వైవీయూ, న్యూస్‌లైన్: యువతలో చైతన్యం వస్తేనే సమాజం లో మార్పు సాధ్యమని రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ లామ్ తాంతియాకుమారి అన్నారు. మంగళవారం యోగివేమన విశ్వవిద్యాలయంలోని సర్ సి.వి.రామన్ సైన్స్ బ్లాక్‌లో వైవీయూ జర్నలిజం అండ్ కమ్యూనికేషన్ శాఖ ఆధ్వర్యంలో సమాచారహక్కు చట్టంపై నిర్వహించిన జాతీయ సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపడం కోసమే సమాచార హక్కు చట్టం వచ్చిందన్నారు.
ఈ చట్టం ద్వారా ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుందని తెలిపారు. పేదల కోసం ప్రభుత్వాలు ఎన్నో పథకాలు అమలు చేస్తున్నా అవి పేదలతో పాటు ధనికులు కూడా వినియోగించుకుంటుండడంతో అసలైన లబ్ధిదారులకు పథకాల ఫలాలు చేరడం లేదన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో, విశ్వవిద్యాలయల్లో జరిగే అవినీతిని ప్రశ్నిస్తే వ్యతిరేకులుగా ముద్రవేస్తారన్న భయంవీడి ప్రశ్నించడం అలవర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాల్సి ఉన్నా, అవిలేక జీవశ్చవ విద్యాలయాలుగా తయారవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేవాలయాలు, కార్పొరేట్ సంస్థలు, ప్రైవేట్ పాఠశాలలు సైతం సమాచార హక్కుచట్టం కిందికి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. మన కష్టసుఖాలను తెలుసుకుని పరిపాలించే సమర్థులైన నాయకులను ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని వివరించారు.
పారదర్శకమైన సమాజం కోసం కృషి..
పారదర్శకమైన సమాజం కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని వైస్ చాన్స్‌లర్ ఆచార్య బేతనభట్ల శ్యాంసుందర్ అన్నారు. సమాచార హక్కు చట్టం, దాని అమలు లక్ష్యాలను ప్రతి విద్యార్థి తెలుసుకోవడం అవసరమన్నారు. ప్రిన్సిపాల్ ఆచార్య ఎం. ధనుంజయనాయు డు మాట్లాడుతూ సమాచారహక్కు చట్టం ద్వారా తెలుసుకోగోరే దరఖాస్తు దారులకు న్యాయం జరగాలే తప్ప అన్యాయం జరగకూడదన్నారు. అనంతరం రిజిస్ట్రార్ ఆచార్య టి. వాసంతి, పద్మావతి విశ్వవిద్యాలయం జర్నలిజం ప్రొఫెసర్ త్రిపురసుందరి, షాలిమ్‌ఫిరియర్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ నటరాజన్ ప్రసంగించారు. అనంతరం సావనీర్‌ను అతిథులు ఆవిష్కరించారు. సదస్సు కన్వీనర్ టి. శ్యాంస్వరూప్, నిర్వాహక కార్యదర్శి తుమ్మలూరు సురేష్‌బాబు,అధ్యాపకులు స్వప్న, రామసుధ, సునీత,అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
వైఎస్‌ఆర్‌కు నివాళి..
వైవీయూకు విచ్చేసిన సమాచార హక్కు చట్టం కమిషనర్ విశ్వవిద్యాలయంలోని సీవీ రామన్‌సైన్స్ బ్లాక్ వద్ద ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
యువత చైతన్యంతోనే మార్పు
Published Wed, Mar 12 2014 2:30 AM | Last Updated on Sat, Sep 22 2018 8:07 PM
Advertisement