ఆరుబయటకు బహిర్భూమికి వెళ్తున్న విద్యార్థులు, ఒకేచోట స్నానాలు చేస్తూ దుస్తులు ఉతుక్కుంటున్న విద్యార్థులు
సాక్షి కురిచేడు(ప్రకాశం) : కనీస వసతులు లేని ఓ ప్రైవేటు అద్దె భవనంలో స్థానిక ఎస్సీ బాలుర హాస్టల్ కునారిల్లుతోంది. హాస్టల్ ఏర్పడినప్పటి నుంచి నేటి వరకు సొంత భవనం లేకపోవడంతో ప్రైవేటు భవనాల్లో అరకొర సౌకర్యాలతో నిర్వహిస్తున్నారు. ఫలితంగా అందులో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ హాస్టల్‌లో ప్రస్తుతం 140 మంది విద్యార్థులు ఉంటున్నారు. వారిలో 3వ తరగతి చదువుతున్న విద్యార్థులు 10 మంది, 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు నలుగురు, 5వ తరగతి చదువుతున్న వారు 17, 6వ తరగతి వారు 36, 7వ తరగతి వారు 22, 8వ తరగతి వారు 12, 9వ తరగతి వారు 20, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు 19 మంది ఉన్నారు.
కాగా, వీరందరికీ కేవలం 7 గదులు మాత్రమే ఉండటంతో ఒక్కో గదిలో 20 మంది వరకూ ఉంటూ ఆ గదుల్లోనే పెట్టెలు పెట్టుకుని అక్కడే చదువుకుని అక్కడే పడుకోవాల్సిన దుస్థితి నెలకొంది. గదులు ఇరుకుగా ఉండటంతో విద్యార్థులు నిత్యం అవస్థపడుతున్నారు. హాస్టల్లో పేరుకు మూడు మరుగుదొడ్లు ఉన్నప్పటికీ ఒక్కటి మాత్రమే పనిచేస్తోంది. మిగిలిన రెండూ మరమ్మతులకు గురై నిరుపయోగంగా మారాయి. దీంతో బహిర్భూమి కోసం గ్రామం వెలుపల గల శ్రీజ్ఞాన ప్రసూనాంబా సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామి ఆలయం అవతలికి వెళ్తున్నారు. రాత్రివేళ మల, మూత్ర విసర్జన చేయాలన్నా.. ఆరుబయటకు వెళ్తూ తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
స్నానాలు, దుస్తులు ఉతుక్కోవడానికీ ఇబ్బందులే...
హాస్టల్లో స్నానాలు చేసేందుకు, దుస్తులు ఉతుక్కునేందుకు, భోజనం చేసేందుకు సరైన వసతులు లేకపోవడంతో విద్యార్థులు నిత్యం ఇక్కట్లకు గురవుతున్నారు. హాస్టల్ భవనం వెనుక గల కొద్దిపాటి ఖాళీ స్థలంలోనే ఈ పనులన్నీ చేసుకుంటున్నారు. ఉదయం, సాయంత్రం విద్యార్థులు చదువుకునేందుకు హాలుగానీ, భోజనశాలగానీ లేకపోవడంతో ఎంతో అసౌకర్యానికి గురవుతున్నారు. సుమారు 40 సంవత్సరాల నుంచి ప్రైవేటు భవనాలలోనే ఎస్సీ హాస్టల్‌ను నిర్వహిస్తున్నప్పటికీ సొంత భవనం నిర్మాణం గురించి ఏ ఒక్కరూ పట్టించుకున్న పాపానపోలేదు.
విద్యార్థులు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ హాస్టల్‌కు సొంత భవనం నిర్మించి సరైన వసతులు కల్పించడంలో అధికారులు, గత పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. స్థానిక ఎన్‌ఎస్పీ కాలనీలో ఎస్సీ హాస్టల్‌కు అన్ని వసతులతో కూడిన విశాలమైన నూతన భవనం నిర్మిస్తే 150 మందికిపైగా విద్యార్థులు చేరినా ఇబ్బంది ఉండదు. ప్రస్తుత ప్రభుత్వం, పాలకులు, అధికారులు స్పందించి ఆ దిశగా చర్యలు తీసుకుని విద్యార్థుల సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉంది.
హాస్టల్లో వసతులు లేక ఇబ్బంది పడుతున్నాం
మా హాస్టల్లో సరైన వసతులు లేవు. రాత్రివేళ మూత్ర విసర్జనకు బయటకు వెళ్లాలంటే భయంగా ఉంటోంది. కానీ, బయటకు వెళ్లక తప్పడం లేదు. అన్నం తినడం, దుస్తులు ఉతుక్కోవడం, స్నానం చేయడం అన్నీ ఒకేచోట కావడం వలన బాగా ఇబ్బంది పడుతున్నాం. మంచి హాస్టల్ నిర్మిస్తే బాగుంటుంది.
- అనూక్, ఐదో తరగతి విద్యార్థి
సొంత భవనం నిర్మిస్తేనే సమస్య తీరేది
హాస్టల్‌కు సొంత భవనం లేకపోవడంతో విద్యార్థులకు గదులు చాలక, సరైన వసతులు లేక ఇబ్బందిగా కుంది. ప్రైవేటు భవనం కావడంతో చాలీచాలని గదులు, సౌకర్యాల కొరతతో సమస్య నెలకొంది. విద్యార్థులు సర్దుకుపోతూ చదువుకుంటున్నారు. సొంత భవనం నిర్మిస్తేనే ఈ సమస్యలన్నీ తీరి మరికొంతమంది విద్యార్థులకు కూడా హాస్టల్లో అవకాశం కల్పించవచ్చు.
ఎం.శివశంకర్, వార్డెన్
Comments
Please login to add a commentAdd a comment