సాక్షి ప్రతినిధి, కాకినాడ : అవినీతి అక్రమాలతో నిండా మునిగిన టీడీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దాదాపు ప్రతిచోటా ప్రజాభిమానాన్ని పాలకులు కోల్పోయారు. ప్రజా వ్యతిరేకతను చవిచూస్తున్న టీడీపీ నాయకులకు ఓటమి భయం పట్టుకుంది. ఏదో ఒకటి చేసి మళ్లీ తామే అధికారంలో ఉండాలన్న యావతో అడ్డదారులు తొక్కుతున్నారు. ఎన్నికల్లో ఎలాగోలా గట్టెక్కాలి. ఏదో ఒకటి చేసి మరోసారి గద్దెనెక్కాలనే దుర్బుద్ధితో సామ,దాన, భేద, దండోపాయాలన్నీ ప్రయోగిస్తున్నారు. ఈక్రమంలో తమకు అనుకూల ఓట్లును పదిలంగా ఉంచి, విపక్షాల ఓట్లను తొలగించారన్న ఆరోపణలు ఇప్పటికే ఉన్నాయి. అది చాలదన్నట్టుగా దొంగ ఓట్లను చేర్పించి తమ వక్రబుద్ధిని చాటుకున్నారు.
నకిలీ ఓట్ల బాగోతం
నకిలీ ఓట్లను అనేక రకాలుగా చేర్చారు. తమకొచ్చిన బోగస్ ఆలోచనలన్నీ పక్కాగా అమలు పరిచారు. ఈ అక్రమాలన్నీ ‘ఓటర్ అనలిస్టు అండ్ స్ట్రాటజీ టీమ్ (వాస్ట్) సంస్థ చేసిన అధ్యయనంలో తేలాయి. దాదాపు పది రకా లుగా నకిలీ ఓట్లు చేర్పించినట్టు ‘సాక్షి’ పరిశీలనలో తేలింది. ఆ సంస్థ జరిపిన పరిశీలనలో ఈ జిల్లా కు సంబంధించిన అనేక నకిలీ ఓట్లను గుర్తించిన విషయం బహిర్గతం కావడంతో చర్చనీ యాంశమయింది. వీటిని క్షేత్రస్థాయిలో పరిశీలించగా ఆసక్తికరమైన విషయాలువెలుగు చూశాయి.
మచ్చుకు కొన్ని..
♦ తొండంగి మండలం 148 పోలింగ్ బూత్‌లో సీరియల్ నంబర్లు 24,76లో మణి తలపంటి పేరుతో రెండు ఓట్లు ఉన్నాయి. బూత్ నంబరు 146లో సీరియల్ నంబరు45, 462లో నాగలక్ష్మి నట్టే పేరుతో రెండు ఓట్లున్నాయి.
♦ కోటనందూరు మండలంలో బూత్ నంబరు 1లో సీరియల్ నంబర్లు 378,379,987లో జేకే కీర్తి చింతకాయల పేరుతో నాలుగు ఓట్లు నమోదై ఉన్నాయి.
♦ కరప మండలంలో పోలింగ్ కేంద్రం 233లో, సీరియల్ నెంబర్ 712తో ఓటర్ ఐడీ ఐఎంజడ్ 0441592, డోర్ నెంబర్ 3–89, కృష్ణవేణి కొంపెళ్ల (46), భర్త సూర్యనారాయణ కామేశం పేరుతో ఓటు నమోదైంది. అదే పేరుతో మండపేట పోలింగ్ కేంద్రం 9లో సీరియల్ నెంబర్ 1051తో ఓటర్ ఐడీ ఐఎంజడ్ 0441592పై మరో ఓటు నమోదయింది.
♦ ఇలా జిల్లాలో అనేక నియోజకవర్గాల్లో ఒకే పేరుతో రెండేసి, మూడేసి, నాలుగేసి ఓట్లు నమోదయ్యాయి. ఆన్‌లైన్, ఆధార్, కంప్యూటరైజేషన్ వంటి సాంకేతికత పెరిగినా బోగస్ ఓట్లు చేరాయంటే అక్రమార్కులు ఎంత తెలివిగా వ్యవహరించారో అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో విడుదల చేసిన ఓటర్ల జాబితా చూస్తే నకిలీ ఓట్లతో ఎంత తప్పుల తడకగా నిండి ఉందో స్పష్టమవుతోంది. అధికార పార్టీ యంత్రాంగం ఏదో విధంగా మళ్లీ గెలవాలనే ఉద్దేశంలో భాగంగా తమకు అనుకూలమైన ఓటర్లను రెండు నియోజకవర్గాల జాబితాల్లో కొనసాగిస్తున్నట్టు సమాచారం.
♦ ఉదాహరణకు కాకినాడ రూరల్‌లో నివాసం ఉంటున్న వ్యక్తి పేరుతో కాకినాడ టౌన్‌లోనో, వేరే ఊరులోనో నమోదు చేయించినట్లు ఓటర్ జాబితాలో కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్నాయి. ఒకే పేరుతో తండ్రి పేరుమార్చి నమోదు చేయడం, వేరే గ్రామంలో ఉండేవారి పేర్లు నమోదు చేయించడం, వయస్సురాకుండా ఓటు నమోదు తదితర వాటిని బోగస్ ఓట్లుగా గుర్తిస్తారు. ఓటర్ల జాబితాలను సరిచూస్తుంటే ఒకే వ్యక్తి వేర్వేరు చోట్ల నమోదైన వివరాలు ఎలా నమోదయ్యాయి...సాంకేతికత ఏమయిందని ప్రజాస్వామ్యవాదులు వాపోతున్నారు.
ఓటు తొలగించారు
ఓటు వచ్చాక పలు ఎన్నికల్లో వినియోగించాను. 2014 ఎన్నికల్లో ఓటు వేశాను. ప్రస్తుతం విడుదల చేసిన జాబితాలో ఓటు తొలగించారు. అధికార పార్టీ నాయకుల ఓత్తిడి మేరకు అధికారులు ఇలా చేశారు. ఓటరు కార్డు ఉంది. ఓటు మాత్రం లేదు.– మానేశ్వరరావు బోదపు, తుని పట్టణం
ఇది దారుణం
రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోకుండా జాబితాలో తొలగించారు. ఎప్పటి నుంచో తుని పట్టణంలో ఉన్నాను. చాలా ఎన్నికల్లో ఓటు వేశాను. ఇప్పుడు ఎందుకు తొలగించారో తెలియడం లేదు. బూత్ లెవెల్ అధికారులను అడిగితే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు.–శ్యామ్ సుందర్ డిశెట్టి, తుని పట్టణం
Comments
Please login to add a commentAdd a comment