో పరిచయమైన వారి ప్రేమ... పెళ్లి వరకు వచ్చింది..ఐదు నెలల క్రితం ఆ ఇద్దరూ వివాహం చేసుకున్నారు. ఆమె నుంచి సుమారు రూ.10 లక్షల మేర వివిధ రూపాల్లో వసూలు చేసిన యువకుడు ఇప్పుడు తల్లిదండ్రులు కుదిర్చిన పెళ్లి చేసుకున్నాడు. దాంతో తనను మోసం చేశాడని చందంపేట పోలీసులను బాధితురాలు ఆశ్రయించిన ఉదంతం గురువారం చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ బెంజి సర్కిల్‌కు చెందిన ధారావత్ వాణి చిన్నతనంలోనే తల్లిదండ్రులు మృతి చెందడంతో అక్కబావ వద్ద ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తుంది. కాగా రెండేళ్ల క్రితం మిర్యాలగూడకు చెందిన ధనావత్ మంగ్యనాయక్, రంగమ్మల కుమారుడు విష్ణుతో ఫేస్ బుక్‌లో పరిచయమైంది.
వీరి ఫేస్ బుక్ పరిచయం ప్రేమగా మారి ఐదు నెలల క్రితం వివాహం చేసుకున్నారు. గత రెండు నెలల క్రితం విష్ణును వారి కుటుంబ సభ్యులు కిడ్నాప్ చేయడంతో విజయవాడ పీఎస్‌లో కిడ్నాప్ కేసు నమోదైంది. దీంతో గ్రామానికి తీసుకొచ్చిన పోలీసులు ఇరు కుటుంబాల మధ్య సయోధ్య కుదిర్చారు. వారం రోజుల క్రితం పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకుందామని చెప్పి చందంపేట మండలానికి చెందిన ఓ యువతితో గురువారం వివాహం చేశారు. తన భర్త అనారోగ్యానికి గురయ్యాడని, ఆసుపత్రిలో చూపించి తీసుకొస్తామని చెప్పి పెళ్లి చేశారని బాధిత మహిళ చందంపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. విజయవాడలో కేసు నమోదు చేయడంతో అక్కడికి వెళ్లి సమస్యను పరిష్కరించుకోవాలని చందంపేట పోలీసులు తెలిపారు. తన భర్త వివాహం కాకముందే తాను పోలీస్ స్టేషన్‌కు వచ్చినా పోలీసులు పట్టించుకోలేదని, పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి ఆవేదన వ్యక్తం చేసింది. ఎస్‌ఐ రామకృష్ణ బాధిత మహిళకు, వారి బంధువులకు నచ్చజెప్పడంతో సదరు మహిళ, బంధువులు విజయవాడకు తరలివెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment