జమ్మికుంట, న్యూస్‌లైన్ : కని పెంచిన చేతులే కన్నకొడుకును అంతమొందించాయి. జులాయి తిరుగుళ్లు, వేధింపులు భరించలేక తల్లిదండ్రులే పేగు బంధా న్ని తెంపుకున్నారు. కాంట్రాక్ట్ మాట్లాడుకుని మరీ మట్టుబెట్టించారు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు. జమ్మికుంట మండ లం బిజిగిరి షరీఫ్ గుట్టల్లో యువకుడి హత్యకేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. తల్లిదండ్రులు, సోదరుడే కాంట్రాక్ట్ హత్య చేయించారని తేల్చారు. నిందితులను ఆదివారం అరెస్టు చూపిన డీఎస్పీ సుధీంద్ర, ఎస్సై పాపయ్యనాయక్‌తో కలిసి వివరాలు వెల్లడించారు.
వరంగల్ జిల్లా మొగుళ్లపల్లి మండలం పర్లపల్లికి చెందిన బొల్లు సుదర్శన్‌రెడ్డి-రమాదేవి దంపతులకు ఇద్దరు కుమారులు రంజిత్‌రెడ్డి, రణధీర్‌రెడ్డి(26) ఉన్నారు. రంజిత్‌రెడ్డికి పెళ్లి కాగా, హోటల్ మేనేజ్‌మెంట్ చదివిన రణధీర్‌రెడ్డికి ఖాళీగా ఉంటున్నాడు. అతడికి పెళ్లి కాలేదు. తల్లిదండ్రుల నుంచి వేరుగా ఉంటున్న రణధీర్‌రెడ్డి ఆస్తి పంచాలంటూ కొన్నేళ్లుగా తల్లిదండ్రులను ఒత్తిడి చేస్తున్నాడు. అవసరాల కోసం డబ్బులు ఇవ్వాలంటూ తరచూ వేధిస్తున్నాడు. ఆస్తి పంచిస్తే అమ్ముకుంటానంటూ గొడవకు దిగుతున్నాడు. అతడి వేధింపులు నానాటికి ఎక్కువయ్యాయి. వేధింపులు భరించలేని తల్లిదండ్రులు... ఆస్తి పంచిస్తే మొత్తం అమ్ముకుం టాడనే ఉద్దేశంతో కొడుకును మట్టుబెట్టాలని పథకం వేశారు. ఇందుకు తమ బంధువైన వీణవంక మండలం చల్లూరుకు చెందిన శ్రీనివాస్‌రెడ్డితో ఒప్పందం కుదుర్చుకున్నారు. రణధీర్‌రెడ్డిని చంపిస్తే రూ.50 వేలు ఇస్తామని చెప్పారు. దీంతో శ్రీనివాస్‌రెడ్డి చల్లూరుకు చెందిన దోతుల రమేశ్‌తో కాంట్రాక్ట్ మాట్లాడుకున్నాడు. రూ.20 వేలు అప్పగించాడు. ఒప్పందం ప్రకారం గత నెల 25న పర్లపల్లిలో శ్రీనివాస్‌రెడ్డి, రమేశ్‌లు రణధీర్‌రెడ్డికి పర్లపల్లిలో మద్యం తాగించి బైక్‌పై బిజిగిరి షరీఫ్ గుట్టల వద్దకు పని ఉందం టూ తీసుకెళ్లారు. అక్కడ రణధీర్‌రెడ్డిని బండతో మోది చంపారు. అనంతరం శరీరాన్ని ఎవరూ గుర్తించకుండా పెట్రోల్ పోసి నిప్పంటించారు. రెండు రోజులకు స్థానికులకు మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేశారు. మృతదేహంపై లభించిన దుస్తుల ఆధారంగా విచారణ ప్రారంభించారు. అప్పటికే పర్లపల్లిలో రణధీర్‌రెడ్డి కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది.
పోలీసులకు లభించిన క్లూ ఆధారంగా మృతుడు రణధీర్‌రెడ్డి అని గుర్తించారు. కేసును లోతుగా విచారించగా మృతుడి కుటుంబసభ్యులపైనే అనుమానం కలిగింది. వారిని విచారించగా కుటుంబసభ్యులే కాంట్రాక్ట్ హత్య చేశారని నిర్ధారించారు. హత్యకు సంబంధించి చేసుకున్న ఒప్పందపత్రంతోపాటు నిందితుడి వద్ద ఉన్న రూ.20 వేలు స్వాధీనం చేసుకున్నారు. మృతుడి తల్లిదండ్రులు సుదర్శన్‌రెడ్డి, రమాదేవి, సోదరుడు రంజిత్‌రెడ్డితోపాటు ప్రధాన నిందితుడు రమేశ్, శ్రీనివాస్‌రెడ్డిలను ఆదివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
పేగుబంధం తెంచుకున్నారు
Published Mon, Jan 6 2014 4:48 AM | Last Updated on Sat, Sep 2 2017 2:19 AM
Advertisement
Advertisement