గోదావరి పుష్కరాలను అట్టహాసంగా.. ఆర్భాటంగా నిర్వహిస్తామంటూ జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రచారం కోసం పాకులాడిన పాలకుల పరువు పోయింది. తొలిరోజే పరాభవం ఎదురైంది. కానీ.. గోదావరి జిల్లాల ప్రజలకు మాత్రమే సొంతమైన.. స్వచ్ఛమైన మర్యాద, మన్ననల్ని అందుకుంటూ లక్షలాదిగా తరలివస్తున్న పుష్కర యాత్రికులు మైమరచిపోతున్నారు. రాష్ట్రంతోపాటు దేశ, విదేశాల నుంచి వస్తున్న లక్షలాది యాత్రికులకు స్వాగతం పలకడంతోపాటు వారికి మర్యాద చేసి పంపుతున్న గోదారి బిడ్డలు ఈ గడ్డ ఖ్యాతిని మరోసారి విశ్వవ్యాప్తం చేస్తున్నారు. పవిత్ర పుష్కరాల నేపథ్యంలో గోదావరి తీరం వెంబడి గల ప్రతి ఇల్లూ అన్నపూర్ణ లోగిలిగా మారిపోయింది. ఇంటికొచ్చిన వారికి మంచినీళ్లు ఇచ్చి పలకరించడం.. అతిథిదేవో భవ అంటూ పట్టెడన్నం పెట్టడం.. ఎక్కడైనా ఉన్న సంప్రదాయమే. కానీ..
గోదారమ్మ తల్లికి మొక్కులు తీర్చుకునేందుకు, పుష్కర స్నానమాచరించేందుకు వస్తున్న యాత్రికులంతా తమ బంధువులే.. అంతా గోదారమ్మ తల్లి బిడ్డలమేనన్న భావనతో తీరం వెంబడి ఉన్న ప్రతి కుటుంబం అతిథి మర్యాదలు చేసి పులకించిపోతోంది. వచ్చిన ప్రతి ఒక్కరినీ మనస్ఫూర్తిగా ఆదరిస్తోంది. ఎన్నో వ్యయప్రయాలకోర్చి గోదావరి తీరం చేరుకుంటున్న భక్తులకు ఎటువంటి లోటుపాట్లు రాకుండా స్వచ్ఛంద సేవలందిస్తూ ఇక్కడి ప్రజలు తరిస్తున్నారు. గోత్రికుల పేరిట కొందరు.. ఇంటిపేరిట కొన్ని కుటుంబాలు.. వర్ణాల పేరిట పలు సంఘాలు... కుల, వర్గ రహితంగా మరికొందరు.. స్వచ్ఛంద సేవా సంస్థలు యాత్రికులకు ఉచిత భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇలా సంస్థలు, సంఘాలే కాదు.. తీరం వెంబడి ఉన్న పట్టణాలు, ఊళ్లు, పల్లెల్లోని ప్రతి ఇల్లూ పుష్కర భక్తులకు ఘనంగా స్వాగతం పలుకుతోంది.
పేదధనిక.. కులమతాల పట్టింపులు లేకుండా ప్రతి ఒక్కరూ తమకు చేతనైనంత సాయం.. సేవ చేస్తున్నారు. కొవ్వూరు, నరసాపురం, యలమంచిలి, ఆచంట, పెనుగొండ, పెరవలి, నిడదవోలు, తాళ్లపూడి, పోలవరం.. ఇలా ప్రతి ప్రాంతంలో యాత్రికుల కోసం భారీగా అన్న సమారాధనలు నిర్వహిస్తున్నారు. ఒక్కపూట భోజనంతో సరిపెట్టడం కాదు.. ఉదయం, సాయంత్రం వేళల్లో అల్పాహారం.. మధ్యాహ్న, రాత్రి వేళల్లో కడుపునిండా భోజనంతోపాటు నిండైన ఆత్మీయతను పంచిపెడుతున్నారు. జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్, ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో కొవ్వూరు, నరసాపురం పట్టణాల్లో ఎప్పుడు ఎంతమంది వచ్చినా విస్తరి వేసి సంప్రదాయంగా వడ్డిస్తున్నారు. కంచికామ కోటిపీఠం ప్రతినిధులు కొవ్వూరులో రాత్రి తెల్లవార్లూ ‘రండి.. స్వామీ ప్రసాదం స్వీకరించండి..’ అని వినమ్రంగా ఆహ్వానిస్తున్నారు. కొవ్వూరులో ప్రతి కుటుంబం దారిన వెళ్లే యాత్రికులకు మంచినీళ్లు అందిస్తోంది.
కొంతమంది మజ్జిగ, మరికొందరు పాలు.. పండ్లు,. ఫ్రూట్ సలాడ్లు.. పులిహోర వంటి వాటిని ఉద్యమ రూపంలో పంపిణీ చేస్తున్నారు. పుష్కర పర్వం మొదలైన అనంతరం ఇప్పటివరకూ జిల్లావ్యాప్తంగా గోదారి తీరప్రాంతాల్లో ఇంతవరకు ఎవరూ ఎక్కడా భోజనానికి ఇబ్బంది పడ్డాం.. అని చెప్పిన దాఖలాలు లేవంటే ఇక్కడి ప్రజల ఔదార్యం, అనురాగం అర్థం చేసుకోవచ్చు. దూరాభార ప్రయాణం.. ట్రాఫిక్ అవస్థలు, ఇతర రవాణా సౌకర్యాల లేమి వంటి సమస్యలన్నీ పుష్కర స్నానం ఆచరించిన తర్వాత.. గోదావరి బిడ్డల అనురాగం చూసిన తర్వాత.. ఎవరైనా మరచిపోవలసిందే. అందుకే అనురాగాల సిరి.. వడ్డించిన విస్తరి గోదావరి. తెలుగువారి తిరుగులేని జీవనాడి ఇదేనంటే ఎవరైనా అంగీకరించాల్సిందే.
- జి.ఉమాకాంత్, సాక్షి ప్రతినిధి, ఏలూరు
ప్రతి ఇల్లూ అన్నపూర్ణ లోగిలే
Published Sun, Jul 19 2015 12:33 AM | Last Updated on Sun, Sep 3 2017 5:45 AM
Advertisement
Advertisement