Rice Miller Association
-
‘టీటీడీకి తక్కువ ధరకే బియ్యం’
సాక్షి, తిరుపతి : ఆల్ ఇండియా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులతో తిరుమల ప్రత్యేక అధికారి ఏవీ ధర్మారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మార్కెట్లో కిలో రూ. 45 గల బియ్యాన్ని రైస్ మిల్లర్లు టీటీడీకి రూ.38 కు అందిస్తున్నారని తెలిపారు. అలాగే ఈ రోజు సమీక్ష అనంతరం కిలో బియ్యం ధరను మరో రూపాయి తగ్గించినట్లు వెల్లడించారు. దీంతో టీటీడీకి 3 నెలలకు 15 లక్షల రూపాయలు ఆదా అవుతుందన్నారు. ఇంత వరకు బియ్యాన్ని కొనుగోలు చేస్తునట్లు తెలిపిన ధర్మారెడ్డి.. బియ్యం కొనుగోలును దశల వారిగా తగ్గించి విరాళాలు పెంచాలని రైస్ మిల్లర్స్ అసోసియేషన్‌ను కోరారు. ఆల్ ఇండియా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ శ్రీవారి అన్నప్రసాదం కు 375 క్వింటాల బియ్యాన్ని విరాళంగా అందించినట్లు తెలిపారు. -
రైస్ మిల్లులకు జీవం పోశా
జమ్మికుంట (హుజూరాబాద్): తమ ప్రభుత్వ హయాంలో రైస్ మిల్లులకు జీవం పోశామని పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. రైతుల, కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో హుజూరాబాద్ నియోజకవర్గ రైస్ మిల్లర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బచ్చు భాస్కర్ ఆధ్వర్యంలో సోమవారం సంఘీభావ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రైస్ మిల్లులు దుర్భర స్థితిలో ఉన్నాయని తెలిపారు. మిల్లింగ్ చార్జీలు పెంచి వ్యాపారులను ఆదుకున్నామని తెలిపారు. కస్టమ్ బియ్యాన్ని సకాలంలో ప్రభుత్వానికి అప్పగించాలనే షరతులతో మిల్లింగ్ చార్జీలు పెంచామని వివరించారు. మిల్లులను కాపాడుకుంటేనే రైతులకు, కార్మికులకు ఉపాధి లభిస్తుందన్నారు. రేషన్ బియ్యం దందాకు స్వస్తి పలకాలని, కస్టమ్ మిల్లింగ్ ధాన్యంతో వ్యాపారం చేయొద్దని చెప్పారు. రైతులు తెచ్చే ధాన్యానికి ధర కల్పించాలని సూచించారు. పౌరసరఫరాల శాఖ తన వద్ద ఉండటం వల్ల వ్యాపారులకు లాభం చేశానని, ఇందుకు రూ.రెండు వేల కోట్లు లబ్ధి పొందినట్లు హుజూరాబాద్‌లో ఓ నేత ఆరోపణలు చేశారని ఆగ్రహంవ్యక్తం చేశారు. ‘నాకు గొలుసులు లేకపోవచ్చు.. నేను బ్రాస్లేట్లు పెట్టుకోకపోవచ్చు.. ఆరు ఫీట్ల ఎత్తులేక పోవచ్చు. ఈటల అనే వ్యక్తి మచ్చలేని మనిషిగా ఉన్నా..’అని పేర్కొన్నారు. రాజకీయాల్లోకి రాకముందే శ్రమను నమ్ముకున్న వ్యక్తిననిపేర్కొన్నారు. ఏ మిల్లర్ వద్ద నయా పైసా తీసుకోలేదని స్పష్టం చేశారు., ఒక్క ఓటరుకు కూడా రూ.50 చేతిలోపెట్టలేదని, ప్రజలు ఆదరించి గెలిపించుకున్నారని ఈటల పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఏనాడూ మచ్చ తేలేదని, గౌరవాన్ని తీసుకొస్తానని చెప్పారు. వ్యాపారులు రైతులను, కార్మికులను మంచిగా చూసుకుంటే చాలని, వ్యాపారవర్గాలకు తాను నిత్యం అండగా ఉంటానని హామీ ఇచ్చారు. రైస్‌మిల్లర్లు ముందుకు వచ్చి తనకు మద్దతు ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. అంతకు ముందు అయిత యుగేందర్, దేసుకేదారి, పలువురు టీఎన్‌ఎస్‌ఫ్ నాయకులు ఈటల సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. -
