![Newly Married Couple Seeks Police Protection In Miryalaguda - Sakshi](/styles/webp/s3/article_images/2022/01/27/NLg.jpg.webp?itok=UNuihveW)
తమ వివాహ సర్టిఫికెట్‌ను చూపుతున్న ప్రియాంక, సందీప్
సాక్షి, మిర్యాలగూడ: ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ జంట తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించారు. వివరాలు.. మిర్యాలగూడ మండలం తడకమళ్ల గ్రామానికి చెందిన ఎంపీటీసీ, వైస్ ఎంపీపీ అమరావతి సైదులు కుమార్తె ప్రియాంక, అదే గ్రామానికి చెందిన తుర్క సందీప్ గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇరువురు మేజర్లు అయినప్పటికీ, ఇద్దరి కులాలు వేర్వేరు కావడంతో ఇరు కుటుంబాల సభ్యులు తమ పెళ్లికి ఒప్పుకోరని భావించి ఎవరికీ తెలియకుండా గత నెల 20న హైదరాబాద్‌లోని జీడిమెట్ల ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఎవరి ఇంట్లో వారు ఉంటున్నారు. బుధవారం ఈ విషయం ప్రియాంక ఇంట్లో తెలియడంతో ఇద్దరూ కలసి మిర్యాలగూడ డీఎస్పీ కార్యాలయానికి చేరుకుని తమకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు.
చదవండి: మూడేళ్లుగా కానిస్టేబుల్‌తో ప్రేమ.. మాయమాటలతో లోబర్చుకొని.. మరో వ్యక్తితో పెళ్లైనప్పటికీ
వారి వద్ద వివరాలు తీసుకున్న డీఎస్పీ వై. వెంకటేశ్వర్‌రావు కార్యాలయంలో మహిళా పోలీసులు లేనందున మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిందిగా సూచించారు. దీంతో వారు రూరల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లేందుకు డీఎస్పీ కార్యాలయం గేటు వద్దకు చేరుకునే లోగా అక్కడికి చేరుకున్న వైస్ ఎంపీపీ సైదులు అనుచరులు వారిని అడ్డగించే ప్రయత్నం చేశారు. వెంటనే ఆ జంట తిరిగి డీఎస్పీ కార్యాలయంలోకి వెళ్లారు. అనంతరం ఏఎస్‌ఐని రక్షణగా ఉంచి పోలీస్ వాహనంలో వారిని జిల్లా ఎస్పీ కార్యాలయానికి తరలించారు. కాగా ఇరు కుటుంబాల పెద్దలను పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తామని పోలీస్ అధికారులు పేర్కొన్నారు.
చదవండి: మరో మహిళతో భర్త వివాహేతర సంబంధం.. రెడ్ హ్యండెడ్‌గా పట్టుకొని నిలదీయడంతో..
Comments
Please login to add a commentAdd a comment