గిద్దలూరు: నడుచుకుంటూ వెళ్తున్న వృద్ధురాలి నుంచి పోలీసులమని చెప్పి రూ. 2 లక్షల విలువైన ఏడు తులాల బంగారు ఆభరణాలను నకిలీ పోలీసులు దోచుకెళ్లిన సంఘటన స్థానిక సుంకమ్మవీధిలో ఆదివారం జరిగింది. బాధితురాలి కథనం ప్రకారం.. ముండ్లపాడుకు చెందిన విశ్రాంత ఉద్యోగిని గిద్దలూరు బాలసుబ్బమ్మ తన స్వగ్రామం నుంచి గిద్దలూరులోని బ్యాంకుకు పింఛన్ తీసుకునేందుకు వచ్చింది. సుంకమ్మ వీధి మీదుగా బ్యాంకుకు వెళ్తున్న సమయంలో ఇద్దరు గుర్తుతెలియని యువకులు బాలసుబ్బమ్మ వద్దకు వచ్చి తాము పోలీసులమని, ఇంత బంగారం మెడలో వేసుకుని బయట తిరగడం మంచిది కాదని, ఇదే స్థలంలో ఈ మధ్య గుర్తు తెలియని వ్యక్తులు ఓ వృద్ధురాలిని చంపి ఆమె ధరించిన బంగారం ఎత్తుకుపోయారని నమ్మబలికారు.
ఒంటిపై బంగారం ఉంటే ప్రాణహాని అని ఆమె ఒంటిపై ఉన్న మూడు తులాల సరుడు, నాలుగు బంగారు గాజులు తీసి ఓ పేపరులో చుట్టారు. ఇంతలో వారి వద్ద ఉన్న రెండు నకిలీ బంగారు గాజులు, ఓ రాయిని పేపరులో చుట్టి ఆమె చేతిలో పెట్టారు. పేపరును ఇంటికి వెళ్లాకే విప్పాలని సూచించారు. దీంతో బాధితురాలు అక్కడి నుంచి నేరుగా బ్యాంకుకు వెళ్లి పింఛన్ తీసుకుంది. అనంతరం స్వగ్రామం ముండ్లపాడుకు ఆటోలో వెళ్లింది. ఇంటికెళ్లి పేపరు తెరిచి చూసేసరికి అందులో రెండు నకిలీ బంగారు గాజులు, రాయిని చూసి మోసపోయానని బాలసుబ్బమ్మ గుర్తించింది. వెంటనే గిద్దలూరు వచ్చి వెతికినా నిందితుల ఆచూకీ తెలియలేదు. చేసేది లేక పోలీసులకు ఫిర్యాదు చేసింది.