మడకశిర: రాష్ట్రంలో రౌడీరాజ్యం నడుస్తోందని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. రౌడీయిజం చేయడంలో టీడీపీ నాయకులు ఆరితేరారని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి నయా ఫ్యాక‌్షనిస్టుగా మారారని దుయ్యబట్టారు. మంగళవారం అనంతపురం జిల్లా మడకశిరలో రఘువీరా మీడియాతో మాట్లాడారు. అధికారులపై దాడి చేస్తున్న టీడీపీ నాయకులపై చర్యలు తీసుకోకుండా రాజీలు చేయడమేమిటని ప్రశ్నించారు. చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన శని గ్రహమని, ఇంత శాడిస్ట్ ముఖ్యమంత్రిని తానెప్పుడూ చూడలేదన్నారు.
సాగునీటి పథకాల పేరుతో అధికార పార్టీ నాయకులు రూ.వేలాది కోట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. అధికారం పోయిన తర్వాత వారంతా జైలులో ఉండక తప్పదని హెచ్చరించారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వాలు ప్రజాసంక్షేమాన్ని విస్మరించాయని మండిపడ్డారు. రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నందున.. మూగజీవాలను కాపాడుకునేందుకు వెంటనే గడ్డి కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
లేకుంటే తహసీల్దార్ కార్యాలయాల ఎదుట మూగజీవాలతో నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అలాగే వడదెబ్బ మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాగా, మావోయిస్టుల దాడిలో 25 మంది జవాన్లు చనిపోవడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.