
ప్రణయ్ సోదరుడు అజయ్
సాక్షి, మిర్యాలగూడ : ఇలాంటి సైకిక్ తండ్రిని తన జీవితంలో ఎక్కడా చూడలేదని, అతను జైల్లోనే చచ్చిపోవాలని ప్రణయ్ సోదరుడు అజయ్ కన్నీమున్నీరయ్యాడు. బయటకు వస్తే మారుతీరావును జనాలే చంపుతారని హెచ్చరించాడు. తమ కుటుంబం చంపదని, జనాలే చంపేస్తారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఉక్రెయిన్ నుంచి వచ్చిన అజయ్.. సోదరుడి మృతదేహాన్ని చూసి తల్లడిల్లిపోయాడు. ఇటీవల రాఖీ పౌర్ణమి రోజు సొంతూరికి వచ్చాడని, ఈ సందర్భంగా అమృత రాఖీ కట్టిందని గుర్తు చేసుకుంటూ ప్రణయ్ తండ్రి కన్నీరుమున్నీరయ్యాడు. మరికాసేపట్లో ప్రణయ్ అంత్యక్రియలు ప్రారంభకానున్నాయి. అంత్యక్రియల్లో పాల్గొనడానికి భారీ ఎత్తున్న ప్రజాసంఘాల నేతలు, కులసంఘాలు నేతలు, ప్రణయ్ స్నేహితులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అగ్రకులానికి చెందిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనే కారణంగా ప్రణయ్‌ను పట్టపగలు దారుణంగా కత్తితో నరికి చంపిన విషయం తెలిసిందే.
ప్రణయ్ హత్యకేసులో మరో కోణం..
ప్రణయ్‌హత్య కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. మారుతీరావు ప్రణయ్‌ను హత్య చేసేందుకు నల్గొండకు చెందిన రౌడీషీటర్ మహ్మద్ బారీకి సుఫారీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కోటి రూపాయలకు కాంట్రాక్ట్ మాట్లాడుకుని అడ్వాన్స్ కింద రూ. 50 లక్షలు ఇచ్చినట్లు సమాచారం. అయితే గతంలో మారుతీరావును మహమ్మద్ బారీ కిడ్నాప్ చేసాడని, అప్పటి పరిచయంతోనే ప్రణయ్ హత్యకు సుఫారీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మహమ్మద్ బారీ పాతబస్తీలో ఉంటున్నాడని, తన అనుచరులతోనే పథకం ప్రకారం ప్రణయ్‌ను హత్య చేయించినట్లు సమాచారం. మహమ్మద్ బారీ అనుచరుడు షఫీయే ప్రణయ్‌ను చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది. సుఫారీ కిల్లర్స్‌కు ఓ కాంగ్రెస్ నేత షెల్టర్ ఇచ్చినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment