Human organs
-
గురువుని మించిన శిష్యులు, అంతరిక్షానికి మనుషుల అవయవాలు!!
అమెరికాకు చెందిన ఇద్దరు కుర్రాళ్లు మనుషుల కృత్తిమ అవయవాల్ని స్పేస్‌లో స్టోర్ చేసేందుకు ప్రయోగాల్ని ముమ్మరం చేస్తున్నారు. ఈ ప్రయోగాల్లో భాగంగా తొలిసారి వాళ్లిద్దరు తయారు చేస్తున్న ప్రత్యేక క్యాప్సుల్స్‌లో కొన్ని వస్తువుల్ని స్పేస్‌లోకి పంపి.. తిరిగి 25 రెట్లు వేగంతో భూమికి చేర్చాలని చూస్తున్నారు. ఈ ప్రయోగాల కోసం 10 మిలియన్ల పెట్టుబడులు వచ్చాయి. ఇంతకీ వాళ్లిద్దరూ ఎవరని అనుకుంటున్నారా? ఒకరు కాలేజీ డ్రాపౌట్ కాగా మరొకరు స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ శిష్యుడు. భూమిపై ఏదైనా నష్టం జరిగి.. మనిషి మనుగుడ కష్టమైతే ఏం చేయాలి. అందుకే అంతరిక్షంలో ఇళ్లు ఏర్పాటు చేసేలా ఎలన్ మస్క్ ఆ దిశగా ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పుడు అదే ఎలన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్‌లో ఇంటర్న్ షిప్‌ని మధ్యలోనే వదిలేసిన ఆయన శిష్యుడు జస్టిన్ ఫియాషెట్టి, మరో కాలేజీ డ్రాపౌట్ ఆస్టిన్ బ్రిగ్స్ తో కలిసి స్టార్టప్‌ను ప్రారంభించారు. ఆ స్టార్టప్ ముఖ్య ఉద్దేశం. మనుషుల కృత్తిమ అవయావాల్ని అంతరిక్షంలో స్టోర్ చేయడమే. అలా స్టోర్ చేసిన ఆర్టీఫిషియల్ ఆర్గాన్స్‌ను ట్రీట్మెంట్ కోసం ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడీ ఈ స్టార్టప్ ఐడియా అమెరికాలో హాట్ టాపిగ్గా మారింది. ఎందుకంటే స్పేస్ టూరిజం ఊపందుకోవడంతో.. ఈ ఇద్దరు యువకులు చేస్తున్న ప్రయోగం విజయవంతం అవుతుందని అందురు భావిస్తున్నారు. అందుకే ఇన్వెస్టర్లు భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. ఆ పెట్టుబడులతోనే ఆ ఇద్దరు యువకులు ముందుగా వాళ్లు తయారు చేస్తున్న క్యాప్సుల్స్‌లో కొన్ని వస్తువుల్ని స్పేస్‌లోకి పంపించాలని ప్రయోగాల్ని కొనసాగిస్తున్నారు. అదే విజయవంతం అయితే కృత్రిమ మానవ అవయవాలను స్పేస్‌లో స్టోర్ చేసి.. అవసరం అనుకున్నప్పుడు ఆస్పత్రికి తరలించవచ్చు. ఇందుకోసం అంతరిక్షంలో స్పేస్ స్టోరేజ్ యూనిట్లు మొబైల్ హాస్పిటల్ యూనిట్లను ఏర్పాటు చేయోచ్చని జస్టిన్ ఫియాషెట్టి, ఆస్టిన్ బ్రిగ్స్ చెబుతున్నారు. మరి వాళ్లిద్దరు ప్రారంభించిన స్టార్టప్ విజయ వంతం అవుతుందా? లేదా అనేది తెలియాలంటే మరిన్ని ప్రయోగాల్ని చేయాల్సి ఉంటుంది. చదవండి: గ్యాప్ తీసుకోలేదు..వచ్చింది అంతే! ఎలన్ మస్క్ యుద్ధం వచ్చినా ఆగేలా లేడే! -
మూడు కిడ్నీలు, ఆరు లివర్లుగా వ్యాపారం..!
