పోలీసులను, ప్రజలను హడలెత్తించిన ప్రచారం | False propaganda of Double murder | Sakshi
Sakshi News home page

పోలీసులను, ప్రజలను హడలెత్తించిన ప్రచారం

Published Mon, Apr 13 2015 3:18 AM | Last Updated on Sat, Sep 29 2018 4:52 PM

ముళ్ళపొదల్లో పడి ఉన్న అవయవాలను పరిశీలిస్తున్న డీఎస్పీ శ్రావణ్‌కుమార్ - Sakshi

ముళ్ళపొదల్లో పడి ఉన్న అవయవాలను పరిశీలిస్తున్న డీఎస్పీ శ్రావణ్‌కుమార్

మచిలీపట్నం:  మచిలీపట్నంలో ఆదివారం జంట హత్యలు జరిగాయంటూ జరిగిన ప్రచారం అటు పోలీసులను, ఇటు ప్రజలను హడలెత్తించింది. విషయం తెలుసుకున్న పోలీసులు సైతం పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. బందరు డీఎస్పీ సహా పలువురు ఎస్.ఐ.లు, సిబ్బంది మృత దేహాలు పడి ఉన్న ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. ఆ ప్రాంతంలో  మానవ శరీర అవయవాలు  కుళ్లిపోయి పడి ఉన్నాయి. మునిసిపల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా వాటిని అలా వదిలివేయడం కలకలం రేపిందని పోలీస్ అధికారులు తేల్చి చెప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

అసలు జరిగింది ఇదీ..
జిల్లా ప్రభుత్వాస్పత్రిలోని రెండు అనాథ శవాలను శనివారం మధ్యాహ్నం మునిసిపల్ సిబ్బంది ఖననం చేసేందుకు బైపాస్ రోడ్డులోని శ్మశానవాటికకు తీసుకెళ్లారు. మద్యం మత్తులో ఉన్న వారు వాటిని ఖననం చేయకుండా భద్రపరచిన అట్టపెట్టెల్లోనే చెట్ల మధ్య విసిరేసి వెనుదిరిగారు. ఆదివారం ఉదయం పెట్టెల్లోని అవయవాలను స్థానికంగా సంచరించే పందులు, కుక్కలు పీక్కుతింటూ ఆ ప్రాంతవాసుల కంటపడ్డాయి. దీంతో కంగారుపడిన స్థానికులు పలువురు ఎవరినో హత్య చేసి చెట్ల మధ్య పడేశారంటూ ప్రచారం మొదలుపెట్టారు. డీఎస్పీ డి.ఎస్. శ్రావణ్‌కుమార్, చిలకలపూడి స్టేషన్ ఎస్‌ఐలు, సిబ్బంది హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకున్నారు. శరీర అవయవాలతో పాటు అట్టపెట్టెల్లో కెమికల్స్ ఉండడంతో బాక్సులను తెరచి చూసిన పోలీసులు విషయాన్ని గ్రహించి ఆస్పత్రిలోని శవాలను శ్మశానవాటికలో ఖననం చేయాల్సిన మునిసిపల్ సిబ్బంది నిర్లక్ష్యంగా వదిలేయడంతో హత్యలు జరిగినట్లు స్థానికులు భావించి భయభ్రాంతులకు గురైనట్లు తేల్చారు.

ఈ విషయమై మునిసిపల్ కమిషనర్ ఎ.మారుతీదివాకర్‌ మాట్లాడుతూ ఆస్పత్రిలోని శవాలను మునిసిపల్ సిబ్బందితో ఖననం చేయించాలంటే ముందుగా పురపాలక సంఘానికి ఆస్పత్రి తరపున లెటర్ పెడితే అప్పుడు సిబ్బందిని అక్కడికి పంపుతామని చెప్పారు. జరిగిన వ్యవహారంలో తమకెలాంటి సమాచారం లేదని, అయినప్పటికీ ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement