సోమవారం జమ్మికుంటలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతున్న మంత్రి ఈటల
జమ్మికుంట (హుజూరాబాద్): తమ ప్రభుత్వ హయాంలో రైస్ మిల్లులకు జీవం పోశామని పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. రైతుల, కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో హుజూరాబాద్ నియోజకవర్గ రైస్ మిల్లర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బచ్చు భాస్కర్ ఆధ్వర్యంలో సోమవారం సంఘీభావ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రైస్ మిల్లులు దుర్భర స్థితిలో ఉన్నాయని తెలిపారు. మిల్లింగ్ చార్జీలు పెంచి వ్యాపారులను ఆదుకున్నామని తెలిపారు. కస్టమ్ బియ్యాన్ని సకాలంలో ప్రభుత్వానికి అప్పగించాలనే షరతులతో మిల్లింగ్ చార్జీలు పెంచామని వివరించారు. మిల్లులను కాపాడుకుంటేనే రైతులకు, కార్మికులకు ఉపాధి లభిస్తుందన్నారు. రేషన్ బియ్యం దందాకు స్వస్తి పలకాలని, కస్టమ్ మిల్లింగ్ ధాన్యంతో వ్యాపారం చేయొద్దని చెప్పారు. రైతులు తెచ్చే ధాన్యానికి ధర కల్పించాలని సూచించారు. పౌరసరఫరాల శాఖ తన వద్ద ఉండటం వల్ల వ్యాపారులకు లాభం చేశానని, ఇందుకు రూ.రెండు వేల కోట్లు లబ్ధి పొందినట్లు హుజూరాబాద్‌లో ఓ నేత ఆరోపణలు చేశారని ఆగ్రహంవ్యక్తం చేశారు.
‘నాకు గొలుసులు లేకపోవచ్చు.. నేను బ్రాస్లేట్లు పెట్టుకోకపోవచ్చు.. ఆరు ఫీట్ల ఎత్తులేక పోవచ్చు. ఈటల అనే వ్యక్తి మచ్చలేని మనిషిగా ఉన్నా..’అని పేర్కొన్నారు. రాజకీయాల్లోకి రాకముందే శ్రమను నమ్ముకున్న వ్యక్తిననిపేర్కొన్నారు. ఏ మిల్లర్ వద్ద నయా పైసా తీసుకోలేదని స్పష్టం చేశారు., ఒక్క ఓటరుకు కూడా రూ.50 చేతిలోపెట్టలేదని, ప్రజలు ఆదరించి గెలిపించుకున్నారని ఈటల పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఏనాడూ మచ్చ తేలేదని, గౌరవాన్ని తీసుకొస్తానని చెప్పారు. వ్యాపారులు రైతులను, కార్మికులను మంచిగా చూసుకుంటే చాలని, వ్యాపారవర్గాలకు తాను నిత్యం అండగా ఉంటానని హామీ ఇచ్చారు. రైస్‌మిల్లర్లు ముందుకు వచ్చి తనకు మద్దతు ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. అంతకు ముందు అయిత యుగేందర్, దేసుకేదారి, పలువురు టీఎన్‌ఎస్‌ఫ్ నాయకులు ఈటల సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.
Comments
Please login to add a commentAdd a comment