కర్నూలు (ఓల్డ్‌సిటీ): అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు ఓ ఫ్యాక్షనిస్టు అని వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం స్థానిక భాగ్యనగర్‌లోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోడెల 1994లో నర్సరావుపేటలోని ఓ నర్సింగ్ హోమ్‌లో ఐదుగురి మృతి చెందినా కేసులు పెట్టలేదన్నారు. ఇలాంటి వ్యక్తిని చంద్రబాబు నాయుడు స్పీకర్‌గా నియమించారని, ఆయన స్పీకర్‌లా కాకుండా టీడీపీ కార్యకర్తగా వ్యవహరిస్తూ ప్రతిపక్ష పార్టీ నేత వైఎస్ జగన్‌కు మాట్లాడే సమయం కూడా ఇవ్వలేదని విమర్శించారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగభృతి అంటూ ఎన్నెన్నో హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టారన్నారు.
సభలో ఈ విషయాలపై అడిగేందుకు సమయం ఇవ్వకపోవడం, మైక్‌లు కట్ చేయడం, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డిపై ఆభండాలు వేయడం పద్ధతి కాదన్నారు. చీఫ్‌విప్ కాలువ శ్రీనివాసులు తన బాధ్యతలను విస్మరించి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ ఎమ్మెల్యేలు వ్యక్తిగత దూషణలు చేయడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు వివరాలను కూడా చంద్రబాబు ఇవ్వడం లేదని, నివేదిక పంపకపోగా పట్టిసీమ నుంచి రాయలసీమకు నీళ్లు ఇస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు తోట వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ గురువారం శాసనసభలో జరిగిన పరిణామాలను ఖండిస్తున్నామన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని జగన్‌మోహన్‌రెడ్డి అడిగితే చంద్రబాబు నాయుడు మంత్రులతో మాట్లాడించాడని, వ్యక్తిగత దూషణలు చేయించారని ఆరోపించారు. విభజన తర్వాత చోటు చేసుకున్న మొట్టమొదటి సంఘటనగా ఇది చరిత్రలో నిలిచిపోతుందన్నారు. విలేకరుల సమావేశంలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు రాఘవేంద్రనాయుడు, సలీం, షరీఫ్, పి.జి.నరసింహులు యాదవ్, పులిజాకబ్, సత్యరాజు, నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు.
స్పీకర్ ఓ ఫ్యాక్షనిస్టు
Published Sat, Mar 21 2015 2:39 AM | Last Updated on Wed, Oct 3 2018 7:38 PM
Advertisement