మిర్యాలగూడను జిల్లా చేయాలి
మిర్యాలగూడ: మిర్యాలగూడ కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో మిర్యాలగూడ జిల్లా సాధన కమిటీ సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మిర్యాలగూడ జిల్లా సాధనకు ఉద్యమ కార్యచరణను రూపొందించనున్నట్లు తెలిపారు. జిల్లా సాధన కమిటీ ఆధ్వర్యంలో సీఎల్పీ నాయకుడు కుందూరు జానారెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కలిసినట్లు చెప్పారు. కాగా ఇప్పటి వరకు చేపట్టిన కార్యక్రమాల వల్ల సీఎం కేసీఆర్ వద్దకు జిల్లా డిమాండ్ అంశం చేరిందన్నారు. జిల్లా సాధించే వరకు ఉద్యమాలు చేపట్టాలని కమిటీ నిర్ణయించినట్లు, శీతాకాల అసెంబ్లీ సమావేశాల వరకు ఉద్యమాన్ని ఉధృతం చేయనున్నట్లు వివరించారు. మిర్యాలగూడ, నాగార్జునసాగర్, హుజూర్నగర్ నియోజకవర్గాల ప్రజలంతా మిర్యాలగూడ జిల్లా కావాలని కోరుకుంటున్నారని, అదే విధంగా హుజూర్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి బంటు వెంకటేశ్వర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ సలీం, టీపీసీసీ సభ్యుడు పగిడి రామలింగయ్య, స్కైలాబ్‌నాయక్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ యూసుఫ్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు వెంకటేశ్వర్లు, చిరుమర్రి కృష్ణయ్య, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు బంటు సైదులు, పట్టణ కార్యదర్శి జగదీశ్చంద్ర, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వెంకటేశ్వర్లు, రాజు, కరీం, సమీఖాద్రి పాల్గొన్నారు. -
ప్రతి ఇల్లూ అన్నపూర్ణ లోగిలే
గోదావరి పుష్కరాలను అట్టహాసంగా.. ఆర్భాటంగా నిర్వహిస్తామంటూ జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రచారం కోసం పాకులాడిన పాలకుల పరువు పోయింది. తొలిరోజే పరాభవం ఎదురైంది. కానీ.. గోదావరి జిల్లాల ప్రజలకు మాత్రమే సొంతమైన.. స్వచ్ఛమైన మర్యాద, మన్ననల్ని అందుకుంటూ లక్షలాదిగా తరలివస్తున్న పుష్కర యాత్రికులు మైమరచిపోతున్నారు. రాష్ట్రంతోపాటు దేశ, విదేశాల నుంచి వస్తున్న లక్షలాది యాత్రికులకు స్వాగతం పలకడంతోపాటు వారికి మర్యాద చేసి పంపుతున్న గోదారి బిడ్డలు ఈ గడ్డ ఖ్యాతిని మరోసారి విశ్వవ్యాప్తం చేస్తున్నారు. పవిత్ర పుష్కరాల నేపథ్యంలో గోదావరి తీరం వెంబడి గల ప్రతి ఇల్లూ అన్నపూర్ణ లోగిలిగా మారిపోయింది. ఇంటికొచ్చిన వారికి మంచినీళ్లు ఇచ్చి