ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న ఎస్పీ రంగనాథ్ తదితరులు
సాక్షి, మిర్యాలగూడ: వారు పెద్దలను ఎదిరించారు.. నిండు నూరేళ్లూ కలసి ఉండాలనే ఆశతో పట్టుబట్టి కులాంతర వివాహం చేసుకున్నారు. అమ్మాయి తండ్రి బడా రియల్టర్ కాగా.. అబ్బాయిది సామాన్య కుటుంబం. అప్పటికే.. ఎన్నిసార్లు బెదిరించినా, కేసులు పెట్టినా తమ కూతురు అబ్బాయి వైపే ఉండటాన్ని అమ్మాయి కుటుంబం తట్టుకోలేక పోయింది. కూతురుతో ప్రేమ, ఆప్యాయతలను నటిస్తూనే.. కిరాయి హంతకులను మాట్లాడుకున్నారు. కన్న కూతురు తాళి తెంపేశారు. శుక్రవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నడిబొడ్డున పట్టపగలే దారుణ హత్య జరిగింది. ఈ హత్యకు ‘పరువు’కోసం పాకులాడిన ఓ తండ్రి దుర్మార్గమే కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. వైశ్య కుటుంబానికి చెందిన అమృత, షెడ్యూల్డ్ కులానికి చెందిన ప్రణయ్‌ని వివాహం చేసుకోవడంతో అమృత తండ్రి తిరునగరు మారుతీరావు కక్షపెంచుకుని ఈ హత్య చేయించారని పోలీసులు భావిస్తున్నారు. నిత్యం జన సంచారం ఉండే జ్యోతి ఆసుపత్రి వద్ద పెరుమాళ్ల ప్రణయ్ (24) హత్యతో పట్టణం ఉలిక్కిపడింది.
ఆర్యసమాజ్‌లో ప్రేమ వివాహం..
మిర్యాలగూడ ఎల్‌ఐసీ కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్న పెరుమాళ్ల బాలస్వామి, ప్రేమలతది వినోభానగర్. వారి ఇద్దరు కుమారుల్లో పెద్దవాడైన ప్రణయ్ (24) ఇటీవలే బీటెక్ పూర్తి చేశాడు. కాగా పట్టణానికి చెందిన ప్రముఖ బిల్డర్, రియల్టర్ తిరునగరు మారుతీరావు కూతురు అమృతను ఈ ఏడాది జనవరి 31న ఆర్యసమాజ్‌లో ప్రేమ వివాహం చేసు కున్నాడు. కులాలు వేరు కావడంతో అమృత తండ్రి మారుతీరావు వారి వివాహాన్ని వ్యతిరేకించాడు. వారు ఇద్దరూ వివాహం చేసుకున్న తర్వాత ప్రణయ్ ఇంట్లోనే ఉంటున్నారు. కాగా పట్టణంలోని పలువురు ప్రముఖులతో కలసి తన కూతురిని తిరిగి ఇంటికి తీసుకురావడానికి మారుతీరావు ప్రయత్నాలు చేసినా ఆమె ఒప్పుకోలేదు. ఆ సమయంలోనే ప్రణయ్, అమృత జిల్లా ఎస్పీని కలసి రక్షణ కల్పించాలని కోరారు. నెల రోజుల క్రితం ప్రణయ్, అమృతలకు రిసెప్షన్ ఏర్పాటు చేసినా అమ్మాయి తల్లిదండ్రులు వెళ్లలేదు.
రిసెప్షన్ తర్వాత అమృత తండ్రి మరింత కక్ష పెంచుకున్నాడని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కిరాయి హంతకులతో ప్రణయ్‌ని హత్య చేయడానికి సుపారీ ఇచ్చారని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం అమృత గర్భవతి కావడంతో ప్రణయ్, అమృతలు మధ్యాహ్నం 12 గంటలకు జ్యోతి హాస్పిటల్‌కు పరీక్షల నిమిత్తం వచ్చారు. పరీక్షలు పూర్తయిన తర్వాత 1.30కు ఆస్పత్రి నుంచి బయటకు వస్తుండగా వెనుకనుంచి వచ్చిన హంతకుడు మటన్ షాపులో వినియోగించే కత్తితో ప్రణయ్ మెడపై నరికాడు. వెంటనే మరొక వేటు వేయడంతో ప్రణయ్ అక్కడికక్కడే రక్తపు మడుగులో పడి మృతి చెందాడు. హంతకుడు కత్తిని సమీపంలోనే పడవేసి పరారయ్యాడు. కాగా, వివాహమైన 2 నెలల తర్వాత నుంచి తన హత్యకు కుట్ర జరుగుతోందన్న అనుమానంతో ప్రణయ్ అప్రమత్తంగా ఉంటున్నాడు. ఇటీవల అమృతతో వారి తల్లిదండ్రులు ఫోన్‌లో మాట్లాడటం ప్రారంభించారు. నమ్మించి తమ కొడుకును హత్య చేయించారని ప్రణయ్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
సంఘటనా స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ
హత్య జరిగిన వెంటనే ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ ఎ.వి.రంగనాథ్, డీఎస్పీ పి.శ్రీనివాస్, ఆర్డీఓ జగన్నాథరావు, తహసీల్దార్ కృష్ణారెడ్డి పరిశీలించారు. డాగ్‌స్క్వాడ్‌ను రప్పించి నిందితుడు వెళ్లిన ప్రదేశాలను తెలుసుకున్నారు. హత్య జరిగిన ప్రదేశం నుంచి డాగ్‌స్క్వాడ్ చర్చిరోడ్డు మీదుగా రెడ్డికాలనీ, అక్కడి నుంచి ఇండస్ ఇండ్ బ్యాంకు మీదుగా గాంధీ విగ్ర హం రోడ్డు వరకు, అటు నుంచి సాగర్‌రోడ్డు మీదుగా బైపాస్‌రోడ్డు వరకు వెళ్లిందని పోలీసులు తెలిపారు.
