12 గంటలుంటే ఒక రోజున్నట్టే..!
రాజమండ్రి/కొవ్వూరు : లాడ్జీల్లో వసతి 12 గంటలకు కుదించారు. రుసుము మాత్రం 24 గంటలకు వసూలు చేస్తున్నారు. కొంతమంది 12 గంటలకు సైతం రుసుము పెంచేస్తున్నారు. ఆటోల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. వారు చెప్పిందే ధర.. లేకుంటే నడిచి వెళ్లాల్సిందే. మంచినీటి వాటర్ ప్యాకెట్ సైతం అవసరాన్ని బట్టి రూ.2 నుంచి రూ.4 పలుకుతోంది. రోడ్డు పక్కన తోపుడు బళ్లపై ప్లేటు ఇడ్లీ రూ.20 పలుకుతోంది. రాజమండ్రి నుంచి హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రైవేట్ బస్సుల చార్జీలు సైతం రెట్టింపయ్యాయి. రాజమండ్రిలో పుష్కర స్నానం చేసి కోటిపల్లి, అంతర్వేది, కుండలేశ్వరం వంటి ఘాట్లు, అన్నవరం, ద్రాక్షారామం వంటి ఆలయాలకు వెళ్లాలన్నా కార్ల అద్దె రెట్టింపైంది. రాజమండ్రి నుంచి అన్నవరం సాధారణ రోజుల్లో కారు అద్దె దాని స్థాయిని బట్టి డ్రాపిం గ్‌కు రూ.వెయ్యి నుంచి రూ.1,200 వరకు ఉండగా, ఇప్పుడు రూ.2 వేల నుంచి రూ.2,500 వరకు ఉంది.
బంధువుల ఇళ్లకు పయనం
దీంతో హైదరాబాద్, విశాఖ, విజయవాడ, తిరుపతి తదితర నగరాల నుంచి వచ్చేవారు జిల్లాలోని పల్లెల్లో సమీప బంధువుల ఇళ్లకు వెళ్లిపోతున్నారు. బంధుత్వాలు లేని వారు కాకినాడ, మండపేట, అమలాపురం వంటి ప్రాంతాల్లో లాడ్జిలు, హోటళ్లలో ఉంటున్నారు. వీరి రాకతో కాకినాడ, రావులపాలెం, కొత్తపేట, అనపర్తి, జగ్గంపేట వంటి మేజర్ గ్రామాలు, రిసార్టులున్న అల్లవరం మండలం ఓడలరేవు, మలికిపురం మండలం దిండి, మురమళ్ల లాంటి చిన్న గ్రామాల్లో సైతం లాడ్జిలు కిటకిటలాడుతున్నాయి.