పలకరించడం.. అతిథిదేవో భవ అంటూ పట్టెడన్నం పెట్టడం.. ఎక్కడైనా ఉన్న సంప్రదాయమే. కానీ.. గోదారమ్మ తల్లికి మొక్కులు తీర్చుకునేందుకు, పుష్కర స్నానమాచరించేందుకు వస్తున్న యాత్రికులంతా తమ బంధువులే.. అంతా గోదారమ్మ తల్లి బిడ్డలమేనన్న భావనతో తీరం వెంబడి ఉన్న ప్రతి కుటుంబం అతిథి మర్యాదలు చేసి పులకించిపోతోంది. వచ్చిన ప్రతి ఒక్కరినీ మనస్ఫూర్తిగా ఆదరిస్తోంది. ఎన్నో వ్యయప్రయాలకోర్చి గోదావరి తీరం చేరుకుంటున్న భక్తులకు ఎటువంటి లోటుపాట్లు రాకుండా స్వచ్ఛంద సేవలందిస్తూ ఇక్కడి ప్రజలు తరిస్తున్నారు. గోత్రికుల పేరిట కొందరు.. ఇంటిపేరిట కొన్ని కుటుంబాలు.. వర్ణాల పేరిట పలు సంఘాలు... కుల, వర్గ రహితంగా మరికొందరు.. స్వచ్ఛంద సేవా సంస్థలు యాత్రికులకు ఉచిత భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇలా సంస్థలు, సంఘాలే కాదు.. తీరం వెంబడి ఉన్న పట్టణాలు, ఊళ్లు, పల్లెల్లోని ప్రతి ఇల్లూ పుష్కర భక్తులకు ఘనంగా స్వాగతం పలుకుతోంది. పేదధనిక.. కులమతాల పట్టింపులు లేకుండా ప్రతి ఒక్కరూ తమకు చేతనైనంత సాయం.. సేవ చేస్తున్నారు. కొవ్వూరు, నరసాపురం, యలమంచిలి, ఆచంట, పెనుగొండ, పెరవలి, నిడదవోలు, తాళ్లపూడి, పోలవరం.. ఇలా ప్రతి ప్రాంతంలో యాత్రికుల కోసం భారీగా అన్న సమారాధనలు నిర్వహిస్తున్నారు. ఒక్కపూట భోజనంతో సరిపెట్టడం కాదు.. ఉదయం, సాయంత్రం వేళల్లో అల్పాహారం.. మధ్యాహ్న, రాత్రి వేళల్లో కడుపునిండా భోజనంతోపాటు నిండైన ఆత్మీయతను పంచిపెడుతున్నారు. జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్, ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో కొవ్వూరు, నరసాపురం పట్టణాల్లో ఎప్పుడు ఎంతమంది వచ్చినా విస్తరి వేసి సంప్రదాయంగా వడ్డిస్తున్నారు. కంచికామ కోటిపీఠం ప్రతినిధులు కొవ్వూరులో రాత్రి తెల్లవార్లూ ‘రండి.. స్వామీ ప్రసాదం స్వీకరించండి..’ అని వినమ్రంగా ఆహ్వానిస్తున్నారు. కొవ్వూరులో ప్రతి కుటుంబం దారిన వెళ్లే యాత్రికులకు మంచినీళ్లు అందిస్తోంది. కొంతమంది మజ్జిగ, మరికొందరు పాలు.. పండ్లు,. ఫ్రూట్ సలాడ్లు.. పులిహోర వంటి వాటిని ఉద్యమ రూపంలో పంపిణీ చేస్తున్నారు. పుష్కర పర్వం మొదలైన అనంతరం ఇప్పటివరకూ జిల్లావ్యాప్తంగా గోదారి తీరప్రాంతాల్లో ఇంతవరకు ఎవరూ ఎక్కడా భోజనానికి ఇబ్బంది పడ్డాం.. అని చెప్పిన దాఖలాలు లేవంటే ఇక్కడి ప్రజల ఔదార్యం, అనురాగం అర్థం చేసుకోవచ్చు. దూరాభార ప్రయాణం.. ట్రాఫిక్ అవస్థలు, ఇతర రవాణా సౌకర్యాల లేమి వంటి సమస్యలన్నీ పుష్కర స్నానం ఆచరించిన తర్వాత.. గోదావరి బిడ్డల అనురాగం చూసిన తర్వాత.. ఎవరైనా మరచిపోవలసిందే. అందుకే అనురాగాల సిరి.. వడ్డించిన విస్తరి గోదావరి. తెలుగువారి తిరుగులేని జీవనాడి ఇదేనంటే ఎవరైనా అంగీకరించాల్సిందే. - జి.ఉమాకాంత్, సాక్షి ప్రతినిధి, ఏలూరు