నకిలీ కరెన్సీ ముఠా పట్టివేత | fake currency gang arrest | Sakshi
Sakshi News home page

నకిలీ కరెన్సీ ముఠా పట్టివేత

Published Sun, Feb 9 2014 1:53 AM | Last Updated on Sat, Sep 2 2017 3:29 AM

fake currency gang arrest

కాకినాడ క్రైం, న్యూస్‌లైన్ :ఫైనాన్స్ వ్యాపారం ముసుగులో నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ప్రధాన నిందితుడి చిరునామా కూడా తెలియకుండానే ముఠా సభ్యులు నకిలీ కరెన్సీని చలామణి చేయడం పోలీసులకు సవాలుగా మారింది. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ ఎన్.శివశంకర్ రెడ్డి వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన వల్లూరి రాజశేఖర్ వడ్రంగి పని, వస్త్ర వ్యాపారం, రోల్డ్‌గోల్డ్ వస్తువుల వ్యాపారం చేసి నష్టాల పాలయ్యాడు. దీంతో అతడు మండపేటకు మకాం మార్చాడు.
 
 అలాగే అనపర్తి మండలం కుతుకులూరు కాలనీకి చెందిన మేడపాటి శ్రీనివాసరెడ్డి ఫైనాన్స్, ఇన్‌స్టాల్‌మెంట్ వ్యాపారాలు చేసి నష్టపోయాడు. కొద్దికాలం క్రితం రాజశేఖర్‌తో శ్రీనివాసరెడ్డికి పరిచయం ఏర్పడింది. తక్కువ కాలంలోనే ఎక్కువ డబ్బు సంపాదించాలని వీరు నిర్ణయానికి వచ్చారు. ఇందుకు నకిలీ కరెన్సీయే మార్గమని భావించారు. సుమారు ఏడు నెలల క్రితం జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ధన్‌బాద్‌రెడ్డి అనే వ్యక్తి రాజశేఖర్‌కు పరిచయమయ్యాడు. తాను నకిలీ కరెన్సీ నోట్లు ఇస్తానని, అందుకు కొంత నగదు ఇవ్వాలన్నాడు. దీంతో రాజశేఖర్, శ్రీనివాసరెడ్డి కలిసి ధన్‌బాద్‌రెడ్డితో ఒప్పందం కుదుర్చుకున్నారు. లక్ష రూపాయల నకిలీ కరెన్సీ నోట్లకు రూ.47 వేలు అసలు కరెన్సీ ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. 
 
 తొలివిడతగా ధన్‌బాద్‌రెడ్డి వారికి రూ.ఆరు లక్షల నకిలీ కరెన్సీ నోట్లు జార్ఖండ్ రాష్ట్రం ధన్‌బాద్ జిల్లా రేవానిజరియా పట్టణానికి చెందిన దివేష్ కుమార్ అనే వ్యక్తి ద్వారా రాజమండ్రికి పంపాడు. రాజశేఖర్, శ్రీనివాసరెడ్డి కలిసి రాజమండ్రి నుంచి దివేష్ కుమార్‌ను మండపేట తీసుకువచ్చి నకిలీ కరెన్సీలో రూ.3.50 లక్షలను మహేంద్రవాడకు చెందిన ఫైనాన్స్ వ్యాపారి మల్లిడి కుమార్ రెడ్డి (మణికంఠ)కు, రూ.2.50 లక్షల (రూ.500 నోట్లు)ను రామవరం కాలనీకి చెందిన ఫైనాన్స్ వ్యాపారి కర్రి వెంకట రెడ్డికి ఇచ్చారు. వారి నుంచి రూ.లక్ష నకిలీ కరెన్సీకి రూ.53 వేలు చొప్పున రాజశేఖర్, శ్రీనివాసరెడ్డి వసూలు చేశారు. ఆ సొమ్మును ధన్‌బాద్ రెడ్డి సూచించిన బ్యాంకు ఖాతాల్లో దఫదఫాలుగా జమ చేశారు. నకిలీ కరెన్సీ చలామణి వ్యాపారం లాభదాయకంగా ఉండడంతో మరో రూ.పది లక్షలు ఇమ్మని ధన్‌బాద్ రెడ్డితో రాజశేఖర్, శ్రీనివాసరెడ్డి ఒప్పందం కుదుర్చుకున్నారు. 
 
 ఇందులో భాగంగా శుక్రవారం రాత్రి దివేష్ కుమార్ వాటిని తీసుకుని మండపేట వచ్చాడు. దివేష్ కుమార్‌ను రాజశేఖర్ ఇంట్లో ఉంచి, అతడి వద్ద నుంచి రూ.8 లక్షల కరెన్సీ నోట్లు తీసుకున్నారు. మల్లిడి కుమార్ రెడ్డి, కర్రి వెంకట రెడ్డికి చెరో రూ.50 వేలు ఇచ్చి, వారి నుంచి అసలు నగదు తీసుకున్నారు. మిగిలిన నకిలీ కరెన్సీ చలామణి చేసేందుకు రాత్రి 8 గంటల సమయంలో మండపేట బస్టాండ్ చెట్టు వద్ద రాజశేఖర్, శ్రీనివాసరెడ్డి పథకం రచించుకుంటుండగా, విషయం తెలుసుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారణ చేయగా, నకిలీ కరెన్సీ బాగోతం వెలుగుచూసింది. వీరితో పాటు దివేష్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 1785 రూ.500 నకిలీ కరెన్సీ నోట్లు, రూ.8,800 అసలు నగదు, రెండు మోటార్ బైక్‌లు, ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ధన్‌బాద్ రెడ్డి, మల్లిడి కుమార్ రెడ్డి, కర్రి వెంకట రెడ్డిలు పరారీలో ఉన్నారు. నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు చేసిన పోలీసు సిబ్బందిని ఎస్పీ శివశంకర్ రెడ్డి, అదనపు ఎస్పీ (అడ్మిన్) కె.సత్యనారాయణ అభినందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement