factionist
-
ఫ్యాక్షనిస్టులకు ఓటుతో బుద్ధి చెప్పండి
సాక్షి,గుంతకల్లు టౌన్:మర్డర్లు నాకు కొత్త కాదు..మా కుటుంబానికి 70 ఏళ్ల ఫ్యాక్షన్ చరిత్ర ఉందంటూ గుంతకల్లు నియోజకవర్గం ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసిన టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే కొట్రికె మధుసూదన్‌గుప్తా బెదిరింపులకు ప్రజలెవ్వ రూ భయపడొద్దని వైఎస్సార్సీపీ గుంతకల్లు నియోజకవర్గం సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డి అన్నారు. బుధవారం రాత్రి భాగ్యనగర్‌లో వెల్డింగ్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడా రు. రెండు రోజుల కిందట టీడీపీ కార్యాల యం వద్ద ప్రజల్ని భయాందోళనకు గురిచేసే విధంగా కొట్రికె చేసిన వ్యా ఖ్యలను ఆ యన తీవ్రంగా ఖండించారు. ప్రశాంతతకు మారుపేరైన గుంతకల్లు నియోజకవర్గంలో ఇక్కడి ప్రజలు కష్టపడి పనిచేసుకునే మనస్తత్వం కలిగిన వారన్నారు. ప్రశాంతంగా ఉన్న గుంతకల్లులో వర్గవిభేధాలు సృష్టించి, ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహించే దిశగా వ్యాఖ్యలు చేయడం మంచిది కాదన్నారు. రెండేళ్ల కిందట ఆచారమ్మకొట్టాలలో టీడీపీ నాయకులు వందలాది మంది పేదల గుడిసెలను కబ్జాచేస్తున్నారన్నారు. ఆ సమయంలో బాధితులకు అండగా నిలిచి వారి ఆస్తులను కాపాడిన తనకు దౌర్జన్యపరుడని నిందించడం బాధకరమన్నారు. మొన్నటికి మొన్న దంచెర్ల గ్రామంలో బోయ సామాజిక వర్గానికి మాజీ సర్పంచ్ అనంతయ్యను జేసీ పవన్‌రెడ్డి బెదిరించడం ఎంతవరకు సమంజసమన్నారు. మీ దౌర్జన్యాలకు, రౌడీయిజానికి బెదిరేవారు లేరన్నారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాక్షనిస్టులు, రౌడీలకు నియోజకవర్గం ప్రజలే బుద్ధి చెప్పాలని ఆయన కోరారు. హిట్లర్‌లా నియంత పాలన కొనసాగిస్తున్న చంద్రబాబుకు బుద్దిచెప్పి వైఎస్.జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలన్నారు. పార్టీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామలింగప్ప, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గాదిలింగేశ్వరబాబు, ఫ్లోర్‌లీడర్ ఫ్లయింగ్ మాబు, పట్టణ అధ్యక్షుడు సుంకప్ప, 30వ వార్డు ఇన్‌చార్జ్‌లు జేసీబీ చాంద్, యాకుబ్, వెల్డింగ్ వర్కర్స్ యూనియన్ నేతలు పాల్గొన్నారు. -
‘చంద్రబాబు శాడిస్టు నయా ఫ్యాక్షనిస్టు’
-
‘చంద్రబాబు శాడిస్టు..నయా ఫ్యాక్షనిస్టు’
మడకశిర: రాష్ట్రంలో రౌడీరాజ్యం నడుస్తోందని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. రౌడీయిజం చేయడంలో టీడీపీ నాయకులు ఆరితేరారని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి నయా ఫ్యాక్షనిస్టుగా మారారని దుయ్యబట్టారు. మంగళవారం అనంతపురం జిల్లా మడకశిరలో రఘువీరా మీడియాతో మాట్లాడారు. అధికారులపై దాడి చేస్తున్న టీడీపీ నాయకులపై చర్యలు తీసుకోకుండా రాజీలు చేయడమేమిటని ప్రశ్నించారు. చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన శని గ్రహమని, ఇంత శాడిస్ట్ ముఖ్యమంత్రిని తానెప్పుడూ చూడలేదన్నారు. సాగునీటి పథకాల పేరుతో అధికార పార్టీ నాయకులు రూ.వేలాది కోట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. అధికారం పోయిన తర్వాత వారంతా జైలులో ఉండక తప్పదని హెచ్చరించారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వాలు ప్రజాసంక్షేమాన్ని విస్మరించాయని మండిపడ్డారు. రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నందున.. మూగజీవాలను కాపాడుకునేందుకు వెంటనే గడ్డి కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే తహసీల్దార్ కార్యాలయాల ఎదుట మూగజీవాలతో నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అలాగే వడదెబ్బ మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాగా, మావోయిస్టుల దాడిలో 25 మంది జవాన్లు చనిపోవడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. -
