కొవ్వూరు : ప్రభుత్వానికి.. పాలనా యంత్రాంగానికిది పరీక్ష సమయం. భక్తులకు ఎదురయ్యే అయిదు ప్రధాన సమస్యలేమిటో పుష్కరాలు ప్రారంభమైన నాలుగు రోజుల్లోనే తేటతెల్లం కావటంతో గోదావరీ తీర ప్రాంతాలవాసులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడీ సవాలును ఎదుర్కొనేందుకు అధికారులు సమాయత్తం కావలసిన సమయమిది.
అరకొర వైద్యం
నిత్యం లక్షల సంఖ్యలో భక్తులు పుష్కరాలకు వస్తున్న నేపథ్యంలో అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. హోటళ్లలో శుభ్రత, తాగునీటి సరఫరాపై ఒక కన్నేసి ఉంచాలి. కొన్ని వైద్య శిబిరాల వద్ద అవసరమైన ముఖ్యమైన మందులు లేని లోటు కనిపిస్తోంది. కొవ్వూరులో యాత్రికులకు వైద్యసేవలు అందించేందుకు ప్రస్తుతం మూడు షిప్టులలో బేస్ క్యాంపుతో కలుపుకుని ఆరు క్యాంప్‌లలో 200 మంది సిబ్బంది విధి నిర్వహణలో ఉన్నారు. మూడు 108 అంబులెన్స్‌లు, ఐదు ఐసీయూ సౌకర్యం కలిగిన బోటు అంబులెన్స్‌లు ఉన్నాయి. కానీ ట్రాఫిక్ వల్ల క్షతగాత్రులను ఆసుపత్రులకు తీసుకువెళ్లే అవకాశం లేదు.
ప్రయాణ‘నరకం’
ఎంతో శ్రమకోర్చి దూరప్రాంతాల నుంచి తరలివ వచ్చే యాత్రికులకు తగ్గట్టు బస్సులు లేకపోవటంతో వారి అవస్థలు అన్నీ ఇన్నీ కావు. పుష్కరాలకు ముందు కొవ్వూరు మీదుగా రాజమండ్రికి గంటకు సుమారు 2500 వాహనాలు వెళ్తుంటాయి. ఈ పరిస్థితిని ముందుగానే ఊహించిన జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ భారీ వాహనాలను కొవ్వూరు - రాజమండ్రి మార్గంలో అనుమతించకుండా జాతీయ రహదారిపై కి మళ్లించాలని సంబంధిత అధికారులకు లేఖలు రాశారు. దీనిపై శనివారం వరకు ఎలాంటి అధికారిక ఉత్తర్వులు వెలువడలేదు.
కానరాని ఎక్సయిజ్ ఎక్సర్‌సైజ్
పుష్కరాలు జరిగే 12 రోజులు మద్యం అమ్మకాలను నిలిపివేయాలనే పలువురి సూచనను ప్రభుత్వం పట్టించుకోలేదు. రాజమండ్రి, కొవ్వూరు ప్రాంతాల్లో ఇప్పటికే మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. రాజమండ్రిలో మద్యం విక్రయాలు పెరిగిపోవటంతో మందుబాబులు స్పృహ కోల్పోయి రోడ్లపై దొర్లుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. కొవ్వూరులో మినహా పట్టణానికి నాలుగువైపులా ఉన్న జాతీయ, రాష్ట్ర రహదారులపై మద్యం దుకాణాల్లో యధావిధిగా అమ్మకాలు జరుగుతున్నాయి.
మంచినీటికి కటకటే
పుష్కరాల ప్రారంభం నుంచి శనివారం వరకు 12 లక్షల మంచినీటి ప్యాకెట్లను యాత్రికులకు అందజేశారు. ఇకపై రానున్న యాత్రికుల అవసరాలు తీర్చేందుకు రోజుకు ఆరు లక్షల ప్యాకెట్లు అవసరం కానుండగా నాలుగు లక్షలు ప్యాకెట్లు మాత్రమే సమకూర్చే పరిస్థితి ఉంది.
‘చెత్త’శుద్ధి ఏదీ
సిబ్బంది కొరత వల్ల ఘాట్లలో మినహా రాజమండ్రి నగరంతో సహా పలు పట్టణాలు, పల్లెల్లో చెత్తా చెదారం పేరుకుపోయింది. ఇది మరింత క్షీణించే ముప్పు ఉంది. కొవ్వూరు స్నాన ఘట్టాల నుంచి రోజుకు 90 టన్నుల చెత్త పట్టణంలో 60 టన్నుల చెత్త కలిపి 150 టన్నుల వరకు వస్తోంది. యాత్రికుల తాకిడి పెరిగితే దీంతో పాటు చెత్త కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి.
పుష్కరాల్లో పంచ ‘భూతాలు’!
Published Sun, Jul 19 2015 12:56 PM | Last Updated on Wed, Aug 1 2018 5:04 PM
Advertisement