కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి
కడప కార్పొరేషన్: ఫ్యాక్షనిస్టు, ఇంట్లో బాంబులు ఉంచుకొన్న పెద్ద మనిషిని స్పీకర్‌ను చేస్తే అసెంబ్లీ సమావేశాలు ఏకపక్షంగా సాగక, సవ్యంగా ఎలా సాగుతాయని కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి ప్రశ్నించారు. కడపలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బడ్జెట్‌పై మాట్లాడేందుకు అవకాశమివ్వమంటే మైకులు కట్ చేస్తున్నారని ఆరోపించారు. తద్వారా ప్రతిపక్షం గొంతునొక్కడానికి ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు.
యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ మాయాబజార్‌ను తలపిస్తోందని, గాలిమేడలు కట్టి ప్రజలను మరోసారి మభ్యపెట్టారని దుయ్యబట్టారు. రైతుల రుణమాఫీకి రూ.85 వేల కోట్లు అవసరం కాగా, కేవలం రూ.5 వేల కోట్లు కేటాయించి అన్యాయం చేశారన్నారు. రుణమాఫీకి మరో 20 ఏళ్లు పట్టే అవకాశముందన్నారు. ప్రతిపక్షం నిర్మాణాత్మకమైన సూచనలు చేసినా అధికారం పక్షం స్వీకరించేందుకు సిద్ధంగా లేదన్నారు. వచ్చే ఆదాయాన్ని కూడా ఎక్కువ చేసి చూపారన్నారు.
బడ్జెట్‌లో సాగునీటి ప్రాజెక్టులకు కేవలం 8400 కోట్లు కేటాయించి రాయలసీమను రతనాల సీమగా మారుస్తామని మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు ప్రగల్భాలు పలుకుతున్నారని రవీంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో రైతులు దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా రుణాలు ఇవ్వడం లేదని, తీసుకొన్న రుణాలకు వడ్డీ పెరిగిపోతోందన్నారు. పార్టీ అనుబంధం రైతు విభాగం జిల్లా కన్వీనర్ సంబటూరు ప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు.
‘కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడండి’
వైద్య, ఆరోగ్య శాఖలో పని చేస్తున్న కాంట్రాక్టు ల్యాబ్‌టెక్నీషియన్లు, మేల్ హెల్త్ అసిస్టెంట్ల సమస్యలపై మీరు అసెంబ్లీలో మాట్లాడండి’ అంటూ కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డిని ఏపీ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మేసా ప్రసాద్ కోరారు. ఈ మేరకు ఆయనతో పాటు ఉద్యోగులు ఎమ్మెల్యేను ఆదివారం కలసి వినతిపత్రం అందజేశారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు జాన్సన్, నాయకుడు హరిప్రసాద్ పాల్గొన్నారు.
‘రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి’
వీరపునాయునిపల్లె: కరువు కోరల్లో చిక్కుకున్న రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథరెడ్డి డిమాండ్ చేశారు. వీరపునాయునిపల్లె మండలం తలపనూరులో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. వర్షాభావంతో పొలాలన్నీ బీడుగా మారాయన్నారు. భూగర్భ జలాలు అడుగంటడంతో పండ్ల తోటలను కాపాడుకునేందుకు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. పశుగ్రావసం సమస్య తీవ్రమయ్యే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ మండల కన్వీనర్ రఘునాథరెడ్డి పాల్గొన్నారు.
ఫ్యాక్షనిస్టును స్పీకర్ చేస్తే ఇలాగే ఉంటుంది
Published Mon, Sep 1 2014 4:36 AM | Last Updated on Sat, Sep 2 2017 12:41 PM
Advertisement
Advertisement