మైనింగ్ కోసం.. వార్నింగ్
మైన్ ఓనర్‌ను బెదిరిస్తున్న ఓ మాజీ మంత్రి ఫ్యాక్షనిస్టు ద్వారా తీవ్ర వేధింపులు.. రహదారికి అడ్డంగా గోతులు కమీషన్ ముట్టజెబుతామన్నా ససేమిరా అంటున్న వైనం సాక్షి ప్రతినిధి, కడప : నాలుగు రూకలు పోగవుతాయనుకుంటే చాలు అధికారపార్టీ నేతలు దౌర్జన్యాలకు ఒడిగడుతున్నారు. మైనింగ్‌కు ప్రభుత్వ అనుమతులున్నా అధికారపార్టీ నేతల అనుమతి తప్పకుండా తీసుకోవాల్సిన దుస్థితి నెలకొంటోంది. కబ్జాలు...సెటిల్మెంట్లతో సొమ్ము చేసుకుంటున్న టీడీపీ నేతలు సరికొత్తగా మైనింగ్‌పై దృష్టి సారించారు. సౌమ్యుడు, మితభాషి అని చెప్పుకుంటున్న ఓ మాజీ మంత్రి ఏకంగా 112 ఎకరాల మైన్‌ను అప్పగించమని డిమాండ్ చేస్తున్నారు. అంతవరకూ మైనింగ్ చేయరాదంటూ హుకుం జారీ చేయడమే గాక ఫ్యాక్షనిస్టు అయిన ఓ నేతను ఉసిగొల్పినట్లు సమాచారం. ముద్దనూరు మండలం చింతకుంట గ్రామ పరిధిలో క్వార్జైట్ (సిలికాశాండ్) ఖనిజం ఉంది. సర్వేనంబర్ 425లో 60 ఎకరాలు షేక్ జమాల్‌వలీ అనే వ్యక్తికి క్వార్జైట్ మైనింగ్ కోసం అప్పటి ప్రభుత్వం జీఓ నెంబర్ 330 ద్వారా 2008లో అనుమతి ఇచ్చింది. అప్పట్లో మైనింగ్ చేసిన జమాల్‌వలీ సుమారు 2వేల టన్నులు మైనింగ్ చేశారు. ఆ మేరకు ప్రభుత్వ ఆదేశాల మేరకు చెల్లింపులు సక్రమంగా నిర్వహించారు. తర్వాత అనారోగ్య కారణాల రీత్యా మైనింగ్ నిర్వహణకు దూరంగా ఉన్నారు. ఈలోగా ఆ ప్రాంతానికి చెందిన కొందరు మైనింగ్ చేపట్టడం ద్వారా ఆదిమానవుడి రేఖాచిత్రాలకు భంగం కల్గనున్నట్లు హైకోర్టులో పిల్ వేశారు. వాస్తవ పరిస్థితులను తెలుసుకున్న ఆర్కియాలజీ ఎన్ఓసీ ఇవ్వడంతో రేఖాచిత్రాలకు వంద అడుగులు వదలి మైనింగ్ చేసుకోవాలని కోర్టు ఉత్తర్వులు సైతం ఇచ్చింది. ఆ తర్వాత మైనింగ్ చేసుకునేందుకు సిద్ధం కాగా స్థానికంగా ఆటంకాలు ఎదురైనట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా బూమ్ రావడంతో.... ఇసుక నియంత్రణ అధికం కావడంతో గ్లాస్ ఫ్యాక్టరీ, సిరామిక్ పరిశ్రమలు, వైట్ సిమెంట్ తదితర పరిశ్రమలు సిలికాశాండ్పై దృష్టి సారించాయి. దాంతో ఒక్కమారుగా క్వార్జైట్ ఖనిజంకు బూమ్ వచ్చింది. ఒక్కమారుగా కళ్లెదుట ఉన్న మైనింగ్‌పై అధికారపార్టీ నేతల దృష్టి పడింది. ఎలాగైనా మైన్ దక్కించుకోవాలనే దుగ్ధతో మైన్ ఓనర్‌ను ముప్పుతిప్పలు పెట్టడం ప్రారంభించారు. ఇదేమి అన్యాయమని మాట్లాడితే, తన ఫ్యాక్షన్ చరిత్రను వివరిస్తూ బెదిరింపులకు దిగుతున్నట్లు సమాచారం. అసలు కథ తెలియడంతో మైన్ ఓనర్ జమాల్‌వలీ రాయబేరాలు నడిపినట్లు తెలుస్తోంది. చింతకుంట గ్రామ అభివృద్ధికి తనవంతు పాత్ర పోషిస్తానని మీరెమీ చెప్పినా చేసేందుకు ముందుకు వస్తానని వివరించినట్లు సమాచారం. ఇవేవీ అధికార పార్టీకి చెందని ఫాక్షన్నేతకు రుచించనట్లు తెలుస్తోంది. కొండకు వెళ్లేందుకు రహదారి వేయాలని గ్రామస్తులు కోరడంతో ఆ పనులు మైనింగ్ ఓనర్ ప్రారంభించారు. అయితే రాత్రికి రాత్రి జేసీబీతో టీడీపీ నేతలు రోడ్డుపై గోతులు తీశారు. గ్రామస్తుల్లో వ్యతిరేకత వ్యక్తమైనా టీడీపీ నేతలు వెనక్కితగ్గడం లేదు. ఈ తరుణంలో తనకు ఏమైనా ముప్పు కలిగితే అందుకు కారకుడు ఫ్యాక్షన్ నేతేనని మైన్ ఓనర్ కేసు వేసినట్లు సమాచారం. దాంతో అధికారపార్టీకి చెందిన ఓ మాజీ మంత్రి రంగప్రవేశం చేసినట్లు తెలుస్తోంది. కేసు ఉపసంహరించుకో, సర్దుబాటు చేస్తానని చెప్పినట్లు సమాచారం. 