amma hastham
-
‘చంద్రన్న కానుక’తో రూ. 350 కోట్లు వృథా
అనంతపురం ఎంపీ జేసీ దివాకరరెడ్డి గుత్తి: సంక్రాంతికి ప్రభుత్వం ఇచ్చిన ‘చంద్రన్న కానుక’ వల్ల రూ. 350 కోట్లు వృథా అయ్యాయని అనంతపురం ఎంపీ జేసీ దివాకరరెడ్డి అన్నారు. ఆదివారం అనంతపురం జిల్లా గుత్తి మండలం ఎంగిలిబండలో విద్యుత్ సబ్‌స్టేషన్ ప్రారంభోత్సవంలో జేసీ మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ‘అమ్మహస్తం’ పేరుతో రూ. 185లకు తెల్లరేషన్ కార్డు దారులకు అందించిన విధంగానే ప్రస్తుత సీఎం చంద్రబాబు ఉచితంగా ఆరు సరుకులు అందించారన్నారు. గత సీఎం కిరణ్ ప్రజలకు అన్ని చేసి ఇప్పుడెక్కడున్నాడని ఎద్దేవా చేశారు. రాష్ట్రం విడిపోయి..హుదూద్ తుపానుతో తీవ్రంగా నష్టపోయి లోటు బడ్జెట్లో ఉందని, ఇలాంటి సమయంలో ఉచిత కార్యక్రమాలు వద్దని తాను సీఎంకు చెప్పానన్నారు. ప్రజా సంక్షేమం కోసం ఈ రూ. 350 కోట్లు ఖర్చ చేసి ఉంటే బాగుండేదన్నారు. ప్రజలకు ఉచితంగా సంచులు ఇచ్చే వరకే ప్రభుత్వం గుర్తుంటుందని, ఆ తర్వాత మరచిపోతారని జేసీ అన్నారు. ఈ విషయాన్ని బాబుకు చెప్పినా పట్టించుకోలేదన్నారు. -
అమ్మ పోయి..అన్న
విజయనగరం కంటోన్మెంట్: గత ప్రభుత్వ పాలనలో అమ్మ హస్తం పేరిట పథకం ఏర్పాటు చేసిన రేషన్ లబ్ధిదారులకు తొమ్మిది సరుకులను అందిస్తున్న పథకం కాస్తా ప్రభుత్వ మారడంతో అన్నహస్తంగా మారనుంది. పసుపు రంగుతో కూడిన కూపన్లు ఇప్పటికే జిల్లాకు చేరాయి. ప్రజలకు పంపిణీ చేయాల్సిన 9 రకాల సరుకుల పేర్లను ఉదహరిస్తూ ఈ కూపన్లను పసుపు రంగులో ముద్రించారు. రచ్చబండ రేషన్ కార్డుదారులకు కొత్తగా కూపన్లు మంజూరయ్యాయి. 56, 382 కూపన్లను జిల్లాకు పంపించారు. ఎన్టీఆర్ ప్రజాపంపిణీ పథకం పేరున ఈ కూపన్లను విడుదల చేశారు. మంగళవారం ఈ కూపన్లు జిల్లా కేంద్రానికి చేరాయి. కలెక్టరేట్లోని ప్రజాపంపిణీ వ్యవస్థ కార్యాలయానికి చేరుకున్న ఈ కూపన్ల వివరాలను డీఎస్ఓ ఇన్చార్జి హెచ్‌వి ప్రసాద్ ఆధ్వర్యంలో పరిశీలిస్తున్నారు. గతంలో పంపిణీ చేసిన కూపన్లు జూన్ నెల వరకూ మాత్రమే సరిపోయాయి. ఇప్పుడు పంపించిన కూపన్లు జూలై నుంచి వినియోగపడేలా చర్యలు తీసుకుంటున్నారు. కూపన్ల పరిశీలన పూర్తయ్యాక అన్ని మండలాల తహశీల్దార్లకూ పంపిస్తామని డీఎస్ఓ తెలిపారు. త్వరగా పంపిణీ చేయండి:జేసీ రామారావు రేషన్ లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సిన కూపన్లను త్వరగా అందించాలని జాయింట్ కలెక్టర్ బి రామారావు సివిల్ సప్లైస్ అధికారులను ఆదేశించారు. కొత్తగా వచ్చిన కూపన్లను ఆయన పరిశీలించారు. -
నో స్టాక్
- సివిల్ సప్లై గోదాములు ఖాళీ - పత్తాలేని పామాయిల్ - నిలిచిన చక్కెర సరఫరా - డీడీలు కట్టవద్దని మౌఖిక ఆదేశాలు సాక్షి, సిటీబ్యూరో: గత రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో అట్టహాసంగా ప్రవేశపెట్టిన ‘అమ్మహస్తం’ సరుకుల స్టాక్‌కు కొరత ఏర్పడింది. పథకం ప్రారంభం నుంచి అరకొరగా సరఫరా అవుతున్న తొమ్మిది సరుకులకు పూర్తి స్థాయిలో ఫుల్స్టాప్ పడింది. దీంతో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోని పౌరసరఫరా గోదాముల్లో తొమ్మిది సరుకుల స్టాక్ లేకుండా పోయింది. జూన్ నెలకు సంబంధించి తొమ్మిది సరుకుల కోసం డీడీలు కట్టవద్దని సంబంధిత అధికారుల నుంచి రేషన్ డీలర్లకు మౌఖిక ఆదేశాలు అందాయి. గత కొద్ది నెలలుగా పామాయిల్ సరఫరా లేకుండా పోగా, తాజాగా చక్కెర, కందిపప్పు, చింతపండు, కారంపొడి, పసుపు, ఉప్పు తదితర సరుకులపై సైతం అధికారులు చేతులు ఎత్తేశారు. ఫలితంగా జూన్ నెల సరుకుల పంపిణీ ప్రశ్నార్థకంగా మారింది. చౌకధర దుకాణాల ద్వారా రూ.185 లకే తొమ్మిది రకాల నాణ్యమైన నిత్యావసర సరుకులు కొనుగోలు చేయాలన్న నిరుపేదల ఆశలు అడియాశలయ్యాయి. రెండు సరుకులే.. ప్రభుత్వ చౌక ధర దుకాణాల ద్వారా నిరుపేదలకు ఈ నెలలో సబ్సిడీపై రెండే రెండు సరుకుల పంపిణీ జరుగనుంది. ప్రస్తుతం పౌరసరఫరా గోదాముల్లో కేవలం బియ్యం, గోధుమ పిండి మాత్రమే స్టాక్ ఉండటంతో డీలర్లు సైతం ఆ రెండింటికే డీడీలు చెల్లించినట్లు సమాచారం. జూన్ నెలకు సంబంధించి చౌకధర దుకాణాలకు రెండు సరుకుల కోటా సరఫరా ఇప్పటికే ప్రారంభమైంది. మిగితా సరుకుల ఊసే లేకుండా పోయింది. తొమ్మిది సరుకుల సరఫరా సంబంధించిన టెండర్ల కాలపరిమితి ముగిసినప్పటికీ పునరుద్ధరణకు నోచుకొలేదు. వాస్తవంగా తొమ్మిది సరుకుల్లో ఏడింటికి లబ్ధిదారుల ఆదరణ లేకుండా పోవడంతో అధికారులు... డిమాండ్ లేక, గిట్టుబాటు కాకపోవడంతో సదరు కాంట్రాక్టర్లు సైతం పెద్దగా ఆసక్తి కనబర్చలేదు. దీంతో సరుకులు సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. నాణ్యత లోపమే.. తొమ్మిది సరుకుల నాణ్యత లోపమే సరఫరా ఆగిపోవడానికి ప్రధాన కారణమైనట్లు కనిపిస్తోంది. ముక్కిపోయిన కందిపప్పు, గింజల చింతపండు, పురుగుల మయమైన గోధుమలు, గోధుమ పిండి, ఘాటివ్వని కారం పొడి, రుచిలేని ఉప్పు లబ్ధిదారులను మెప్పించలేకపోయాయి. దీంతో వారు అమ్మహస్తం తొమ్మిది సరుకుల్లో మూడు సరుకులపైనే అసక్తి కనబర్చుతూ వచ్చారు. గోధుమలు, చక్కెర, పామాయిల్ మాత్రమే కొనుగోలు చేసి మిగతా ఆరు సరుకుల జోలికి వెళ్లలేదు. తాజాగా ఆ మూడింటికి సైతం కొరత ఏర్పడింది. దీంతో ఈ మాసం సరుకుల పంపిణీ ప్రశ్నార్ధకంగా మారింది. -
నో స్టాక్
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: చౌకధరల దుకాణాల్లో నిత్యావసర సరుకులకు కొరత వచ్చింది. బియ్యం మినహా మిగతా వాటికోసం కార్డుదారులు దుకాణాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రవేశపెట్టిన అమ్మహస్తం సరుకులకూ కోత పడింది. డీలర్లు డీడీలు చెల్లించినప్పటికీ వారికి నిత్యావసర సరుకులు సకాలంలో చేరడం లేదు. కొన్నిరకాల సరుకులు విడుదల కాకపోవడంతో దుకాణదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రేషన్‌కార్డు తీసుకొని వచ్చేవారికి సమాధానాలు చెప్పుకోలేక సతమతమవుతున్నారు. పెపైచ్చు డిమాండ్ ఉన్న వస్తువులకు నో స్టాక్ కోత విధించడం, డిమాండ్ లేనివాటిని ఇబ్బడి ముబ్బడిగా దించుతుండటంతో వాటిని ఏం చేయాలో తెలియక డీలర్లు తెల్లమొహం వేస్తున్నారు. జిల్లాలో 2108 చౌకధరల దుకాణాలున్నాయి. వాటి పరిధిలో 8,53,866 రేషన్ కార్డులున్నాయి. అమ్మహస్తం పథకానికి ముందు బియ్యం, పామాయిల్, చక్కెర, గోధుమలు అందించేవారు. అమ్మహస్తం పేరుతో బియ్యం పక్కనపెట్టి తొమ్మిది రకాల నిత్యావసర వస్తువులు ఇవ్వడం ప్రారంభించారు. 185 రూపాయలకే కందిపప్పు, పంచదార, నూనె, ఉప్పు, గోధుమలు, గోధుమపిండి, చింతపండు, పసుపు, కారం ప్రతినెలా అందిస్తామని ప్రభుత్వం గొప్పగా ప్రకటించింది. అయితే ఆ సరుకుల్లో నాణ్యత లేకపోవడంతో పాటు వచ్చిన సరుకుల్లో కోత పడుతోంది. అమ్మహస్తంలో డిమాండ్ ఉన్న సరుకులను తగ్గించి ఇస్తున్నారు. కందిపప్పు, పామాయిల్‌కు డిమాండ్ ఎక్కువగా ఉంది. నవంబర్ కోటాలో ఈ రెండింటికీ కోత పడింది. జిల్లాకు పూర్తి స్థాయి కోటా విడుదల కాకపోవడంతో కొన్ని ప్రాంతాలకే వాటిని పరిమితం చేశారు. దాంతో ఎక్కువ మంది కందిపప్పు, పామాయిల్ అడుగుతున్నారు. కారం, పసుపు, ఉప్పు వంటివి లోడ్ చేస్తుండటంపై చౌకధరల దుకాణదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముందుగా డీడీలు కట్టించుకున్నా.. జిల్లాలోని చౌకధరల డీలర్ల నుంచి నిత్యావసర వస్తువులకు సంబంధించి ఒక నెల ముందుగానే 16 నుంచి 20వ తేదీలోపు డీడీలు కట్టించుకుంటారు. 20 నుంచి నెలాఖరు వరకు నిత్యావసర సరుకులను చౌకధరల దుకాణాలకు చేర్చాల్సి ఉంటుంది. 1 నుంచి 16వ తేదీ వరకు కార్డుదారులకు సరుకులు అందిస్తారు. రేషన్ షాపుల పరిధిలోని కార్డుల సంఖ్యను బట్టి డీడీలు కట్టినప్పటికీ అందుకు అనుగుణంగా సరుకులు విడుదల చేయడం లేదు. ప్రతినెలా ఏదో ఒక వస్తువుకు కొరత వస్తూనే ఉందని డీలర్లు వాపోతున్నారు. ఈ విషయాన్ని కార్డుదారులకు చెబితే సరుకులు ఉంచుకొని కూడా లేవని చెబుతున్నారని తమను నిలదీస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. ఈ విషయాన్ని అధికారులతో చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. డీడీలు ముందస్తు ‘క్యాష్’... ఒక నెలకు ముందుగానే చౌకధరల దుకాణ దారులు నిత్యావసర సరుకుల కోసం డీడీలు చెల్లిస్తారు. సరుకులు చేరిన తరువాత ఆ డీడీలను క్యాష్ చేసుకోవాలి. జిల్లాలో అందుకు విరుద్ధంగా జరుగుతోంది. చౌకధరల దుకాణాలకు సరుకులు రాకపోయినప్పటికీ డీడీలను మాత్రం క్యాష్ చేసుకుంటున్నారు. దీనివల్ల దుకాణదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. సరుకు ఆలస్యమైతే ఆ డీడీలను మరో దానికి ఉపయోగించుకునేందుకు వీలులేకుండా క్యాష్ చేసుకోవడాన్ని దుకాణ దారులు తప్పుపడుతున్నారు. ఆ నెల సరుకులు రాకపోయినా మరుసటి నెలకు సంబంధించి ఠంఛనుగా డీడీలు కట్టాలంటూ ఒత్తిడి చేస్తున్నారని, డబ్బులు ఎక్కడ నుంచి తేవాలని వారు ప్రశ్నిస్తున్నారు. ఒక్క కందిపప్పుకే ఒక్కో డీలర్ 25 వేల రూపాయల వరకు చెల్లిస్తుంటారు. దీన్ని బట్టి మిగతా వస్తువులకు ఎంత మొత్తంలో ముందస్తుగా చెల్లిస్తారో అర్థం చేసుకోవచ్చు.