వరంగల్‌లో పేరొందిన మహాత్మాగాంధీ మెమోరియల్ ప్రభుత్వాసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్న ఒక రోగిని ఇటీవల ఎలుకలు దారుణంగా కొరికి గాయపరిచిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సుమారు ఐదేళ్ల క్రితం ఉస్మానియా మార్చురీలో భద్రపరిచిన యువతి శవాన్ని ఎలుకలు, పందికొక్కులు కొరికిన ఘటన కూడా అప్పట్లో కలకలం రేపింది.
మెదక్ ఆస్పత్రి మార్చురీలో కూడా మూడేళ్ల క్రితం ఓ మృతదేహాన్ని పందికొక్కులు పీక్కుతిన్నాయి. తాజాగా వరంగల్ ఘటనలో రోగి (కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఇతను తర్వాత హైదరాబాద్ నిమ్స్‌లో చనిపోయాడు) కాళ్ల నుంచి రక్తస్రావం అయ్యేలా ఎలుకలు కొరికేయడం.. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల పరిస్థితి, నిర్వహణపై చర్చకు తెరతీసింది. ఐసీయూలోనే ఇలా ఉంటే సాధారణ వార్డులు, గదులు ఎలా ఉంటాయోనన్న సందేహాలకు తావిచ్చింది. దీంతో ‘సాక్షి’.. రాజధాని హైదరాబాద్‌లోని ప్రముఖ ప్రభుత్వాసుపత్రులతో పాటు పలు జిల్లా కేంద్రాల్లోని సర్కారు దవాఖానాలను సందర్శించి పరిస్థితులను పరిశీలించింది.
సాక్షి, నెట్‌వర్క్/గాంధీ ఆస్పత్రి/నాంపల్లి /అఫ్జల్‌గంజ్: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో పారిశుధ్య నిర్వహణ కొరవడింది. అపరి శుభ్ర వాతావరణం రాజ్య మేలుతోంది. ఎటు చూసినా చెత్తాచెదా రం, ప్లాస్టిక్ కవర్లు దర్శనమిచ్చాయి. కొన్నిచోట్ల డ్రైనేజీలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ అపరిశుభ్ర వాతావరణం ఎలుక లు, పంది కొక్కులు ఆస్పత్రులను తమ ఆవాసాలు గా చేసుకునేందుకు దోహదపడుతోంది.
మరోవైపు రోగులు, వారి సహాయకులు.. తినగా మిగిలిన ఆహారాన్ని, ఇతర తినుబండారాలను పడవేస్తున్నారు. ఈ ఆహార వ్యర్థాల కోసం ఎలుకలు, పంది కొక్కులు ఆసుపత్రుల ఆవరణలో, వార్డుల్లో స్వైర విహారం చేస్తున్నాయి. ఎప్పటికప్పుడు ఆస్పత్రి ఆవరణను, వార్డులను శుభ్రంగా ఉంచాల్సిన సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కొన్ని ఆస్పత్రుల్లో కుక్కలు, కోతులు, పాములు కూడా తిరుగుతున్నట్లు రోగులు, వారి సహాయకులు చెబుతున్నారు.
ఇది మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి దుస్థితి. పాత ఐసీయూ వెనుక భాగంలో చెత్తా చెదారం పేరుకుపోయింది. పందులు, ఎలుకలకు ఆవాసంగా మారింది.
నిర్లక్ష్యానికి కేరాఫ్ నిలోఫర్
నగరంలోని ప్రముఖ నవజాత శిశువుల సంరక్షణా కేంద్రమైన నిలోఫర్ ఆసుపత్రి అపరిశుభ్రతకు కేరాఫ్‌గా మారింది. ఎక్కడ చూసినా చెత్తా చెదారంతో నిండిపోయింది. పాత, కొత్త, లోపల, బయట అనే తేడా లేకుండా ఆసుపత్రిలోని అన్నిచోట్లా అపరిశుభ్రత నెలకొంది. రోగులు, సహాయకులు పడేసే ఆహారం కోసం చుట్టుపక్కల ఉన్న బస్తీల నుంచి ఎలుకలు ఆసుపత్రి వైపు వస్తున్నాయి. డ్రైనేజీ మ్యాన్‌హోల్స్‌లో ఉంటూ రాత్రివేళ ఆస్పత్రిలో సంచరిస్తున్నాయి.
గాంధీ సెల్లార్‌లో ఫుల్లు
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి సెల్లార్‌లో ఎలుకలు, పందికొక్కులు స్వైర విహారం చేస్తున్నాయి. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేక అక్కడ మురుగునీరు చేరుతోంది. ప్రధాన భవనం గ్రౌండ్‌ఫ్లోర్‌లోని గైనకాల జీ, లేబర్‌వార్డు, పీడియాట్రిక్, పీఐసీయూ, ఎస్‌ఎన్‌సీయూ తదితర వార్డుల్లో ఎలుకల సంచా రం తరచూ కనిపిస్తోందని పలువురు రోగులు తెలిపారు. 2015లో నవజాత శిశువులకు వైద్యం అందించే ఎస్‌ఎన్‌సీయూ వార్డులో ఎలుకలు కనిపించడంతో అప్పట్లో చర్యలు చేపట్టారు. తాజాగా వరంగల్ ఎంజీఎం ఘటనతో అప్రమత్తమైన గాంధీ ఆస్పత్రి అధికార యంత్రా ంగం ఎలుకల నివారణకు గుళి కల ప్రయోగం చేపట్టడంతో పాటు పలు వార్డుల్లో బోన్లు, ర్యాట్ ప్యాడ్‌లను ఏర్పాటు చేశారు.
పందికొక్కులకు ‘చిరునామా’
జనగామ జిల్లా వందపడకల ఆస్పత్రి ఆవరణలో డ్రెయినేజీలను తోడేస్తున్నాయి. జనరేటర్ ఏర్పాటు చేసిన గది ఆవరణ, ఆర్‌టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించే ల్యాబ్ ముందు భాగం, జనరల్ వార్డు వెనకాల పెద్ద పెద్ద కన్నాలు ఏర్పడ్డాయి.
ఎలుకల కోసం పాములు
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి భవనం ముందు భాగాన్ని ఇటీవల అం దంగా తీర్చిదిద్దారు. కానీ లోపల వార్డులు, ఆసుపత్రి పరిసరాలు మాత్రం అధ్వానంగా ఉన్నాయి. వెనుక భాగం చెత్తాచెదారం, చెట్ల పొదలతో నిండిపోయింది. గత ఏడాది డిసెంబర్ 21న రాత్రి సమయంలో పేషెంట్ కేర్‌టేకర్‌గా పనిచేసే వేముల సంపత్‌ను ఆసుపత్రి ప్రాంగణంలోనే పాము కాటేసింది. అంతకుముందు కూడా ఆసుపత్రిలో పనిచేసే మరొకరిని పాము కాటు వేసింది.
వార్డుల్లో ఎలుకలు తిరుగుతుండడంతో వాటి కోసం పాములు వస్తున్నాయని చెబుతున్నారు. పాత భవనం కావడంతో వార్డుల్లో గోడలకు కన్నాలు ఉండడం, అం దులో ఎలుకలు, బొద్దింకలు చేరడంతో వాటి కోసం పాములు వస్తున్నాయి. వంద పడకల యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రి ఆవరణ చుట్టూ పందికొక్కులు రంధ్రాలు చేశాయి. పగలు, రాత్రి తేడాలేకుండా సంచరిస్తున్నాయి.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పెద్దాస్పత్రిలో కూడా పరిస్థితి దారుణంగా ఉంది. ముఖ్యంగా ఆస్పత్రి మార్చురీలో 4 ఫ్రీజర్ బాక్స్‌లు ఉండగా అవి పనిచేయడం లేదు. దీంతో రెండు శవాలను కిందపడేశారు. వాటి ని పురుగులు, దోమలు, ఈగలు పీక్కు తింటుండటంతో గుర్తుపట్టలేని విధంగా తయారయ్యాయి. ఆ ప్రాంతమంతా దుర్వాసన వస్తోంది. కాగా శానిటేషన్‌పై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని ఆయా ఆస్పత్రుల సూపరింటెండెంట్లు ‘సాక్షి’కి తెలిపారు.
ఉస్మానియాలో కుక్కల వీరంగం
పేదల పెద్దాసుపత్రి హైదరాబాద్‌లోని ఉస్మానియాలో కుక్కలు, కోతులు, పిల్లుల బెడద ఎక్కువగా ఉంది. ఆసుపత్రి పరిసరాల్లో కుక్కలు వీరంగం సృష్టిస్తుంటే, కోతులు రోగులు వారి సహాయకులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఆసుపత్రి నుండి రోగి కోలుకొని తిరిగి వెళ్లే సమయంలో కొబ్బరికాయలు కొడుతుండడంతో వాటి కోసం కోతులు ఎగబడుతున్నాయి.
2017లో ఆత్మహత్యకు పాల్పడిన అఫ్జల్‌సాగర్ ప్రాంతానికి చెందిన ఓ యువతి మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచారు. తర్వాత మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు వచ్చిన కుటుంబసభ్యులు.. ముక్కు, పెదవుల్ని ఎలుకలు, పందికొక్కులు కొరికిన స్థితిలో ఉన్న యువతి శవాన్ని చూసి భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటన అప్పట్లో తీవ్ర కలకలం సృష్టించింది.
Comments
Please login to add a commentAdd a comment