
నేటి నుంచి అసెంబ్లీ
తమిళనాడు 15వ అసెంబ్లీ సమావేశాలు బుధవారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి జయలలిత సహా మొత్తం 232 మంది సభ్యుల చేత ప్రొటెం స్పీకర్ సెమ్మలై పదవీ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. వచ్చేనెల 3వ తేదీన స్పీకర్‌ను ఎన్నుకుంటారు.
* 232 మంది సభ్యులతో ప్రమాణ స్వీకారం
* నేడు నలుగురు మంత్రులతోనూ...
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు 15వ చట్టసభకు సభ్యులను ఎన్నుకునేందుకు ఈనెల 16వ తేదీన మొత్తం 234 స్థానాలకుగానూ 232 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఓటర్లను నగదు పంచారనే ఆరోపణలు రావడంతో కరూరు జిల్లా అరవకురిచ్చి, తంజావూరు అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ వాయిదా పడింది. ఈనెల 19వ తేదీన జరిగిన ఓట్ల లెక్కింపులో అన్నాడీఎంకే 134 స్థానాలు గెలుచుకుని మరోసారి అధికారాన్ని కైవసం చేసుకుంది. డీఎంకే కూటమి 98 స్థానాల్లో గెలుపొందింది.
ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఈనెల 23వ తేదీన ముఖ్యమంత్రిగా జయలలిత పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. 28 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం జయలలిత ఐదు అంశాలపై తొలి సంతకం చేశారు. గత అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉండిన విజయకాంత్ ఈసారి ఓటమి పాలుకాగా, ఆ స్థానాన్ని డీఎంకే నేత స్టాలిన్ అలంకరించారు. అయితే ఆనాడు విజయకాంత్ తొలుత అధికార అన్నాడీఎంకేకు మిత్రపక్షంగా ఎన్నికల్లో పోటీచేసి ఆ తరువాత ప్రతిపక్షంగా మారిపోయారు.
ఈసారి ప్రతిపక్ష నేత స్టాలిన్ నిజంగానే అధికార అన్నాడీఎంకేకు ప్రత్యర్థిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో 15వ అసెంబ్లీ బుధవారం సమావేశం అవుతుందని అసెంబ్లీ కార్యదర్శి జమాలుద్దీన్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బుధవారం ఉదయం తాత్కాలిక స్పీకర్ సెమ్మలై కొత్త సభ్యుల చేత పదవీ ప్రమాణం చేయిస్తారని, వచ్చేనెల 3వ తేదీన స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక సాగుతుందని అన్నారు. 89 మంది సభ్యులతో డీఎంకే ప్రధాన ప్రతిపక్షంగా అవతరించిందని తెలిపారు. అలాగే కాంగ్రెస్ 8 స్థానాలు, ఇండియన్ ముస్లింలీగ్ ఒక్క స్థానంతో కొత్త అసెంబ్లీలోకి అడుగిడుతున్నారని చెప్పారు. తమిళనాడు చరిత్రలో వామపక్షాలు లేని తొలి అసెంబ్లీగా రికార్డు కెక్కినట్లు తెలిపారు.
నేడు నలుగురు మంత్రుల ప్రమాణం:
అమ్మ కేబినెట్‌లో కొత్తగా చేరిన న లుగురు ఈనెల 25వ తేదీన రాజ్‌భవన్‌లో పదవీ ప్రమాణం చేయనున్నారు. జి. భాస్కరన్, సెవ్వూరు ఎస్ రామచంద్రన్, నిలోఫర్ కబిల్, బాలకృష్ణారెడ్డి చేత గవర్నర్ కే రోశయ్య మంతులుగా ప్రమాణం చేయిస్తారు.