మాచర్ల నియోజకవర్గం కారంపూడి మండలం నరమాలపాడు గ్రామ మాజీ సర్పంచ్, వైఎస్సార్ సీపీ నాయకుడు రామ్మడుగు వెంకటేశ్వర్లు(50)ను టీడీపీకి చెందిన ప్రత్యర్థులు శుక్రవారం వెంబడించి వేట కొడవళ్లతో కిరాతకంగా హతమార్చారు.
సాక్షి, నరసరావుపేట: మాచర్ల నియోజకవర్గం కారంపూడి మండలం నరమాలపాడు గ్రామ మాజీ సర్పంచ్, వైఎస్సార్ సీపీ నాయకుడు రామ్మడుగు వెంకటేశ్వర్లు(50)ను టీడీపీకి చెందిన ప్రత్యర్థులు శుక్రవారం వెంబడించి వేట కొడవళ్లతో కిరాతకంగా హతమార్చారు. బీసీ వర్గానికి చెందిన వెంకటేశ్వర్లు వైఎస్సార్ సీపీలో బలమైన నాయకుడుగా ఎదుగుతూ బడుగు, బలహీనులకు అండగా నిలుస్తున్నాడు. దీన్ని ఓర్చుకోలేని ఆది నుంచి టీడీపీకి అండగా ఉంటున్న ఓ సామాజికవర్గం అతడిని అడ్డు తొలగించుకోవాలని వ్యూహ రచన గావించింది.
శుక్రవారం కారంపూడిలో రచ్చబండ కార్యక్రమానికి ఎస్సీ కాలనీవాసుల నుంచి అర్జీలు స్వీకరించేందుకు వెళుతున్న వెంకటేశ్వర్లను ప్రత్యర్థులు వేటకొడవళ్లతో దాడి చేసి హతమార్చటం పల్నాట తీవ్ర సంచలనం సృష్టించింది. ఆగస్టు 21న దుర్గి మండలం కంచరగుంట గ్రామానికి చెందిన శ్రీపతి చెన్నయ్య(48)ను కూడా ప్రత్యర్థులు హతమార్చారు. ఈ రెండు సంఘటనలతో పల్నాడులో ఫ్యాక్షన్ మళ్లీ పడగవిప్పిందని ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు.
ఫ్యాక్షన్ గ్రామాలపై దృష్టిపెట్టని పోలీసులు
పంచాయతీ ఎన్నికల అనంతరం పల్నాడులోని ఫ్యాక్షన్ గ్రామాలు మళ్లీ కక్షలు, కార్పణ్యాలతో రగిలిపోతు న్నాయి. గ్రామాల్లో గొడవలు జరిగినప్పుడు తూ తూ మంత్రంగా కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్న పోలీసులు ఫ్యాక్షన్ గ్రామాలపై దృష్టి పెట్టడం లేదు. దీంతో ఫ్యాక్షన్ నాయకులు తమ ప్రత్యర్థులను అడ్డు తొలగించుకునేందుకు వ్యూహాలు పొందించుకుంటున్నారు. స్పెషల్ పార్టీ పోలీసుల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం సేకరించి గొడవలకు పాల్పడే వ్యక్తులపై కఠినంగా వ్యవహరిస్తే కొంతమేరకు ఫ్యాక్షన్ హత్యలను నిరోధించే అవకాశం ఉంటుంది.
ఫ్యాక్షన్‌పై ఉక్కుపాదం మోపుతాం.. - రూరల్ జిల్లా ఎస్పీ సత్యనారాయణ
పల్నాడులోని ఫ్యాక్షన్ గ్రామాలపై ప్రత్యేక దృష్టిసారించి ఫ్యాక్షన్ గొడవలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని శుక్రవారం రూరల్ జిల్లా ఎస్పీ జె.సత్యనారాయణ ‘సాక్షి’కి తెలిపారు. గ్రామాల్లో అనవసర గొడవలు సృష్టించేవారిపై రౌడీ షీట్లు ఓపెన్ చేసి అవసరమైతే వారిని గ్రామ, జిల్లా బహిష్కరణ చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే ఫ్యాక్షన్ గ్రామాల్లో శాంతియుత వాతావరణం కల్పించేందుకు పోస్టర్లు విడుదల చేసి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఫ్యాక్షన్ హత్యలకు పథక రచన చేసే వారిపై, హత్యలకు పాల్పడేవారిపై ఆయుధాల చట్టంతో పాటు కఠినమైన చట్టాలు ఉపయోగించి అణచివేస్తామని చెప్పారు.