ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: చౌకధరల దుకాణాల్లో నిత్యావసర సరుకులకు కొరత వచ్చింది. బియ్యం మినహా మిగతా వాటికోసం కార్డుదారులు దుకాణాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రవేశపెట్టిన అమ్మహస్తం సరుకులకూ కోత పడింది. డీలర్లు డీడీలు చెల్లించినప్పటికీ వారికి నిత్యావసర సరుకులు సకాలంలో చేరడం లేదు. కొన్నిరకాల సరుకులు విడుదల కాకపోవడంతో దుకాణదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రేషన్‌కార్డు తీసుకొని వచ్చేవారికి సమాధానాలు చెప్పుకోలేక సతమతమవుతున్నారు. పెపైచ్చు డిమాండ్ ఉన్న వస్తువులకు నో స్టాక్ కోత విధించడం, డిమాండ్ లేనివాటిని ఇబ్బడి ముబ్బడిగా దించుతుండటంతో వాటిని ఏం చేయాలో తెలియక డీలర్లు తెల్లమొహం వేస్తున్నారు.
జిల్లాలో 2108 చౌకధరల దుకాణాలున్నాయి. వాటి పరిధిలో 8,53,866 రేషన్ కార్డులున్నాయి. అమ్మహస్తం పథకానికి ముందు బియ్యం, పామాయిల్, చక్కెర, గోధుమలు అందించేవారు. అమ్మహస్తం పేరుతో బియ్యం పక్కనపెట్టి తొమ్మిది రకాల నిత్యావసర వస్తువులు ఇవ్వడం ప్రారంభించారు. 185 రూపాయలకే కందిపప్పు, పంచదార, నూనె, ఉప్పు, గోధుమలు, గోధుమపిండి, చింతపండు, పసుపు, కారం ప్రతినెలా అందిస్తామని ప్రభుత్వం గొప్పగా ప్రకటించింది. అయితే ఆ సరుకుల్లో నాణ్యత లేకపోవడంతో పాటు వచ్చిన సరుకుల్లో కోత పడుతోంది. అమ్మహస్తంలో డిమాండ్ ఉన్న సరుకులను తగ్గించి ఇస్తున్నారు. కందిపప్పు, పామాయిల్‌కు డిమాండ్ ఎక్కువగా ఉంది. నవంబర్ కోటాలో ఈ రెండింటికీ కోత పడింది. జిల్లాకు పూర్తి స్థాయి కోటా విడుదల కాకపోవడంతో కొన్ని ప్రాంతాలకే వాటిని పరిమితం చేశారు. దాంతో ఎక్కువ మంది కందిపప్పు, పామాయిల్ అడుగుతున్నారు. కారం, పసుపు, ఉప్పు వంటివి లోడ్ చేస్తుండటంపై చౌకధరల దుకాణదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ముందుగా డీడీలు కట్టించుకున్నా..
జిల్లాలోని చౌకధరల డీలర్ల నుంచి నిత్యావసర వస్తువులకు సంబంధించి ఒక నెల ముందుగానే 16 నుంచి 20వ తేదీలోపు డీడీలు కట్టించుకుంటారు. 20 నుంచి నెలాఖరు వరకు నిత్యావసర సరుకులను చౌకధరల దుకాణాలకు చేర్చాల్సి ఉంటుంది. 1 నుంచి 16వ తేదీ వరకు కార్డుదారులకు సరుకులు అందిస్తారు. రేషన్ షాపుల పరిధిలోని కార్డుల సంఖ్యను బట్టి డీడీలు కట్టినప్పటికీ అందుకు అనుగుణంగా సరుకులు విడుదల చేయడం లేదు. ప్రతినెలా ఏదో ఒక వస్తువుకు కొరత వస్తూనే ఉందని డీలర్లు వాపోతున్నారు. ఈ విషయాన్ని కార్డుదారులకు చెబితే సరుకులు ఉంచుకొని కూడా లేవని చెబుతున్నారని తమను నిలదీస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. ఈ విషయాన్ని అధికారులతో చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు.
డీడీలు ముందస్తు ‘క్యాష్’...
ఒక నెలకు ముందుగానే చౌకధరల దుకాణ దారులు నిత్యావసర సరుకుల కోసం డీడీలు చెల్లిస్తారు. సరుకులు చేరిన తరువాత ఆ డీడీలను క్యాష్ చేసుకోవాలి. జిల్లాలో అందుకు విరుద్ధంగా జరుగుతోంది. చౌకధరల దుకాణాలకు సరుకులు రాకపోయినప్పటికీ డీడీలను మాత్రం క్యాష్ చేసుకుంటున్నారు. దీనివల్ల దుకాణదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. సరుకు ఆలస్యమైతే ఆ డీడీలను మరో దానికి ఉపయోగించుకునేందుకు వీలులేకుండా క్యాష్ చేసుకోవడాన్ని దుకాణ దారులు తప్పుపడుతున్నారు. ఆ నెల సరుకులు రాకపోయినా మరుసటి నెలకు సంబంధించి ఠంఛనుగా డీడీలు కట్టాలంటూ ఒత్తిడి చేస్తున్నారని, డబ్బులు ఎక్కడ నుంచి తేవాలని వారు ప్రశ్నిస్తున్నారు. ఒక్క కందిపప్పుకే ఒక్కో డీలర్ 25 వేల రూపాయల వరకు చెల్లిస్తుంటారు. దీన్ని బట్టి మిగతా వస్తువులకు ఎంత మొత్తంలో ముందస్తుగా చెల్లిస్తారో అర్థం చేసుకోవచ్చు.
నో స్టాక్
Published Sun, Dec 1 2013 4:09 AM | Last Updated on Sat, Sep 2 2017 1:08 AM
Advertisement
Advertisement