112 ఎకరాలున్న మైన్ అప్పగించండి.... వారంతా ఫ్యాక్షన్‌లో తలమునకలైన వారు, మీకు ముద్దనూరు మండలంలో ఉప్పలూరు, వేల్పుచర్ల, చింతకుంట తదితర గ్రామాల్లో మైనింగ్ లీజులు ఉన్నాయి. సమస్య ఎందుకు, ఒక్కరోజుతో పోయేది కాదు, నేను చెప్పినట్లు వినండి, ఇరువురు సర్దుకుపోండని అధికారపార్టీకి చెందిన మాజీ మంత్రి పల్లవి అందుకున్నట్లు తెలుస్తోంది. చింతకుంట గ్రామంలోనే జమాల్‌వలీ పేరుపై ఉన్న మైన్ మీరే చేసుకోండి, అదే గ్రామంలో సర్వే నంబర్ 425లో 112 ఎకరాలు షేక్ అల్లా మహమ్మద్ బక్ష్ పేరుతో లీజు ఉన్న మైన్కూడా అప్పగించ మని తీర్పు చెప్పినట్లు తెలుస్తోంది. మండల వ్యాప్తంగా మీకు ఎలాంటి ఆటంకం లేకుండా చూస్తాం ఇరువురికి ఇబ్బందులు ఉండవని సెలవిచ్చినట్లు సమాచారం. తాము మైన్ కోసం తీవ్రంగా కష్టపడ్డాం, మైన్ ఇవ్వలేం, టన్నుకింత కమీషన్ ఇవ్వగలం, మైనింగ్ చేసే కొద్ది మీకు ఆదాయం లభిస్తుందని వివరించినట్లు విశ్వసనీయ సమాచారం. అయినప్పటికీ అధికార పార్టీ నేతలు తాము కోరిన 112 ఎకరాలు అప్పగిస్తే సరీ, లేదంటే పనులు ఎలా చేస్తారో...చూస్తాం అంటూ బెదిరింపులకు దిగినట్లు తెలుస్తోంది. ఫ్యాక్షన్ చరిత్ర కల్గిన నాయకులు కావడం, మాజీ మంత్రి అండదండలు ఉండడంతో దిక్కుతోచని స్థితిలో మైన్ ఓనర్ ఉన్నట్లు తెలుస్తోంది. మైనార్టీ ప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రిని కలిసి అధికార పార్టీ నాయకుల ఆగడాలను వివరించేందుకు మైన్ ఓనర్ సన్నద్ధమైనట్లు సమాచారం. -
స్పీకర్ ఓ ఫ్యాక్షనిస్టు
కర్నూలు (ఓల్డ్‌సిటీ): అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు ఓ ఫ్యాక్షనిస్టు అని వైఎస్ఆర్సీపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం స్థానిక భాగ్యనగర్‌లోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోడెల 1994లో నర్సరావుపేటలోని ఓ నర్సింగ్ హోమ్‌లో ఐదుగురి మృతి చెందినా కేసులు పెట్టలేదన్నారు. ఇలాంటి వ్యక్తిని చంద్రబాబు నాయుడు స్పీకర్‌గా నియమించారని, ఆయన స్పీకర్లా కాకుండా టీడీపీ కార్యకర్తగా వ్యవహరిస్తూ ప్రతిపక్ష పార్టీ నేత వైఎస్ జగన్‌కు మాట్లాడే సమయం కూడా ఇవ్వలేదని విమర్శించారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగభృతి అంటూ ఎన్నెన్నో హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టారన్నారు. సభలో ఈ విషయాలపై అడిగేందుకు సమయం ఇవ్వకపోవడం, మైక్‌లు కట్ చేయడం, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డిపై ఆభండాలు వేయడం పద్ధతి కాదన్నారు. చీఫ్‌విప్ కాలువ శ్రీనివాసులు తన బాధ్యతలను విస్మరించి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ ఎమ్మెల్యేలు వ్యక్తిగత దూషణలు చేయడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు వివరాలను కూడా చంద్రబాబు ఇవ్వడం లేదని, నివేదిక పంపకపోగా పట్టిసీమ నుంచి రాయలసీమకు నీళ్లు ఇస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకుడు తోట వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ గురువారం శాసనసభలో జరిగిన పరిణామాలను ఖండిస్తున్నామన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని జగన్మోహన్రెడ్డి అడిగితే చంద్రబాబు నాయుడు మంత్రులతో మాట్లాడించాడని, వ్యక్తిగత దూషణలు చేయించారని ఆరోపించారు. విభజన తర్వాత చోటు చేసుకున్న మొట్టమొదటి సంఘటనగా ఇది చరిత్రలో నిలిచిపోతుందన్నారు. విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులు రాఘవేంద్రనాయుడు, సలీం, షరీఫ్, పి.జి.నరసింహులు యాదవ్, పులిజాకబ్, సత్యరాజు, నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు. -
