పందుల్లో మానవ అవయవాల పెంపకం
పందుల్లో మానవ అవయవాలను పెంచడం పట్ల ప్రపంచవ్యాప్తంగా ఎన్ని విమర్శలు వెల్లువెత్తుతున్నా అమెరికాకు చెందిన కాలిఫోర్నియా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు మాత్రం దీనివైపే మొగ్గు చూపుతున్నారు. రోగులకు అవసరమైన కాలేయం, గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు తదితర అవయవాలను దానం చేసే దాతలు తగినంత మంది అందుబాటులోలేని నేటి సమాజంలో ఇదొక్కటే తమ ముందున్న ప్రత్యామ్నాయమని వారు వాదిస్తున్నారు. మానవ అవయవాలను పంది పిండంలో పెంచడం వల్ల పంది మెదడులో ఊహించని మార్పులు సంభవించవచ్చని, వాటికి కూడా ఏదో రకమైన మానవ లక్షణాలు రావచ్చని, ఈ సంకర పద్ధతి సహజ ప్రకృతికి విరుద్ధమనే వాదనను కూడా వారు కొ్ట్టేస్తున్నారు.
పంది పిండంలోకి మానవ మూలకణాలను ఎక్కించి 28 రోజులపాటు అవి ఆ పిండంలో పెరిగేందుకు వీలు కల్పిస్తామని, దీన్ని సంకర పిండమని పిలుస్తామని, ఆ పిండం పిల్లగా మారడానికి ముందే వాటిని తొలగిస్తామని యూనివర్శిటీకి చెందిన డేవిస్ అనే ప్రొఫెసర్ తెలియజేస్తున్నారు. పిండం పెరిగే దశలో పంది మెదడులో ఎలాంటి మార్పులు చోటు చేసుకోవడం లేదని, ఒక్క పిండంలో తప్పించి పంది ఏ అవయవాల్లోను ఎలాంటి మార్పులు లేవని తమ పరిశోధనల్లో తేలినట్లు ఆయన వాదిస్తున్నారు. పిండాన్ని పిల్లగా ప్రసవించేందుకు పందికి అవకాశం కల్పిస్తేనే ప్రకృతికి విరుద్ధంగా వ్యవహరించినట్లు అవుతుందని ఆయన అంటున్నారు.
మానవ రోగికి అవసరమైన రీతిలో అవయవాలను పెరిగేలా చేయడం కోసం సంకర పిండాన్ని రెండు దశల్లో ఎడిట్ చేస్తామని, మొదటి దశను క్రిస్మర్ అని పిలుస్తామని డేవిస్ తెలిపారు. పంది క్లోమగ్రంధి పెరిగేదశలో దానికి సంబంధించిన డీఎన్‌ఏను తొలగించేందుకు క్రిస్పర్ టెక్నిక్‌కు ఉపయోగిస్తామని ఆయన వివరించారు. రెండో దశలో 'హ్యూమన్ ఇండ్యూస్డ్ ప్లూరిపోటెంట్' మూల కణాలను పిండంలోకి ఎక్కిస్తామని, ఈ కణాల వల్ల పందిపిండంలో మానవ క్లోమగ్రంధి ఏర్పడుతుందని ఆయన వివరించారు.
మానవ అవయవాలకు పంది మంచి 'బయోలోజికల్ ఇంక్యుబేటర్' అని ఇలాంటి ప్రయోగాలకు నేతత్వం వహిస్తున్న పాబ్లో రోస్ తెలిపారు. దాతాలు ఇచ్చే అవయవాలకన్నా యవ్వనంగా, ఆరోగ్యకరంగా పందుల్లో పెంచుతున్న మానవ అవయవాలు ఉంటున్నాయని ఆయన చెప్పారు. పందులను మానవ ఇంక్యుబేటర్‌గా వాడడాన్ని జంతుకారుణ్య సంస్థలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది అనైతికమని వాదిస్తున్న వైద్యనిపుణులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే గతేడాది అమెరికా జాతీయ వైద్య పరిశోధనా సంస్థ ఇలాంటి ప్రయోగాలకు నిధులు సమకూర్చడంపై ఆంక్షలు విధించింది. మానవ అవయవాలను దానం చేసేందుకు చాలినంత మంది దాతలు పెరిగిన పక్షంలో పందులపై ఆధారపడాల్సిన అవసరం లేదని, అంతవరకు ఇలాంటి ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించక తప్పదని ఇలాంటి ప్రయోగాలు నిర్వహించే మిన్నేసోటాకు చెందిన కంపెనీ యజమాని స్కాట్ ఫహ్రేన్ క్రగ్ అంటున్నారు. బ్రిటన్‌లో ఎప్పుడు చూసినా అవయవ దానం కోసం ఏడువేల మంది రోగులు నిరీక్షిస్తూ ఉంటారని, అవయవాలు దొరక్క వారిలో వందలాది మంది చనిపోతున్నారని ఆయన చెప్పారు.