సాక్షి, న్యూఢిల్లీ : మూలిగే నక్క మీద తాడిపండు పడ్డట్టు ఆర్థికంగా దివాలా తీసిన ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు విధించడంతో అక్కడ పేదరికం పెచ్చరిల్లుతోంది. కూడు, గుడ్డ కరువైన పేద వారు అక్కడ బతకడం కోసం కిడ్నీల నుంచి కాలేయం వరకు శరీర అవయవాలను అమ్ముకుంటున్నారు. దాంతో మూడు కిడ్నీలు, ఆరు లివర్లుగా అక్కడ అవయవాల వ్యాపారం జోరుగా సాగుతోంది. దీంతో టెహరాన్‌లోని ఓ వీధి కాస్త ‘కిడ్నీ స్ట్రీట్’గా మారిందని, అక్కడ పదివేల డాలర్లకు కిడ్నీ, 50 వేల డాలర్లకు లివర్ దొరుకుతోందని పారిస్ కేంద్రంగా పనిచేస్తున్న ‘నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆఫ్ ఇరాన్ (ఎన్సీఆర్ఐ)’ వెల్లడించింది. తాము సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాం.. కొనేవాళ్లు తమను సంప్రదించేందుకు వీలుగా టెహ్రాన్‌లోని కిడ్నీ స్ట్రీట్‌లో తమ కిడ్నీలను అమ్ముకోదలచిన వారు తమ పేరు, బ్లడ్ గ్రూప్, ఫోన్ నెంబర్లను రాసిన చీటీలను గోడల మీద అతికించి పోతున్నారని ఎన్సీఆర్ఐ వర్గాలు తెలిపాయి. దివ్యాంగురాలైన తన తల్లి సంరక్షణ కోసం తన కిడ్నీని అమ్మకానికి పెట్టిన పీహెచ్డీ విద్యార్థితోపాటు, రెండు కిడ్నీలతోపాటు ఎముక మూలుగను కూడా అమ్మకానికి పెట్టిన ఓ 26 ఏళ్ల యువకుడి వివరాలు ‘మానవ అవయవాల అమ్మకాలు జరిపే ఓ వెబ్సైట్’లో ఉన్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఇలా తమ అవయవాలను అమ్మకానికి పెట్టిన వారిలో ఎక్కువ మంది తాము క్రీడాకారులమని, తాము సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నామని ఆ వెబ్సైట్లో ప్రకటనలు కూడా ఇస్తున్నారు. ఆ వెబ్సైట్ ద్వారా కాలేయం 15 వేల డాలర్ల నుంచి 50 వేల డాలర్ల వరకు, కిడ్నీలు పదివేల డాలర్ల వరకు, ఎముకల మూలుగ పది వేల డాలర్ల వరకు అమ్ముడు పోతున్నాయని ఆ వర్గాలు వివరించాయి. ఎక్కడ చూసినా అవే వివరాలు.. ‘కిడ్నీ స్ట్రీట్’లోని అన్ని ఆస్పత్రుల వద్ద అవయవ అమ్మకం దార్ల పేర్లు, ఫోన్ నెంబర్ల వివరాలు విరివిగా లభిస్తున్నాయని ఓ ఏజెంట్ తెలిపారు. ఏ గోడ మీద చూసినా, ఏ తలుపు మీద చూసిన వారి వివరాలు ఉంటున్నాయని, తనను ఈ విషయంలో సంప్రదించిన వాళ్లే కొన్ని వందల మంది ఉంటారని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని ఆ ఏజెంట్ తెలిపారు. అమెరికా–ఇరాన్ అణు ఒప్పందం నుంచి ఇరాన్ బయటకు వచ్చిన 2015 సంవత్సరంలో ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు విధించింది. సౌదీ అరేబియాలోని ఓ చమురు క్షేత్రంపై ఇటీవల జరిగిన డ్రోన్ దాడి వెనక కూడా ఇరాన్‌నే ఉందన్న ఆరోపణలతో అమెరికా గురువారం నాడు కూడా మరిన్ని ఆంక్షలు విధించింది. దాంతో ఇరాన్ ప్రజల్లో ఆర్థిక వ్యవస్థ పట్ల భయాందోళనలు తీవ్రమయ్యాయి. -