వాల్మీకులు దగాపడిన తమ్ముళ్లు
కర్నూలు(అర్బన్): ‘‘వాల్మీకులు ఫ్యాక్షనిస్టులు కాదు. వారంతా దగాపడిన తమ్ముళ్లు. పేదరికం, నిరక్షరాస్యత కారణంగా వేలాది కుటుంబాలు దుర్భర జీవనం గడుపుతున్నాయి.’’ అని జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ అన్నారు. ఆదివారం సాయంత్రం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి(వీఆర్పీఎస్) మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు గుడిసె క్రిష్ణమ్మ అధ్యక్షతన వాల్మీకుల శాంతి సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ మాట్లాడుతూ రామాయణ మహా కావ్యాన్ని ప్రపంచానికి అందించిన మహర్షి వాల్మీకి వారసులైన బోయలు ముఠా నాయకులకు దూరంగా ఉండాలన్నారు. పిల్లలను ఉన్నత చదువులు చదివించినప్పుడే ఫ్యాక్షనిస్టు ముద్రను చెరిపేసుకోవడం సాధ్యమవుతుందన్నారు. జిల్లాలో వాల్మీకుల జనాభా 12 లక్షలకు పైగా ఉన్నా.. ముఖ్యమైన అధికార హోదాల్లో అతి తక్కువ మంది ఉండటం బాధాకరమన్నారు. బడి బయటి వాల్మీకుల పిల్లలను పాఠశాలల్లో చేర్పించేందుకు పోలీసు శాఖ తరఫున తమ వంతు కృషి చేస్తామన్నారు. గ్రామాల్లో కక్షలు, కార్పణ్యాలకు కారణమవుతున్న మద్యానికి ప్రతి ఒక్కరూ దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలన్నారు. పలు ఫ్యాక్షన్ గ్రామాల్లో దాదాపు 30 ఏళ్లుగా అనేక మంది వాల్మీకులపై రౌడీషీట్లు ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందని.. సత్ప్రవర్తన కలిగిన వారిపై వీటిని ఎత్తేసేందుకు డీఎస్పీలచే విచారణ చేయిస్తామన్నారు. ఫ్యాక్షన్ కారణంగా మృతి చెందిన, జీవిత ఖైదు అనుభవిస్తున్న వారి తల్లుల కన్నీళ్లు చూసైనా మార్పు దిశగా అడుగులు వేయాలన్నారు. కేసుల విషయంలో నిష్పక్షపాతంగా విచారణ చేపట్టేలా పోలీసులకు తగిన ఆదేశాలిస్తామన్నారు. ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాల్లోని యువతలో మార్పు తీసుకొచ్చేందుకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. వీఆర్పీఎస్ ఉద్యోగ, మేధావుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మధుసూదన్ మాట్లాడుతూ దశాబ్ధాల చరిత్రను పరిశీలిస్తే ప్రతి ఘటనలో హంతకులు, హతులు వాల్మీకులే ఉంటున్నారన్నారు. ఈ సంస్కృతిలో మార్పు అవసరమన్నారు. వాల్మీకులు అన్ని రంగాల్లో రాణించాలంటే ఎస్టీ రిజర్వేషన్ సాధించుకోవడం ఒక్కటే మార్గమన్నారు. వీఆర్పీఎస్ కర్నూలు పార్లమెంట్ కన్వీనర్ వెంకన్న మాట్లాడుతు ఫ్యాక్షన్ ఊబి నుంచి వాల్మీకులు బయటకు రావాలన్నారు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, విద్యపరంగా వాల్మీకులు వెనకబాటుకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సదస్సులో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ సి.తిక్కన్న, కర్నూలు డీఎస్పీ రమణమూర్తి, వీఆర్పీఎస్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు వలసల రామక్రిష్ణ, ప్రధాన కార్యదర్శి గూడూరు గిడ్డయ్య, కార్యదర్శులు జి.రాంభీంనాయుడు, సూర్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు ఎల్.