జమ్మికుంట (హుజూరాబాద్): హుజూరాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందో ప్రజలు ఆలోచించాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఎవరు గెలిస్తే అభివృద్ధి జరుగుతుందో గమనించి ఓటు వేయాలని, ఈటల రాజేందర్ స్వార్థం కోసమే ఇప్పుడు ఎన్నికలు నిర్వహించాల్సి వస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈటల ప్రధాన అనుచరుడైన కేడీసీసీ బ్యాంక్ జిల్లా ఉపాధ్యక్షుడు పింగిళి రమేశ్, మాజీ ఎంపీపీ చుక్క రంజిత్ బీజేపీకి రాజీనామా చేసి బుధవారం జమ్మికుంటలోని ఎంపీఆర్ గార్డెన్‌లో మంత్రి హరీశ్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వీరితో పాటు ఇల్లందకుంట, జమ్మికుంట మండలాలకు చెందిన దాదాపు 2వేల మంది పార్టీలో చేరగా వారిని మంత్రి హరీశ్‌రావు కండువాకప్పి ఆహ్వానించారు.
అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ, హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు వ్యక్తి లాభం కావాలో, ప్రజాలాభం కావాలో ఆలోచించాలని, ఈటల రాజేందర్‌ను గెలిపిస్తే ప్రస్తుతం రూ.వెయ్యి ఉన్న వంట గ్యాస్ ధర రూ.1,500, పెట్రోల్ రూ.150 అవుతుందని తెలిపారు. మంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధి చేయని రాజేందర్, ఎమ్మెల్యేగా గెలిస్తే ఏం పనులు చేస్తాడో ఆలోచించాలని అన్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌కు ప్రజలు ఓటు వేసి అశీర్వదించాలని కోరారు. సమావేశంలో ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, కోరుకంటి చందర్, జెడ్పీటీసీ శ్రీరాంశ్యామ్, పురపాలక సంఘం చైర్మన్ రాజేశ్వర్‌రావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment