‘చంద్రన్న కానుక’తో రూ. 350 కోట్లు వృథా
అనంతపురం ఎంపీ జేసీ దివాకరరెడ్డి
గుత్తి: సంక్రాంతికి ప్రభుత్వం ఇచ్చిన ‘చంద్రన్న కానుక’ వల్ల రూ. 350 కోట్లు వృథా అయ్యాయని అనంతపురం ఎంపీ జేసీ దివాకరరెడ్డి అన్నారు. ఆదివారం అనంతపురం జిల్లా గుత్తి మండలం ఎంగిలిబండలో విద్యుత్ సబ్‌స్టేషన్ ప్రారంభోత్సవంలో జేసీ మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ‘అమ్మహస్తం’ పేరుతో రూ. 185లకు తెల్లరేషన్ కార్డు దారులకు అందించిన విధంగానే ప్రస్తుత సీఎం చంద్రబాబు ఉచితంగా ఆరు సరుకులు అందించారన్నారు.
గత సీఎం కిరణ్ ప్రజలకు అన్ని చేసి ఇప్పుడెక్కడున్నాడని ఎద్దేవా చేశారు. రాష్ట్రం విడిపోయి..హుదూద్ తుపానుతో తీవ్రంగా నష్టపోయి లోటు బడ్జెట్‌లో ఉందని, ఇలాంటి సమయంలో ఉచిత కార్యక్రమాలు వద్దని తాను సీఎంకు చెప్పానన్నారు. ప్రజా సంక్షేమం కోసం ఈ రూ. 350 కోట్లు ఖర్చ చేసి ఉంటే బాగుండేదన్నారు. ప్రజలకు ఉచితంగా సంచులు ఇచ్చే వరకే ప్రభుత్వం గుర్తుంటుందని, ఆ తర్వాత మరచిపోతారని జేసీ అన్నారు. ఈ విషయాన్ని బాబుకు చెప్పినా పట్టించుకోలేదన్నారు.