సీసీ ఫుటేజీ స్వాధీనం: ప్రణయ్ హత్య జరిగిన చోట జ్యోతి హాస్పిటల్ సీసీ ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జ్యోతి హాస్పిటల్ నుంచి ప్రణయ్, అమృతతో పాటు మరో యువతి బయటకు వస్తుండగా వెనుక నుంచి కత్తి పట్టుకొని వచ్చిన వ్యక్తి హత్య చేస్తున్న దృశ్యం నమోదైన ఫుటేజీని రంగనా«థ్ పరిశీలించారు.
పరువు హత్యగానే..: ఎస్పీ రంగనాథ్
షెడ్యూల్డ్ కులానికి చెందిన ప్రణయ్ హత్య వెనుక అమృత తండ్రి తిరునగరు మారుతీరావు, ఆమె బాబాయి తిరునగరు శ్రవణ్‌లు ఉన్నట్లు అనుమానిస్తున్నామని, దీనిని పరువు హత్యగానే భావిస్తున్నామని జిల్లా ఎస్పీ ఎ.వి.రంగనా«థ్ చెప్పారు. సంఘటనా స్థలాన్ని సందర్శించిన అనంతరం ఆయన ఏరియా ఆస్పత్రి మార్చురీలో ఉన్న ప్రణయ్ మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రణయ్ హత్య ప్రొఫెషనల్ కిల్లర్స్ చేత చేయించినట్లు అనుమానాలున్నాయని చెప్పారు. మారుతీరావు తన కూతురు ఒక ఎస్సీ యువకుడిని వివాహం చేసుకున్నందుకు కక్ష పెంచుకొని ఈ హత్య చేయించినట్లు తెలుస్తోందన్నారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశామని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు.
దళిత సంఘాలు, బంధువుల ఆందోళన
ధన బలంతోనే మారుతీరావు కిరాయి హంతకులతో ప్రణయ్‌ని హత్యచేయించాడంటూ దళిత సంఘాలు డీఎస్పీ ఆఫీస్ ఎదుట ఆందోళన చేపట్టాయి. ప్రణయ్ స్నేహితులు, కుటుంబీకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎస్పీ రంగనాథ్ వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ప్రణయ్‌కు ప్రాణహాని ఉందని గతంలో తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన మాట వాస్తవమేనని అన్నారు. ఈ నేపథ్యంలో యువతి తండ్రి మారుతీరావును సైతం హెచ్చరించామన్నారు.
మారుతీరావే హత్య చేయించాడు: హతుడి తల్లిదండ్రులు
తమ కుమారుడిని తిరునగరు మారుతీరావే హత్య చేయించాడని ప్రణయ్ తల్లిదండ్రులు పెరుమాళ్ల బాలస్వామి, ప్రేమలత ఆరోపించారు. తమ కొడుకుకు ప్రాణహాని ఉందని పెళ్లైన కొత్త లోనే ఐజీకి ఫిర్యాదు చేశామని.. పోలీసులు కూడా ఇవాళ తమ కొడుకుని కాపాడలేకపోయారని కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ పెళ్లి వద్దంటూ ఎన్నిసార్లు చెప్పినా అమ్మాయి ఇష్టపడి రావడంతో హైదరాబాద్‌లోని ఆర్య సమాజ్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారని, అక్కడే కొంతకాలం కాపురం చేశారని, అక్కడ కూడా అమ్మాయి తండ్రి మారుతీరావు మనుషులు ఆరా తీయడంతో అక్కడ ఇల్లు ఖాళీచేసి మిర్యాలగూడకు మకాం మార్చారన్నారు. తమ కుమారుడు అమృతను ప్రేమ వివాహం చేసుకున్న నాటి నుంచి మారుతీరావు తమ కుటుంబ సభ్యులను వేధిస్తున్నాడన్నారు. ఇంతకు ముందే హత్య చేయాలని పథకం పన్నారని, అనుమానం వచ్చి అప్పటి నుంచి జాగ్రత్తగా ఉంటున్నామని అన్నారు. అయితే కాపు కాసి కిరాయి హంతకులతో హత్య చేయించాడని ఆరోపించారు. మారుతీరావును కఠినంగా శిక్షించి, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
పరారీలో నిందితులు
ప్రణయ్ హత్యకేసులో పరారీలో ఉన్న ఏ–1 నిందితుడు తిరునగరు మారుతీరావు, ఏ–2 నిందితుడు శ్రవణ్‌ల ఆచూకీ తెలిసిన వారు తమకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ రంగనాథ్ కోరారు. హత్య చేసిన గుర్తుతెలియని దుండగుల్ని పట్టుకునేందుకు గాలింపు మొదలుపెట్టామన్నారు. నిందితుల ఆచూకీ తెలిపిన వారికి తగిన పారితోషికం అందచేస్తామని ఆయన తెలిపారు. నిందితులను పట్టుకోవడం కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని, సాధ్యమైనంత త్వరలో వారిని పట్టుకుంటామని చెప్పారు.
హంతకుడు వాడిన కత్తి
Comments
Please login to add a commentAdd a comment