పందుల్లో మానవ అవయవాల పెంపకం
పందుల్లో మానవ అవయవాలను పెంచడం పట్ల ప్రపంచవ్యాప్తంగా ఎన్ని విమర్శలు వెల్లువెత్తుతున్నా అమెరికాకు చెందిన కాలిఫోర్నియా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు మాత్రం దీనివైపే మొగ్గు చూపుతున్నారు. రోగులకు అవసరమైన కాలేయం, గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు తదితర అవయవాలను దానం చేసే దాతలు తగినంత మంది అందుబాటులోలేని నేటి సమాజంలో ఇదొక్కటే తమ ముందున్న ప్రత్యామ్నాయమని వారు వాదిస్తున్నారు. మానవ అవయవాలను పంది పిండంలో పెంచడం వల్ల పంది మెదడులో ఊహించని మార్పులు సంభవించవచ్చని, వాటికి కూడా ఏదో రకమైన మానవ లక్షణాలు రావచ్చని, ఈ సంకర పద్ధతి సహజ ప్రకృతికి విరుద్ధమనే వాదనను కూడా వారు కొ్ట్టేస్తున్నారు. పంది పిండంలోకి మానవ మూలకణాలను ఎక్కించి 28 రోజులపాటు అవి ఆ పిండంలో పెరిగేందుకు వీలు కల్పిస్తామని, దీన్ని సంకర పిండమని పిలుస్తామని, ఆ పిండం పిల్లగా మారడానికి ముందే వాటిని తొలగిస్తామని యూనివర్శిటీకి చెందిన డేవిస్ అనే ప్రొఫెసర్ తెలియజేస్తున్నారు. పిండం పెరిగే దశలో పంది మెదడులో ఎలాంటి మార్పులు చోటు చేసుకోవడం లేదని, ఒక్క పిండంలో తప్పించి పంది ఏ అవయవాల్లోను ఎలాంటి మార్పులు లేవని తమ పరిశోధనల్లో తేలినట్లు ఆయన వాదిస్తున్నారు. పిండాన్ని పిల్లగా ప్రసవించేందుకు పందికి అవకాశం కల్పిస్తేనే ప్రకృతికి విరుద్ధంగా వ్యవహరించినట్లు అవుతుందని ఆయన అంటున్నారు. మానవ రోగికి అవసరమైన రీతిలో అవయవాలను పెరిగేలా చేయడం కోసం సంకర పిండాన్ని రెండు దశల్లో ఎడిట్ చేస్తామని, మొదటి దశను క్రిస్మర్ అని పిలుస్తామని డేవిస్ తెలిపారు. పంది క్లోమగ్రంధి పెరిగేదశలో దానికి సంబంధించిన డీఎన్ఏను తొలగించేందుకు క్రిస్పర్ టెక్నిక్కు ఉపయోగిస్తామని ఆయన వివరించారు. రెండో దశలో 'హ్యూమన్ ఇండ్యూస్డ్ ప్లూరిపోటెంట్' మూల కణాలను పిండంలోకి ఎక్కిస్తామని, ఈ కణాల వల్ల పందిపిండంలో మానవ క్లోమగ్రంధి ఏర్పడుతుందని ఆయన వివరించారు. మానవ అవయవాలకు పంది మంచి 'బయోలోజికల్ ఇంక్యుబేటర్' అని ఇలాంటి ప్రయోగాలకు నేతత్వం వహిస్తున్న పాబ్లో రోస్ తెలిపారు. దాతాలు ఇచ్చే అవయవాలకన్నా యవ్వనంగా, ఆరోగ్యకరంగా పందుల్లో పెంచుతున్న మానవ అవయవాలు ఉంటున్నాయని ఆయన చెప్పారు. పందులను మానవ ఇంక్యుబేటర్‌గా వాడడాన్ని జంతుకారుణ్య సంస్థలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది అనైతికమని వాదిస్తున్న వైద్యనిపుణులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే గతేడాది అమెరికా జాతీయ వైద్య పరిశోధనా సంస్థ ఇలాంటి ప్రయోగాలకు నిధులు సమకూర్చడంపై ఆంక్షలు విధించింది. మానవ అవయవాలను దానం