వెంకటేశ్వర్లు, నగర అధ్యక్షురాలు బీటీ అనురాధ, నాయకులు బేవినహాల్ హనుమంతప్ప, బోయ గోపితో పాటు జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో వాల్మీకులు పాల్గొన్నారు. అండగా నిలుస్తాం జిల్లాలో వాల్మీకులకు ఎక్కడ అన్యాయం జరిగినా వీఆర్పీఎస్ అండగా నిలుస్తుంది. హత్యా రాజకీయాలకు వాల్మీకులు దూరంగా ఉండాలి. అనేక గ్రామాల్లో ముఠా, రాజకీయ నాయకులు వాల్మీకులను అణగదొక్కేందుకు సోదరులైన ఎస్సీలతో అట్రాసిటీ కేసులు బనాయిస్తున్నారు. ఈ కేసుల్లో పోలీసు అధికారులు నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలి. కుటంబంలో ఒకరు తప్పు చేస్తే ఆ వ్యక్తిపైన మాత్రమే కేసులు నమోదు చేయాలి. అలా కాదని మొత్తం కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేయడం తగదు. - ఎం.సుభాష్ చంద్రబోస్, వీఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు -
'చంద్రబాబు ఫ్యాక్షనిస్టులా వ్యవహరిస్తున్నారు'
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫ్యాక్షనిస్టులా వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు శంకర్ నారాయణ ఆరోపించారు. ఆయన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దౌర్జన్యాలను ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. సూరయ్య కుటుంబంపై అక్రమ కేసులను ఎత్తేయాలని, లేనిపక్షంలో తాము ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుతామని అన్నారు. పయ్యావుల కేశవ్ అధికార దుర్వినియోగం చేస్తున్నా చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోకుండా వదిలేస్తున్నారని అన్నారు. మరో నాయకుడు ఎర్రిస్వామిరెడ్డి కూడా చంద్రబాబుపైన, టీడీపీపైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ నేతలు గూండాల్లా వ్యవహరిస్తున్నారని, చంద్రబాబు పాలన రాక్షస పాలనను తలపిస్తోందని ఆయన అన్నారు. -
నాడు ఫ్యాక్షనిస్టు: నేడు దొంగలకు దొర
నేరస్తులకు బెయిల్, ష్యూరిటీ వంటివి ఇప్పించడం జైలులోని వారికి గంజాయి, సెల్ఫోన్ల సరఫరా ప్రతిఫలంగా చోరీలలో వాటా సుంకరి ప్రసాద్ నేరాంగికార పత్రంలో బయటపడ్డ నిజం సాక్షి, సిటీబ్యూరో: అతను గతంలో ఫ్యాక్షన్ కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొన్నాడు..పలుసార్లు జైలుకెళ్లి వచ్చాడు.. కొంత కాలం తర్వాత తన పంథా మార్చుకున్నాడు. నేరం చేసి జైలుకెళ్లిన వారికి అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించమే థ్యేయంగా పెట్టుకున్నారు. వారు చేసిన ప్రతి చోరీలో వాటా తీసుకుంటాడు. ఇలా సుమారు వంద మందికి పైగా నేరగాళ్లకు ఇతను దొర (బాస్)లా వెలుగుతున్నాడు. వారం క్రితం సైబరాబాద్ క్రైమ్ పోలీసులకు పట్టుబడటంతో కుషాయిగూడ పోలీసులు ఇతడ్ని రిమాండ్‌కు తరలించారు. అయితే అతని నేర అంగీకార పత్రంలో మరిన్ని ఆసక్తిగల వివరాలు బయటపడ్డాయి. 18 ఏళ్లకే నేరబాట... ప్రకాశం జిల్లాకు చెందిన సుంకరి ప్రసాద్ (40) ఘట్కేసర్లో ఉంటున్నాడు. 7వ తరగతి వరకు చదువుకున్న ఇతగాడు 18 ఏళ్ల వయసు(1991)లో బాంబు పేలుడు ఘటనలో జైలుకెళ్లాడు. ఆ తర్వాత ఫ్యాక్షనిస్టుగా మారి హత్య, హత్యాయత్నాలతో పాటు ప్రకాశం, కర్నూల్, కడప, నల్లగొండ, మెదక్, విజయవాడ, హైదరాబాద్, సైబారాబాద్లలో 100కుపైగా బెదిరింపులు, దోపిడీలు, ఇళ్లలో చోరీలు చేశాడు. ఆయా కేసులలో జైలు కెళ్లినప్పుడు పాత నేరస్తులతో పరిచయం పెంచుకున్నాడు. ఇలా వందకుపైగా నేరగాళ్లతో పరిచయాలు పెంచుకున్నాడు. వారందరికీ ఇతనే బాస్‌గా మారిపోయాడు. అప్పటి నుంచి ఇతను ప్రత్యక్షంగా నేరాలు చేయడం మానేశాడు. తన వ ద్ద లిస్టులో ఉన్న వంద మంది నేరస్తులకు కావాల్సినప్పుడల్లా సహాయం చేస్తూ పోలీసుల దర్యాప్తులో తెరపైకి రాకుండా మొలుగుతున్నాడు. సుంకరి ప్రసాద్ కార్యకలాపాలపై సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్‌కు సమాచారం అందడంలో క్రైమ్ పోలీసులు అప్రమత్తమై వారం క్రితం అరెస్టు చేసి జైలుకు పంపారు. నేరస్తులకు ఇలా సహకారం... దొంగతనాలు, దోపిడీలు, తదితర నేరాలు చేసి జైలు పాలైన నేరస్తుడికి మద్దతుగా ఉంటూ బెయిల్ ఇప్పించడం, అందుకు ష్యూరిటీలను సమకూర్చడం, న్యాయవాదికి కావాల్సిన డబ్బులు అందించడం జైల్లో ఉన్న నేరస్తులకు సిమ్‌కార్డులు, సెల్ఫోన్లు, గంజాయి, మిలాఖత్లు ఇప్పించడం నేరస్తుల కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందించడం జైలు నుంచి విడుదలైన వారు ఎక్కడ చోరీ చేయాలో కూడా సూచించడం వచ్చిన వాటాలోంచే కొంత వీరి సహాయం కోసం ఖర్చు చేస్తాడు. -
ఫ్యాక్షనిస్టును స్పీకర్ చేస్తే ఇలాగే ఉంటుంది
కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి కడప కార్పొరేషన్: ఫ్యాక్షనిస్టు, ఇంట్లో బాంబులు ఉంచుకొన్న పెద్ద మనిషిని స్పీకర్‌ను చేస్తే అసెంబ్లీ సమావేశాలు ఏకపక్షంగా సాగక, సవ్యంగా ఎలా సాగుతాయని కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి ప్రశ్నించారు. కడపలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బడ్జెట్‌పై మాట్లాడేందుకు అవకాశమివ్వమంటే మైకులు కట్ చేస్తున్నారని ఆరోపించారు. తద్వారా ప్రతిపక్షం గొంతునొక్కడానికి ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ మాయాబజార్‌ను తలపిస్తోందని, గాలిమేడలు కట్టి ప్రజలను మరోసారి మభ్యపెట్టారని దుయ్యబట్టారు. రైతుల రుణమాఫీకి రూ.85 వేల కోట్లు అవసరం కాగా, కేవలం రూ.5 వేల కోట్లు కేటాయించి అన్యాయం చేశారన్నారు. రుణమాఫీకి మరో 20 ఏళ్లు పట్టే అవకాశముందన్నారు. ప్రతిపక్షం నిర్మాణాత్మకమైన సూచనలు చేసినా అధికారం పక్షం స్వీకరించేందుకు సిద్ధంగా లేదన్నారు. వచ్చే ఆదాయాన్ని కూడా ఎక్కువ చేసి చూపారన్నారు. బడ్జెట్లో సాగునీటి ప్రాజెక్టులకు కేవలం 8400 కోట్లు కేటాయించి రాయలసీమను రతనాల సీమగా మారుస్తామని మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు ప్రగల్భాలు పలుకుతున్నారని రవీంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో రైతులు దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా రుణాలు ఇవ్వడం లేదని, తీసుకొన్న రుణాలకు వడ్డీ పెరిగిపోతోందన్నారు. పార్టీ అనుబంధం రైతు విభాగం జిల్లా కన్వీనర్ సంబటూరు ప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు. ‘కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడండి’ వైద్య, ఆరోగ్య శాఖలో పని చేస్తున్న కాంట్రాక్టు ల్యాబ్టెక్నీషియన్లు, మేల్ హెల్త్ అసిస్టెంట్ల సమస్యలపై మీరు అసెంబ్లీలో మాట్లాడండి’ అంటూ కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డిని ఏపీ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మేసా ప్రసాద్ కోరారు. ఈ మేరకు ఆయనతో పాటు ఉద్యోగులు ఎమ్మెల్యేను ఆదివారం కలసి వినతిపత్రం అందజేశారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు జాన్సన్, నాయకుడు హరిప్రసాద్ పాల్గొన్నారు. ‘రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి’ వీరపునాయునిపల్లె: కరువు కోరల్లో చిక్కుకున్న రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథరెడ్డి డిమాండ్ చేశారు. వీరపునాయునిపల్లె మండలం తలపనూరులో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. వర్షాభావంతో పొలాలన్నీ బీడుగా మారాయన్నారు. భూగర్భ జలాలు అడుగంటడంతో పండ్ల తోటలను కాపాడుకునేందుకు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. పశుగ్రావసం సమస్య తీవ్రమయ్యే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ మండల కన్వీనర్ రఘునాథరెడ్డి పాల్గొన్నారు. -
అధికార తొత్తులు !
► తెలుగుదేశం నేతల కనుసన్నల్లో ఖాకీలు ► పచ్చని పల్లెల్లో ప్రశాంతతకు చిచ్చుపెడుతున్న వైనాలు ► టీడీపీ నాయకులు దాడులకు దిగుతున్నా పట్టించుకోని పోలీసులు ► గుంటూరు నగరంలోనూ అదుపుతప్పిన శాంతిభద్రతలు పది రోజుల్లో నాలుగు హత్యలు.. సాక్షి, గుంటూరు: జిల్లాలో పోలీస్ శాఖ నిద్రావస్థలో ఉందా.. అవుననే అంటున్నారు అధికశాతం మంది ప్రజలు. ఎన్నికల్లో సమర్థంగా పనిచేసిన జిల్లా పోలీసులు కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి టీడీపీ నేతల కనుసన్నల్లో పనిచేయడం ప్రారంభించారు. వారికి అనుకూలంగా పని చేసి మంచి పోస్టు కొట్టేయాలన్న తలంపుతో గ్రామాల్లో గొడవలు జరుగుతున్నా నిరోధించకుండా అగ్గి రాజేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శాంతిభద్రతలపై దృష్టి సారించకుండా పోస్టింగ్‌ల కోసం టీడీపీ నేతల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ►గ్రామాల్లో టీడీపీ నాయకులు దాడులు చేస్తున్నప్పటికీ పోలీసులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. తూతూ మంత్రంగా కేసులు నమోదు చేయడంతో పోలీసులంటే భయం లేకుండా వ్యవహరిస్తున్నారు. ►పదేళ్లుగా ఫ్యాక్షన్ గొడవలకు దూరంగా ప్రశాంతంగా బతుకుతున్న గ్రామాల్లో సైతం ఆధిపత్యం కోసం టీడీపీ నేతలు గొడవలకు దిగుతున్నారు. ►వీటిపై పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో తమను తాము రక్షించుకునే క్రమంలో ఎదుటి వర్గం కూడా గొడవలకు దిగక తప్పడం లేదు. ►ఎప్పుడు ఏం జరుగుతుందోనని గ్రామస్తులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ►పరిస్థితిని చక్కదిద్దాల్సిన పోలీసులే ఓ వర్గానికి కొమ్ముకాస్తూ పచ్చని పల్లెల్లో చిచ్చు పెడుతున్నారని ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాల ప్రజలు మండిపడుతున్నారు. ►ఇప్పటికైనా పోలీసులు నిద్రమేల్కొని కఠినంగా వ్యవహరించకపోతే జిల్లాలో శాంతి భద్రతలు అదుపుతప్పే ప్రమాదం ఉందని పలువురు హెచ్చరిస్తున్నారు. హత్యలు, దాడులతో అట్టుడుకుతున్న జిల్లా.. ►పోలీసుల నిర్లక్ష్యం వల్ల శాంతి భద్రతలు అదుపుతప్పి వరస హత్యలు, దాడులతో జిల్లా అట్టుడికిపోతోంది. ►పదిరోజుల వ్యవధిలో గుంటూరులో వరసగా నాలుగు హత్యలు జరిగాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ►గుంటూరు నగరంలో ఆరు పోలీస్స్టేషన్లు ఉండగా అందులో మూడు స్టేషన్లకు ఎస్హెచ్ఓలు లేరు. జిల్లాలో అనేక ప్రాంతాల్లో తమకు నచ్చని అధికారులను వెళ్లిపొమ్మని అధికార పార్టీ నేతలు హుకుం జారీ చేయడంతో కొందరు సిక్ లీవ్‌పై వెళ్లారు. ►రూరల్‌జిల్లాలో టీడీపీ నేతల వరస దాడులతో గ్రామాల్లో నిత్యం ఘర్షణ వాతావరణం నెలకొంటుంది. ►ఇటీవల ముప్పాళ్ల ఎంపీపీ ఎన్నిక సందర్భంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, నాయకులపై దాడిచేసి ఎంపీటీసీలను కిడ్నాప్ చేసినప్పటికీ ఇంత వరకూ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంపై వైఎస్సార్సీపీ నాయకులు మండిపడుతున్నారు. ►గొడవలను నిరోధించాల్సిన పోలీసులే వారికి సహకరిస్తూ అగ్నికి ఆజ్యం పోస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిద్దరోతున్న నిఘా వ్యవస్థ.. గ్రామాలు, నగరంలో శాంతి భద్రతలపై నిఘా ఉంచాల్సిన పోలీసులు నిద్రావస్థలో ఉండటంతో వరస సంఘటనలు జరుగుతున్నాయి. ఫ్యాక్షనిస్టులు, రౌడీషీటర్లపై నిత్యం నిఘా ఉంచి వారికి కౌన్సెలింగ్ నిర్వహించాల్సిన పోలీసులు అసలు వారి సంగతే మర్చి పోవడంతో కిరాయి హత్యలు జరుగుతున్నాయి. -
పడగవిప్పిన ఫ్యాక్షన్
సాక్షి, నరసరావుపేట: మాచర్ల నియోజకవర్గం కారంపూడి మండలం నరమాలపాడు గ్రామ మాజీ సర్పంచ్, వైఎస్సార్ సీపీ నాయకుడు రామ్మడుగు వెంకటేశ్వర్లు(50)ను టీడీపీకి చెందిన ప్రత్యర్థులు శుక్రవారం వెంబడించి వేట కొడవళ్లతో కిరాతకంగా హతమార్చారు. బీసీ వర్గానికి చెందిన వెంకటేశ్వర్లు వైఎస్సార్ సీపీలో బలమైన నాయకుడుగా ఎదుగుతూ బడుగు, బలహీనులకు అండగా నిలుస్తున్నాడు. దీన్ని ఓర్చుకోలేని ఆది నుంచి టీడీపీకి అండగా ఉంటున్న ఓ సామాజికవర్గం అతడిని అడ్డు తొలగించుకోవాలని వ్యూహ రచన గావించింది. శుక్రవారం కారంపూడిలో రచ్చబండ కార్యక్రమానికి ఎస్సీ కాలనీవాసుల నుంచి అర్జీలు స్వీకరించేందుకు వెళుతున్న వెంకటేశ్వర్లను ప్రత్యర్థులు వేటకొడవళ్లతో దాడి చేసి హతమార్చటం పల్నాట తీవ్ర సంచలనం సృష్టించింది. ఆగస్టు 21న దుర్గి మండలం కంచరగుంట గ్రామానికి చెందిన శ్రీపతి చెన్నయ్య(48)ను కూడా ప్రత్యర్థులు హతమార్చారు. ఈ రెండు సంఘటనలతో పల్నాడులో ఫ్యాక్షన్ మళ్లీ పడగవిప్పిందని ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. ఫ్యాక్షన్ గ్రామాలపై దృష్టిపెట్టని పోలీసులు పంచాయతీ ఎన్నికల అనంతరం పల్నాడులోని ఫ్యాక్షన్ గ్రామాలు మళ్లీ కక్షలు, కార్పణ్యాలతో రగిలిపోతు న్నాయి. గ్రామాల్లో గొడవలు జరిగినప్పుడు తూ తూ మంత్రంగా కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్న పోలీసులు ఫ్యాక్షన్ గ్రామాలపై దృష్టి పెట్టడం లేదు. దీంతో ఫ్యాక్షన్ నాయకులు తమ ప్రత్యర్థులను అడ్డు తొలగించుకునేందుకు వ్యూహాలు పొందించుకుంటున్నారు. స్పెషల్ పార్టీ పోలీసుల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం సేకరించి గొడవలకు పాల్పడే వ్యక్తులపై కఠినంగా వ్యవహరిస్తే కొంతమేరకు ఫ్యాక్షన్ హత్యలను నిరోధించే అవకాశం ఉంటుంది. ఫ్యాక్షన్‌పై ఉక్కుపాదం మోపుతాం.. - రూరల్ జిల్లా ఎస్పీ సత్యనారాయణ పల్నాడులోని ఫ్యాక్షన్ గ్రామాలపై ప్రత్యేక దృష్టిసారించి ఫ్యాక్షన్ గొడవలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని శుక్రవారం రూరల్ జిల్లా ఎస్పీ జె.సత్యనారాయణ ‘సాక్షి’కి తెలిపారు. గ్రామాల్లో అనవసర గొడవలు సృష్టించేవారిపై రౌడీ షీట్లు ఓపెన్ చేసి అవసరమైతే వారిని గ్రామ, జిల్లా బహిష్కరణ చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే ఫ్యాక్షన్ గ్రామాల్లో శాంతియుత వాతావరణం కల్పించేందుకు పోస్టర్లు విడుదల చేసి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఫ్యాక్షన్ హత్యలకు పథక రచన చేసే వారిపై, హత్యలకు పాల్పడేవారిపై ఆయుధాల చట్టంతో పాటు కఠినమైన చట్టాలు ఉపయోగించి అణచివేస్తామని చెప్పారు.