చేసేందుకు చాలినంత మంది దాతలు పెరిగిన పక్షంలో పందులపై ఆధారపడాల్సిన అవసరం లేదని, అంతవరకు ఇలాంటి ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించక తప్పదని ఇలాంటి ప్రయోగాలు నిర్వహించే మిన్నేసోటాకు చెందిన కంపెనీ యజమాని స్కాట్ ఫహ్రేన్ క్రగ్ అంటున్నారు. బ్రిటన్‌లో ఎప్పుడు చూసినా అవయవ దానం కోసం ఏడువేల మంది రోగులు నిరీక్షిస్తూ ఉంటారని, అవయవాలు దొరక్క వారిలో వందలాది మంది చనిపోతున్నారని ఆయన చెప్పారు. -
పోలీసులను, ప్రజలను హడలెత్తించిన ప్రచారం
మచిలీపట్నం: మచిలీపట్నంలో ఆదివారం జంట హత్యలు జరిగాయంటూ జరిగిన ప్రచారం అటు పోలీసులను, ఇటు ప్రజలను హడలెత్తించింది. విషయం తెలుసుకున్న పోలీసులు సైతం పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. బందరు డీఎస్పీ సహా పలువురు ఎస్.ఐ.లు, సిబ్బంది మృత దేహాలు పడి ఉన్న ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. ఆ ప్రాంతంలో మానవ శరీర అవయవాలు కుళ్లిపోయి పడి ఉన్నాయి. మునిసిపల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా వాటిని అలా వదిలివేయడం కలకలం రేపిందని పోలీస్ అధికారులు తేల్చి చెప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అసలు జరిగింది ఇదీ.. జిల్లా ప్రభుత్వాస్పత్రిలోని రెండు అనాథ శవాలను శనివారం మధ్యాహ్నం మునిసిపల్ సిబ్బంది ఖననం చేసేందుకు బైపాస్ రోడ్డులోని శ్మశానవాటికకు తీసుకెళ్లారు. మద్యం మత్తులో ఉన్న వారు వాటిని ఖననం చేయకుండా భద్రపరచిన అట్టపెట్టెల్లోనే చెట్ల మధ్య విసిరేసి వెనుదిరిగారు. ఆదివారం ఉదయం పెట్టెల్లోని అవయవాలను స్థానికంగా సంచరించే పందులు, కుక్కలు పీక్కుతింటూ ఆ ప్రాంతవాసుల కంటపడ్డాయి. దీంతో కంగారుపడిన స్థానికులు పలువురు ఎవరినో హత్య చేసి చెట్ల మధ్య పడేశారంటూ ప్రచారం మొదలుపెట్టారు. డీఎస్పీ డి.ఎస్. శ్రావణ్‌కుమార్, చిలకలపూడి స్టేషన్ ఎస్ఐలు, సిబ్బంది హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకున్నారు. శరీర అవయవాలతో పాటు అట్టపెట్టెల్లో కెమికల్స్ ఉండడంతో బాక్సులను తెరచి చూసిన పోలీసులు విషయాన్ని గ్రహించి ఆస్పత్రిలోని శవాలను శ్మశానవాటికలో ఖననం చేయాల్సిన మునిసిపల్ సిబ్బంది నిర్లక్ష్యంగా వదిలేయడంతో హత్యలు జరిగినట్లు స్థానికులు భావించి భయభ్రాంతులకు గురైనట్లు తేల్చారు. ఈ విషయమై మునిసిపల్ కమిషనర్ ఎ.మారుతీదివాకర్ మాట్లాడుతూ ఆస్పత్రిలోని శవాలను మునిసిపల్ సిబ్బందితో ఖననం చేయించాలంటే ముందుగా పురపాలక సంఘానికి ఆస్పత్రి తరపున లెటర్ పెడితే అప్పుడు సిబ్బందిని అక్కడికి పంపుతామని చెప్పారు. జరిగిన వ్యవహారంలో తమకెలాంటి సమాచారం లేదని, అయినప్పటికీ ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.